‘ఆల్ గ్రోన్ అప్’ నవల.. రచయిత జేమీ అటెన్బెర్గ్
ఏండ్రియా బెర్న్ 39 ఏళ్ళ అవివాహితురాలు. తాగుతుంది. అప్పుడప్పుడూ డ్రగ్స్ తీసుకుంటుంది. ‘ఎంతోమందితో శృంగారం జరిపినప్పటికీ, ఎవరితోనూ బంధాలు కలిపించుకోవాలని అనిపించదు’ అని తను తరచూ వెళ్ళే థెరపిస్టుతో చెబుతుంది. ‘నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు అని చెప్పిన మరుక్షణం, వాళ్ళు నమ్మరు. అబద్ధాలు చెప్తు్తన్నాననుకుంటారు’ అంటుంది.
ఒకానొకప్పుడు ఆమె చిత్రకారిణి. ‘ఆ కళ నాలో ఉండి ఉండదు. అది నాకు ఆర్థికంగా సహాయపడలేదనుకున్నప్పుడే, దాన్ని విడిచిపెట్టాను. చిత్రకారిణి అవడం అంటే, జీవితకాలం సహాయం లేకుండా ఉండటం’ అనుకుని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న చిన్న అపార్టుమెంట్ అద్దెకి తీసుకుని ఉద్యోగం చేసుకుంటుంటుంది.
ఏండ్రియా బాల్యంలోనే తండ్రి డ్రగ్సుకు అలవాటు పడి చనిపోతాడు. తల్లి గతంలో ‘డిన్నర్ పార్టీల’కు పురుషులని ఆహ్వానిస్తూ బతుకు వెళ్ళదీసేది. అప్పుడు కూతురు ఎదుర్కొన్న ఒకానొక సంఘటన వల్ల, తల్లి ఆ వ్యాపారాన్ని ఆపేస్తుంది.
ఏండ్రియా చుట్టుపక్కల ఉన్నవారందరూ పెళ్ళయినవారో, చేసుకోబోతున్నవారో, పిల్లల్ని పెంచుతున్నవారో. ఆమె వీటిమీద మోహపడదు. పాత కాలేజి స్నేహితులు తమ పెళ్ళిళ్ళ, కుటుంబాల ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెడుతూ, ‘నీకిష్టమేమో చూడు. ఇతన్ని చూస్తే, నువ్వే గుర్తొచ్చావు’ అన్నప్పుడు, ‘డిజ్‌లైక్ బటన్ ఎక్కడ? అరిచే బటన్ ఎందుకు లేదో!’ అంటూ, కోపం తెచ్చుకుంటుంది. స్నేహితురాలైన ఇండిగో, తనకి పుట్టిన పిల్లని ఏండ్రియా చేతులకి అందించినప్పుడు, సామాజిక మర్యాదను పాటించకుండా, ‘దీనికన్నా గ్లాసుడు వైన్ తాగితే నయం’ అనేంత విముఖత పిల్లలంటే.
ఇటువంటి అభిప్రాయాలున్న ఏండ్రియా, అభివృద్ధికి నిర్వచనాలిచ్చే ప్రపంచంలో ఇమడలేకపోతుంది. తనకి కావలసినదేమిటో ఏండ్రియాకి తెలియదు. అలా అని తనకేది వద్దో అని ఆమెకి తెలుసునని కాదు.
ఏండ్రియా అన్న తన విషాదకరమైన బాల్యాన్ని మరచిపోతాడు. స్నేహితుడు మేథ్యూ, చేతిలో చిల్లికాణీ లేనప్పటికీ చిత్రలేఖనాన్ని కొనసాగిస్తాడు. తను పరిపూర్ణమైన వ్యక్తిని కాననీ, తను తన జీవితంతో కానీ, తనయందు తాను కానీ సంతోషంగా లేననీ ఏండ్రియాకు తెలుసు. బతకడానికి అవసరం అని తను అనుకున్నదేదైనా చేయడానికి ఆమె సిద్ధమే.
అన్నావదినలకి పుట్టిన ‘సిగ్రిద్’ ప్రమాదకరమైన వ్యాధికి గురయినప్పుడు, ‘నా దుఃఖమే ఇంతుంది. వారి బాధనెక్కడ పట్టించుకోను!’ అన్న మనిషి, మేనగోడలు మరణిస్తోందని తెలిసినప్పుడు, తన ఉద్యోగం గురించి పట్టించుకోకుండా– తన కుటుంబం పడే బాధలో పాలుపంచుకుంటూ, తనని వీడిపోతున్న జీవితాన్ని తిరిగి పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. తన జీవితానికి భాగం అయినవారినుండి తను కోరుకునేదేమిటో, మరీ ముఖ్యంగా– తననుండే తనకి కావలసినదేమిటో అని పరిశీలించుకుంటుంది.
పరిహాసకరంగా ఉండి, పదునైన అభిప్రాయాలతో రాసిన ‘ఆల్ గ్రోన్ అప్’ నవల పట్టణంలో వొంటరిగా నివసించే స్త్రీ గురించినది. రచయిత్రి జేమీ అటెన్బెర్గ్ –ఏండ్రియా కంఠాన్నీ, పాత్రనూ భావోద్వేగాలతో, నిజాయితీతోనూ నింపుతారు. నవల్లో చమత్కారానికి కొదవుండదు. కథనం సూటిగా, బిగుతుగా ఉంటుంది. చైతన్య స్రవంతిలో ఉండే పుస్తకంలో, ఏండ్రియా టీనేజీ వయస్సు నుండీ– ఆమెకి కుటుంబంతో, స్నేహితులతో సహోద్యోగులతో, జీవితంలో కలిసిన పురుషులతోనూ ఉండే సంబంధాల వివరాలుంటాయి. ఆమె చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపు, అన్యోన్యత లేని తల్లిదండ్రుల సంబంధం గురించి పాఠకులకు తెలుస్తాయి.
ఆమె ఎలా జీవించాలో అని నిర్దేశించే సమాజం గురించి హాస్యంగా చిత్రిస్తారు రచయిత్రి. మొదటి అధ్యాయంలో కొంతభాగం తప్ప, నవలంతటా ఏండ్రియా దృష్టికోణంతో ఉండేదే. ప్రతీదీ చక్కబడి, సుఖాంతం అయిన నవల కాదిది. దీన్ని 2017లో మొదట అమెరికాలో పబ్లిష్ చేసినది ‘హాటన్ మిఫ్లిన్ హర్కోర్ట్’.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment