ఆజన్మం: ఫిక్షన్ - నాన్‌ఫిక్షన్
కొన్నిసార్లు, ఊరికే, అలా తీరుబడిగా కూర్చుని, ఆలోచనల్తో పొద్దుపుచ్చడం బాగుంటుంది. గ్రామీణ వేసవికాల మధ్యాహ్నపు సోమరితనంలాగా, ఎంతకీ పొద్దుకుంగదు; కలలకు అంతం ఉండదు.
పగటి కలల్లో మునిగిపోతే నాకు ఏమీ చదవబుద్ధేయదు; మాటలకు బదులివ్వడం ద్వారా డిస్టర్బ్ కాదలచుకోను; అలా మనోయానం చేస్తూ, అన్ని పాత్రల్లోకి ‘పరకాయ ప్రవేశం’ చేస్తుంటాను.
డెరైక్టర్, హీరో, పొలిటీషియన్, క్రికెటర్(వన్డేలో తొలి డబుల్ సెంచరీ కొట్టింది నేనే!), మ్యుజీషియన్(వినడానికి హార్మోనియం; ప్లే చేయడానికి మౌత్ ఆర్గాన్), టెన్నిస్ ప్లేయర్ (డబుల్స్‌లో నా పార్ట్‌నర్ అన్నా కౌర్నికోవా!), ఫుట్‌బాల్ ప్లేయర్, ప్లేబాయ్... రచయిత తప్ప అన్నీ అయిపోతాను. రాయడం నాకు స్త్రీత్వపు అంశంగా కనబడుతుంది. రాయడమనే కాదు; నృత్యం, గానం, చిత్రలేఖనం; ఇవేవీ ‘మాఛో థింగ్స్’ కాదు.
నాకు కిక్ బాక్సింగ్ తెలుసు; కరాటే తెలుసు; స్పైడర్‌మ్యాన్ అయి గోడలెక్కుతాను; హాలోమ్యాన్ అయి పోలీసుల్ని చడామడా తిట్టేస్తాను; నా ఆరోగ్యం పర్ఫెక్టుగా ఉంటుంది; ఇనుప కండలు, ఉక్కు నరాలుంటాయి.
ఇరవై నాలుగు భాషలు మాట్లాడగలను. దేశాలన్నీ చుట్టివస్తాను. చాలావరకు ఒంటరి యాత్రలే! ఒక్కోసారి ఎవరినైనా వెంటపెట్టుకెళ్తాను. లేదంటే ఎవరో ఒకరు అకస్మాత్తుగా కలుస్తారు. వారితో జరిగే సంభాషణలు, చమత్కారాలు, ఉద్వేగాలు అన్నింటినీ నేను అక్షరమక్షరం మౌనంలో దర్శిస్తాను. రెగ్యులర్‌గా కాకపోయినా లాంగ్ ఇంటెర్వల్స్‌లో చంద్రయాన్ కూడా చేస్తాను. ‘సైన్సు ఫొటోలు’ చంద్రుడి అందాన్ని తగ్గించేస్తాయి కాబట్టి వాటిని పట్టించుకోను.
నా పూర్వాశ్రమంలో నన్ను పట్టించుకోనివాళ్లు పొగుడుతుంటారు. ఇప్పటివాళ్లు అబ్బురంగా చూస్తుంటారు. వాస్తవ జీవితం ఇవ్వలేని ఊరటను అక్కడ సృష్టించుకోగలుగుతాను. అక్కడ మనుషులందరూ భార్యలకుమల్లే అనుకూలంగా ఉంటారు. ఈ శరీరాన్ని ఇక్కడ ఇలా వదిలేయగలిగి, ఆ ప్రపంచంలోకి దూకగలిగితే బాగుండనిపిస్తుంది!
ఒకప్పుడు నేను నవలలు బాగా చదివేవాణ్ని. నవలలకు ఆవలిది ఏదీ నాకు సాహిత్యంగా తోచకపోయేది. కథల జోలికి వెళ్లేవాణ్నే కాదు. కారణం: అవి జీవితపు శకలాన్ని మాత్రమే పట్టిస్తాయనీ, జీవితం అంతటి కాన్వాస్ వాటిల్లో ఉండదనీ నమ్మడం వల్ల. కానీ కొంతకాలానికి నవల పట్టుక్కూర్చునే ఓపిక లేకుండా పోయింది. కొన్ని శకలాల కూర్పే జీవితమని తెలిసొచ్చాక కథల్లో ఉండే బ్యూటీ అర్థం కాసాగింది.
మరీ తాజాగా- ‘ఫిక్షన్’ అనగానే, అందులో ఎంతో కొంత అబద్ధం ఉందనిపిస్తోంది. దాన్ని చదవడం పట్ల ఒక వైఖరి తీసుకునేంత వైముఖ్యం ఏమీలేదుగానీ అదంతా నమ్మదగినదేనా అన్న సందేహం! అదే, నాన్ ఫిక్షన్ అలా కాదు. అది నిజంగా జరిగింది; దాన్ని ఎవరో ఒకరు అనుభవించారు!
కొన్ని విషయాల్ని నాన్‌ఫిక్షన్‌లో చెప్పలేము. ఒక మహత్తర ఉద్వేగంలోకి తీసుకెళ్లే శక్తి, కొన్ని ఖాళీల్ని పూరించగలిగే అవకాశం నాన్ ఫిక్షన్‌లో సాధ్యపడదు. అయినప్పటికీ కల్పన కల్పనేగా! అది ఊహల్లో ఉంది తప్ప, ప్రపంచంలో ఉందన్న ‘గ్యారెంటీ’ లేదు. నీతి, అవినీతి మధ్య నీతి ముసుగు వేసుకొని ఫిక్షన్లో దాక్కోవచ్చు. కానీ నాన్‌ఫిక్షన్‌లో నువ్వేమిటో చెప్పేయాలి. ఆదర్శానికీ వాస్తవానికీ మధ్య గీతలంటూ ఉంటే వాటిని చెరిపేయాలి. కనీసం ఆ గీతకు ఎక్కడున్నామో ఒప్పేసుకోవాలి. వ్యవస్థను శుభ్రం చేయ సంకల్పించేది అదైతే, వ్యక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ ఇది.
తీవ్రంగా ముఖం కడుక్కుంటున్నప్పుడు- కంటికొసలో చేరిన నీటి బిందువు వల్ల నిజానికీ ప్రతిబింబానికీ తేడా చెరిగిపోయినట్టుగా- జీవితంలోని నాన్‌ఫిక్షన్ అంతా ఫిక్షన్‌లాగా కనబడగలిగితే ఎంత బాగుంటుంది! అప్పుడు ప్లేయర్‌గాకన్నా ప్రేక్షకుడిగా ఉంటే సరిపోతుంది. డస్సిపోవడం, ఓటమి, గెలుపు ఏమీవుండవు. ‘ఇందులోనూ ఏమీలేదు’ అని వాడికి అర్థమయ్యేలోపు మనకు అర్థమైపోవాలి. ఇది అర్థం చేసుకోగలగడమే జీవితపు ఆట అయితే గనక, మనకు మించిన ఆటగాడు ఎవరూవుండరు!ఒక్కోసారి ఎవరినైనా వెంటపెట్టుకెళ్తాను. లేదంటే ఎవరో ఒకరు అకస్మాత్తుగా కలుస్తారు. రెగ్యులర్‌గా కాకపోయినా లాంగ్ ఇంటెర్వల్స్‌లో చంద్రయాన్ కూడా చేస్తాను.
-పూడూరి రాజిరెడ్డి