ప్రతీకాత్మక చిత్రం
‘ఆహా! అలాగా!!’ అనే ఆశ్చర్యాలకు అంతు ఉండదు. ‘అసలు ఇది ఎలా సాధ్యం’ అనే ప్రశ్నలకు విరామం ఉండదు. ఊరిస్తున్న వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ యూత్‌లోకానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వినోదానికి పరిమితమైన ఆట కాదు. కాల్పానిక ప్రపంచంలో సేద తీరే పాట కాదు. యూత్ జీవనశైలిలో మెగా మార్పు తీసుకువచ్చే మెటావర్స్!
నిన్నటి సైన్స్–ఫిక్షనే రేపటి కొత్త ఆవిష్కరణ అనే మాట అన్ని సందర్భాలలోనూ నిజమై ఉండకపోవచ్చుగానీ ‘మెటావర్స్’ వరకైతే నిజమే. నీల్ స్టీఫెన్‌సన్ అమెరికన్ సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్ (1992)’లో కనిపించిన ‘మెటావర్స్’ ఇప్పుడు యూత్ ఫేవరేట్ సౌండ్ అయింది.
ఫేస్‌బుక్ తన కంపెనీ పేరును ‘మెటా’గా మార్చుకోవడం ఒక్కటి చాలు అది మెటావర్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పడానికి. భారీ ఖర్చుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో భాగంగా ప్రపంచంలోనే వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ (ఏఐ రిసెర్చ్ సూపర్‌క్లస్టర్.. ఆర్‌ఎస్‌సీ) రూపొందించడం, యూనివర్సల్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్(ఇన్‌స్టంట్ స్పీచ్–టు–స్పీచ్ ట్రాన్స్‌లెషన్: అన్ని భాషల్లో)... మొదలైనవి రూపొందిస్తుంది మెటా. కేవలం మెటా మాత్రమే కాదు రాబోయే కాలంలో రకరకాల మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రభావంతో యువప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి.
వినోదరంగానికి వస్తే... టీవీ చూడడం కంటే మెటావర్స్ లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి యువతరం ఇష్టపడుతుందనేది ఒక అంచనా. ‘యూత్ వ్యూయర్‌షిప్‌ను కాపాడుకోవడానికి టీవి రంగం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఆకట్టుకునే విభిన్నమైన కంటెంట్‌ను సమకూర్చుకోక తప్పదు’ అంటున్నారు మాథ్యూ వర్నెఫోర్డ్. ఈయన మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు గేమ్స్‌ను సమకూర్చే ‘డూబిట్’ కో–ఫౌండర్.
రాబోయే కాలంలో ‘ఫిట్‌నెస్ మెటావర్స్’ ట్రెండ్ ఊపందుకోబోతుంది. ‘వెల్‌టు డూ 2022 కన్జ్యూమర్ వెల్‌నెస్‌ట్రెండ్’ రిపోర్ట్ ప్రకారం యంగ్ ఫిట్‌నెస్ ప్రేమికులు సంప్రదాయ జిమ్‌లలో కంటే వర్చ్‌వల్‌లోనే ఉత్తేజకరమైన వర్కవుట్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకుంటారు.
‘మ్యూజిక్, విజువల్స్, వేరుబుల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...మొదలైన వాటిని ఒకే వేదికపై తీసుకు రావడం ద్వారా మెటావర్స్‌లో జిమ్ ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ అవుతుంది. ఫిట్‌నెస్ ఆర్గనైజేషన్స్ కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ అవుతారు’ అంటుంది రిపోర్ట్,
ఇన్–పర్సన్ ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ కాలంలో ఉన్న కుర్రకారు రిప్రెజెంటేటివ్ అవతార్‌ను ఎంచుకొని, వర్చువల్ వేదికపై ఇంటర్వ్యూలకు వెళ్లే రోజులు వస్తున్నాయి. సోషల్ మెటావర్స్ స్టార్టప్ ఫామ్ ‘వన్ ఎబౌ’ పేరుతో ‘వాక్–ఇన్ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్’ను లాంచ్ చేసింది. క్యాండిడేట్ ప్లాట్‌ఫామ్‌పై క్లిక్ చేయడంతో ఇంటర్వ్యూ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు.
అక్కడ ఉన్న 45 ఆప్షన్‌లలో తనను బెస్ట్‌గా రిప్రెజెంట్ చేసే అవతార్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ లాబీ నుంచి హెచ్‌ఆర్ రిప్రెజెంటేటివ్ వీరికి స్వాగతం పలుకుతూ రిక్రూటింగ్‌కు ప్యానల్‌కు పరిచయం చేస్తారు. ‘దైవిక శక్తులలాంటి శక్తులతో మెటావర్స్‌తో ఎవరికి వారు తమదైన ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు’ అని ఊరిస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్.
Comments
Please login to add a commentAdd a comment