టిమ్ నోబెల్!
జెండర్ సైన్స్
కొందరి మాటల్ని సరదాగా తీసుకోవాలి. కానీ సీరియస్‌గా డిస్కస్ చేయాలి. టిమ్ హంట్ పెద్ద మనిషి. వయసు 73 ఏళ్లు కాబట్టి పెద్ద మనిషి. నోబెల్ ప్రైజ్ విన్నర్ (2001) కాబట్టి పెద్ద మనిషి. తన కామెంట్స్‌కి ఆడవాళ్లు నొచ్చుకోవడంతో క్షమాపణ చెప్పాడు కాబట్టి పెద్ద మనిషి. అక్కడితో చేతులు దులిపేసుకోకుండా లండన్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కాబట్టి పెద్ద మనిషి.
గత ఏడాది జూన్ 8న సియోల్‌లో ఓ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్నారు టిమ్ హంట్. దేశదేశాల శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు శ్రద్ధగా వింటున్నారు. అలా వింటున్నవారిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్లంతా లేబరేటరీల్లో పెద్ద పెద్ద పరిశోధనా విధానాలను నేర్చుకుంటున్న చిన్న చిన్న అమ్మాయిలు. టిమ్‌కి వారిని చూసి ముచ్చటేసిందో లేక కఠినమైన తన స్పీచ్‌ని సరళంగా మార్చదలచుకున్నారో గానీ అకస్మాత్తుగా టాపిక్‌ని అమ్మాయిలపైకి తిప్పేశారు!
‘‘గాళ్స్‌తో ఉన్న ఇబ్బంది గురించి మీకిప్పుడు చెప్పాలి. వాళ్లు గనక ల్యాబ్‌లో ఉంటే మూడు పరిణామాలు సంభవిస్తాయి. మీరు వాళ్లతో ప్రేమలో పడిపోతారు. తర్వాత వాళ్లు మీతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత వాళ్లను మీరు ఒక మాట అన్నప్పుడు వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు’’.
ఒక్కసారిగా నవ్వులు. కానీ అక్కడికి సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఆ మాటను తేలిగ్గా తీసుకోలేక పోయింది. టిమ్ అక్కడ ఆనరరీ ప్రొఫెసర్. అంత మాట అన్నాక ఇక ఆ వ్యక్తి... అతడెంత పెద్దవాడైనా... అక్కడ పని చేయడానికి లేదు. ఎందుకంటే... శాస్త్ర పరిశోధనా రంగంలో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించిన తొలి ఇంగ్లండ్ యూనివర్సిటీ అది. ఆ సంగతి టిమ్‌కి తెలుసు. అందుకే వెళ్లిపొమ్మని అనకుండానే, బయటికి వచ్చేశాడు.
టిమ్ హంట్ మీద ట్వీట్ల దాడి మొదలైంది! టిమ్ కామెంట్‌లో ‘డిస్ట్రాక్టింగ్‌లీ సెక్సీ’ అని అర్థం వచ్చే భావం ఉంది. డిస్ట్రాక్టింగ్‌లీ సెక్సీ అంటే... ‘ధ్యాస మరల్చేంత మోహనంగా’ అని. దాన్ని పట్టుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా లేబరేటరీలలో పనిచేస్తున్న యంగ్ ఉమెన్ సైంటిస్టులంతా. వారిలో అన్ని రంగాల వాళ్లూ ఉన్నారు. ఆర్కియాలజిస్ట్‌లు, బయోకెమిస్టులు, మేథమెటీషియన్లు, కంప్యూటర్ కోడింగ్ నిపుణులు.. ఇంకా జియాలజిస్టులు. టిమ్‌పై ఒక్కొక్కరి విరుపులు ఒక్కోలా ఉన్నాయి. వాటన్నిటి అర్థం ఒక్కటే. ‘మా పనిలో మేము ఇష్టంగానో, చచ్చేచావుగానో నిమగ్నమై ఉంటే మీకు సెక్సీగా ఎలా కనిపిస్తున్నామయ్యా పెద్దమనిషీ!’ అని.
ఇక్కడితో ఈ ఇష్యూ కట్ చేద్దాం. మగువలు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మగవాళ్లకు అందంగానే కనిపి స్తారేమో! అది మగాళ్ల ప్రాబ్లం. టిమ్ హంట్‌ని కూడా ఆయన కర్మకు ఆయన్ని వదిలిపెట్టేయాలి.. ఉద్యోగం పోవడం కర్మ అని ఆయన అనుకున్నా, అనుకోకున్నా! ఒకందుకు మాత్రం టిమ్‌కు ప్రత్యేక ధన్యవాద సమర్పణ చేయాలి. ల్యాబుల్లో ఆడవాళ్లు డిస్టర్బ్ చేస్తారు అన్నాడు కానీ, ఆడవాళ్లు ల్యాబుల్లో ఉద్యోగాలకు పనికిరారు అనలేదు.
ఫిజిక్స్‌లో ఈ ఏడాది నోబెల్ విజేతలుగా ఇద్దరు మగవాళ్ల పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించగానే, గత 53 ఏళ్లలో ఒక్క మహిళా సైంటిస్టుకు కూడా ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ రాలేదన్న పాయింట్‌ని ‘వాషింగ్టన్ పోస్ట్’ లేవనెత్తింది. నోబెల్ ప్రారంభం అయిన 1901 నుంచి 2015 వరకు మొత్తం 885 మంది వ్యక్తులకు, 26 సంస్థలకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. అందులో మహిళలకు వచ్చినవి 49 ప్రైజులు మాత్రమే. మేరీ క్యూరీకి రెండుసార్లు నోబెల్ వచ్చింది కాబట్టి 48 మాత్రమే అనుకోవాలి. వీటిలోనూ ఎక్కువగా శాంతి ప్రైజులు, సాహిత్యం ప్రైజులే.
స్త్రీల పట్ల వివక్ష అన్ని రంగాల్లో ఉన్నట్లే శాస్త్రరంగంలోనూ ఉంది. నోబెల్ ప్రైజు ఇవ్వలేదని వివక్ష అనడం కాదు. నోబెల్ వరకు వెళ్లే దారి పొడవున్నా ఉన్న వివక్ష గురించే ఇక్కడ మాట్లాడ్డం. టిమ్ హంట్ లాంటి వాళ్లు సరదాగా కామెంట్ చేసినా, అందులోని నిజాలను సీరియస్‌గా తీసుకుని మహిళా సైంటిస్టులను నిరుత్సాహపరిచే పరిస్థితులను ఎక్కడికక్కడ చక్కదిద్దితే నోబెల్‌కు నిండుదనం వస్తుంది.
ఈ ఏడాది ఒక్క మహిళకూ నోబెల్ రాలేదు! వెరా రూబిన్‌కు కచ్చితంగా ఇచ్చి ఉండాల్సింది అని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. వెరా రూబిన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త. డార్క్ మేటర్ (కృష్ణ పదార్థం)కి ఆమె సాక్ష్యాధారాలను కనుగొన్న తొలి సైంటిస్ట్. వయసు 88 ఏళ్లు. ‘‘ఈ వయసులో ఆమెకు నోబెల్ ఇవ్వకపోతే ఇక ఎప్పటికీ ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే.. మరణానంతరం నోబెల్ ఇవ్వరు కదా’’ అని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
మాధవ్ శింగరాజు