* ఆడ, మగ తేడాలేకుండా ఆరుబయటే నిర్ధారణ పరీక్షలు
* సదరం క్యాంపులో ఓ వైద్యుడి నిర్వాకం
నిజామాబాద్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షల కోసం సదరం క్యాంపునకు వచ్చిన వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. సదరం సర్టిఫికెట్‌ల కోసం వచ్చిన వారిని రేపు మాపు అంటూ వైద్యాధికారులు తిప్పుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన సదరం శిబిరంలో ఓ వైద్యుడు ఆడ, మగ తేడా లేకుండా ఆరుబయటే వికలాంగ నిర్ధారణ పరీక్షలు జరిపారు.
పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులున్నా ఆరు బయటే నిర్వహించడం విమర్శలకు తావి స్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్, ఇతర పథకాల్లో లబ్ధి పొందేందుకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు ప్రతి శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు వస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన శిబిరం సోమవారానికి వాయిదా వేశారు. వైద్యుల రాక కోసం గంటల తరబడి క్యూలో వేచి చూశారు.
అయితే ఉదయమే రావాల్సిన ఆర్థోపెడిక్ వైద్యుడు మధ్యాహ్న సమయంలో వచ్చి కేవలం 20 నిమిషాల పాటే పరీక్షలు నిర్వహించాడు. సమయం లేదంటూ ఆడ, మగ తేడా లేకుండా ఆరబయటే పరీక్షలు చేయడంతో వారు డీఆర్‌డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్‌ల కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన తమ పట్ల వైద్యాధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ వికలాంగులు వాపోయారు. శిబిరంలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు పట్టింకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వికలాంగులంటే ఇంత నిర్లక్ష్యమా?
Published Tue, Jun 21 2016 8:02 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement