district central hospital
-
మరుగుదొడ్డే వెయిటింగ్ రూం!
రోగులకు తప్పని నిరీక్షణ డీఈఐసీ అధికారుల బాగోతం సంగారెడ్డి టౌన్: మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదులుగా ఏర్పాటు చేసిన విషయం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)లో జరిగింది. అయితే ఆస్పత్రికి వచ్చే రోగులకు మరుగు దొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేయకపోవడంపై రోగులు మండిపడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 12 గదుల్లో డీఈఐసీని ఏర్పాటు చేశారు. దాదాపు 30 లక్షలు ఖర్చు చేసి ఈ కేంద్రాన్ని రూపొందించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరుగుదొడ్లను రోగుల నిరీక్షణ గదిగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమానికి (ఆర్బీఎస్కే) సంబంధించి వైద్యం అందించే కేంద్రంగా డీఈఐసీ ఏర్పాటు చేశారు. ఇంత ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను మహిళలు, పురుషుల నిరీక్షణ గదులుగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గదులకు, గోడలకు రంగులు, బొమ్మలు వేసి, ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. రంగులు వేసి, ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు సేవలూ నామమాత్రమే డీఈఐసీలో వైద్య సేవలు నామ మాత్రంగానే అందుతున్నాయి. మెడికల్ ఆఫీసర్, ప్లే థెరపీ, డెంటల్ ల్యాబ్, ఎంఓ డెంటల్, లెబోరేటరీ, పిల్లల వైద్య నిపుణులు, మానసిక పరివర్తనా విభాగం, స్పెషల్ ఎడ్యుకేషన్, శ్రవణ చికిత్స విభాగం, ఎర్లీ ఇంటర్వెన్షన్, కంటి చికిత్సా విభాగం, ఫిజియో థెరఫి విభాగాలు ఉన్నాయి. కానీ డాక్టర్లు, సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండడం లేదు. సమయ పాలన పాటించడం లేదు. చూడడానికి అలంకరణ ప్రాయంగా దర్శనమిస్తోంది. మొక్కుబడిగా ఆర్బీఎస్కే ఆర్బీఎస్కే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలోని 0-18 సంవత్సరాల వయసు గల పిల్లలను అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. నలుగురు వైద్య సిబ్బంది గల 20 వైద్య బృందాలు ప్రతిపాదిత 30 వ్యాధులను పరీక్షిస్తారు. చికిత్సకు గుర్తించబడిన పిల్లల్ని ప్రత్యేక వాహనంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)కు తరలిస్తారు. డీఈఐసీలో ఉన్న వైద్య సిబ్బంది వారికి చికిత్స అందిస్తారు. రోగులకు అవసరమయ్యే శస్త్ర చికిత్సలు సంబంధిత ప్రత్యేకంగా గుర్తించిన ఆసుపత్రులలో నిర్వహించడం ఈ ఆర్బిఎస్కే పథకం లక్ష్యం. లక్షల్లో వేతనాలు, నిర్వహణ ఖర్చు.. నామ మాత్రంగా సాగుతున్న ఆర్బీఎస్కే పథకానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల సమయంలో ముప్పై లక్షలు ఖర్చు చేసి డీఐసీని రూపొందించారు. గొడలకు రంగుల బొమ్మలు, ఫర్నిచర్, పరికరాలు, ల్యాబ్‌కు సంబం«ధించిన పరికరాలకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కో వైద్య బృందంలో నలుగురు చొప్పున 80, డీఈఐసీతో కలిసి దాదాపు తొంభై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు దాదాపు 90 లక్షలకు పైగా జీతాలు చెల్లించారు. అంతే కాకుండా నిర్వహణ ఖర్చు మొత్తం దాదాపు రూ కోటి దాటింది. ఖర్చు బోలెడు..ఫలితం మూరెడు ఆర్బీఎస్కె పథకం ప్రారంభం కాకమునుపే ఉద్యోగుల నియామకం చేపట్టి దాదాపు మూడు నెలలు జీతాలు చెల్లించారు. డీఈఐసీలో నామమాత్రపు ఏర్పాట్లకు లక్షలు వెచ్చించారు. -
వికలాంగులంటే ఇంత నిర్లక్ష్యమా?
* ఆడ, మగ తేడాలేకుండా ఆరుబయటే నిర్ధారణ పరీక్షలు * సదరం క్యాంపులో ఓ వైద్యుడి నిర్వాకం నిజామాబాద్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షల కోసం సదరం క్యాంపునకు వచ్చిన వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారిని రేపు మాపు అంటూ వైద్యాధికారులు తిప్పుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన సదరం శిబిరంలో ఓ వైద్యుడు ఆడ, మగ తేడా లేకుండా ఆరుబయటే వికలాంగ నిర్ధారణ పరీక్షలు జరిపారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులున్నా ఆరు బయటే నిర్వహించడం విమర్శలకు తావి స్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్, ఇతర పథకాల్లో లబ్ధి పొందేందుకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు ప్రతి శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు వస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన శిబిరం సోమవారానికి వాయిదా వేశారు. వైద్యుల రాక కోసం గంటల తరబడి క్యూలో వేచి చూశారు. అయితే ఉదయమే రావాల్సిన ఆర్థోపెడిక్ వైద్యుడు మధ్యాహ్న సమయంలో వచ్చి కేవలం 20 నిమిషాల పాటే పరీక్షలు నిర్వహించాడు. సమయం లేదంటూ ఆడ, మగ తేడా లేకుండా ఆరబయటే పరీక్షలు చేయడంతో వారు డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన తమ పట్ల వైద్యాధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ వికలాంగులు వాపోయారు. శిబిరంలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు పట్టింకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘గర్భ’ గోస
♦ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల అవస్థలు ♦ గంటల తరబడి పడిగాపులు ♦ రోజంతా 20 మందికే స్కానింగ్ ♦ వందల మంది వెనుతిరుగుతున్న వైనం ♦ ఒక రోజు ముందే వస్తున్న మహిళలు ♦ రోడ్డు మీదే పడుకుంటున్న తీరు ♦ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, డాక్టర్లు సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల గోస అరణ్యరోదనను తలపిస్తోంది. వారి ఇక్కట్లు ఎవరికీ పట్టడం లేదు. స్కానింగ్ కోసం వచ్చిన వందలాది మంది పేదలు నిందించుకుంటూ తిరిగి వెళుతున్నారు. తమ తలరాతలు ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రతి సోమ, గురువారాల్లో గర్భిణులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు స్కానింగ్ తీస్తున్నారు. ఈ సమయంలో ముందు వరుసలో ఉన్న 30 మందికి స్కానింగ్ ఫారాలు ఇస్తున్నారు. దాంతో వందలాది గర్భిణులు వెనుతిరుగుతున్నారు. రాత్రి వచ్చి వరుసలో నిల్చున వారందరూ నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. ఇలా ఒక్కొక్కరు నెల, రెండు నెలల నుంచి స్కానింగ్ కోసం ఆసుపత్రి చుట్టు ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. రాత్రంతా పడిగాపులు.. ఆసుపత్రి సిబ్బంది 35 మందికి స్కానింగ్ చేస్తున్నామని చెబుతున్నా అస లు 20 మందికి కూడా ఫారాలు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా స్కానింగ్ చేసుకోవాలని తలంచిన పేదలు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు ఒక రోజు ముందే వస్తున్నారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్ బిల్డింగ్ ముందు ఉన్న రోడ్డుపైనే నిద్రపోతున్నారు. ఉదయాన్నే తమ వరుస రావాలని గేటుకు (దేవుని గుడిలో మొక్కులు కట్టినట్టు) గుర్తుగా గుడ్డలు కడుతున్నారు. ఉదయం తమకు స్కానిం గ్ అవుతుందో లేదో అని రాత్రంతా వారు పడే వేదన అంతాఇంతా కాదు. నిండు గర్భిణులు రాత్రంతా అవస్థలు పడుతున్న తీరు వర్ణణాతీతం. ఈ సమస్య చాలా కాలంగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. స్కానింగ్ తీసే సరికి ప్రసవం అయిపోతోంది.. 8, 9 నెలల గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారు స్కానింగ్ కోసం నెల, రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో వారి ప్రసవం సమయం కూడా అయిపోతున్నదని పలువురు తెలిపారు. ఈ విషయంపై డాక్టర్లు ఏమి సమాధానం చెప్పడం లేదు. ఏ దారి లేక కొందరు పేదలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ స్కానింగ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే ‘ స్కానింగ్ మిషిన్ ఒక్కటే ఉంది, డాక ్టర్ల కొరత ఉంద’ని ఆసుపత్రి అధికారులు దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి నివేదించామని బుకాయిస్తున్నారు. నలుగురే డాక్టర్లు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. అందులో ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి ఇన్చార్జి పర్యవేక్షకులు రెగ్యులర్ డాక్టరుగా ఉన్నారు. దాంతో ఆయన సేవలు ప్రసూతి వార్డుకు సరిగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు తెలిపారు. అంతే కాకుండా ఇన్చార్జి డీఎంహెచ్ఓకు డీసీహెచ్ఎస్గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయన నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. -
‘కల్తీ’కల్లోలం
- కల్తీ కల్లు బారిన బాధితులు - వింత మార్పులు.. విచిత్ర ప్రవర్తనలు.. - జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరిన 96 మంది - ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం.. - తాళ్లతో కట్టేసి చికిత్స చేస్తున్న వైద్యులు - మత్తు పదార్థాలు తగ్గడమే ప్రధాన కారణం నిజామాబాద్‌అర్బన్ : ఆస్పత్రిలో అటూ ఇటూ తిరుగుతూ పిచ్చిగా అరవడం... ఆస్పత్రి మంచంపై చిందులు వేయడం... ఎదురు పడిన వారిని కొరకడం.. ఇలా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి విధి వక్రీకరించి వచ్చిన వ్యాధి కాదు.. వీరంతా కల్తీ కల్లు బారిన పడిన బాధితులు.. ఇలా రెండు రోజుల్లో 96 మంది ఆస్పత్రిలో చేరి అల్ల కల్లోలం చేస్తున్నారు. పదార్థాల మోతాదు తగ్గడమే దీనికి కారణమని వైద్యులు అంటున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో కల్లులో కలిపే నిషేధిత పదార్థమైన డైజోఫాంను తయారీదారులు వినియోగించడం లేదు. అరుుతే రోజూ కల్లుకు అలవాటుపడిన వారికి డైజోఫాం లేక మత్తు మోతాదు తగ్గిపోయి వింతగా ప్రవర్తిస్తూ, విచిత్ర చేష్టలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇలా పిచ్చి ప్రవర్తనతో శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలం కులాస్పూర్, కులాస్పూర్ తండాలో ఎనిమిది మంది శనివారం నుంచి ఇలా విచిత్ర చేష్టలు చేస్తున్నారు. బోధన్ మండలం ఎడపల్లి ప్రాంతంతో పాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో 30 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో పోచమ్మగల్లికి చెందిన ఎల్లయ్య నగరంలోని ఓ కల్లు డిపోలో పనిచేస్తాడు. ఇతడు నాలుగు రోజులుగా విచిత్ర చేష్టలకు పాల్పడుతున్నాడు. గౌతంనగర్‌కు చెందిన రాజయ్య కల్లు తాగినా మత్తు రాకపోవడంతో ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో తలకు గాయాలు కాగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదర్శనగర్‌కు చెందిన ఇద్దరు దంపతులు ఇదే కారణంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇలా.. రెండు రోజులుగా మొత్తం 56 మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా రు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని వైద్యులు అంటున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పరామర్శించారు. కల్తీకల్లును నిరోధించడంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మత్తు సరిపోక చిత్తు.. ఆదర్శనగర్‌కు చెందిన గంగాధర్ చిన్న వ్యా పారం చేస్తుంటాడు. ప్రతి రోజు పని ముగియగానే కల్లు తాగడం అలవాటు. అయితే మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ప్రవర్తనలో మా ర్పు వచ్చింది. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా మార్పు లేదు. ఫిట్స్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అటెండర్ కూడా.. రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కల్లు తాగడం అలవాటు. రెండు రోజులుగా కల్లు దొరకకపోవడంతో ప్రవర్తనలో మార్పు వచ్చింది. డిచ్పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తే అక్కడా కల్లు లేకపోవడంతో కుప్పకూలిపోరుు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఫిట్స్ కూడా వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మత్తు మోతాదు తగ్గడం వల్లే... కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం వంటివి జరుగుతుంటారుు. ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. బాధితులకు వివిధ మందుల ద్వారా పిచ్చి ప్రవర్తనలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. క్రమంగా మెరుగుపడుతారు. - డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు -
వెయ్యి పడకలుగా..
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ప్రారంభించారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి సౌకర్యాలపై సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజాను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రణాళికలు పంపించామని, వాటిని విడుదల చేయాలని ఆయన కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం సీటీ స్కాన్, చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తమకు నెలనెలా సరిగా వేతనాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డీఎంహెచ్‌వో డాక్టర్ అలీంను పిలిపించి ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలున్నాయన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ అన్నింటినీ స్వయంగా పరిశీలిస్తున్నారని, పేదలందరికీ మెరుగైన వైద్యసేవలందించేందుకు ఆస్పత్రికి సత్వరం కావాల్సిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమర్జెన్సీ వైద్య సేవలకోసం ఆస్పత్రిలో 30 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) ఏర్పాటు చేసి సూపర్‌స్పెషాలిటీ సేవలు అందిస్తామని తెలిపారు. ఎంఆర్ఐ, డయగ్నోస్టిక్ సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భావిస్తోందని అన్నారు. కరీంనగర్లో త్వరలోనే కళాశాల తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, డాక్టర్లు లక్ష్మణ్, శౌరయ్య, నాయకులు వై.సునీల్‌రావు, చల్లా హరిశంకర్, గుంజపడుగు హరిప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీబిడ్డ ‘క్షేమం’ కాదు..
కాన్పు జరిగింది. ఆపరేషన్ ధియేటర్ నుంచి నర్సు బయటికొచ్చి.. ‘గాబరా పడొద్దు.. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమమే’ అని చెబుతుంది. ఇలాంటి సీన్లను సినిమాల్లో మనమెన్నో చూశాం. కానీ.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తల్లీబిడ్డ ఇక్కడ ‘క్షేమం’గా లేరు. మాతాశిశువుల మరణ మృదంగం సర్కారు చెవికి వినపడటం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా, ఏరియా ఆసుపత్రిని 100 పడకలుగా, జిల్లా కేంద్ర ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ స్థాయికి పెంచాలని కలలు కంటున్న ప్రభుత్వం వాస్తవానికి మాత్రం గ్రామాల్లో కనీస వైద్య చర్యలపై దృష్టిపెట్టట్లేదు. 700 పీహెచ్‌సీలు, 3 వేలకుపైగా ఉప వైద్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రులున్నా.. పలు చర్యలు చేపడుతున్నా మాతాశిశు మరణాలు ఆగట్లేదు. - సాక్షి, హైదరాబాద్ ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువుల కన్నుమూత... రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువులు పుట్టిన కొన్ని రోజులకే మృత్యువాతపడుతున్నారు. ప్రసవం సమయంలో ప్రతి లక్ష మందిలో 92 మంది కన్నుమూస్తున్నారు. ఈ మరణాల రేటు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ర్టంలోనే ఎక్కువగా ఉంది. కేరళలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 12 మంది శిశువులు మరణిస్తుండగా కర్ణాటకలో 32 మంది, తమిళనాడులో 21 మంది మరణిస్తున్నారు. అలాగే కేరళలో ప్రతి లక్ష మందిలో 68 మంది తల్లులు మరణిస్తుండగా తమిళనాడులో 90 మంది చనిపోతున్నారు. జిల్లాలవారీ గణాంకాలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 53 మంది మరణిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి లక్ష మంది తల్లుల్లో 152 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ శిశు మరణాలు వెయ్యికి 20 ఉండగా తల్లుల మరణాల రేటు ప్రతి లక్షకు 71గా నమోదవడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల కొరత... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒక గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, అనస్తీషియన్ (మత్తు మందు ఇచ్చే వైద్యుడు) ఉండాల్సి ఉండగా అనస్తీషియన్ల కొరత ఉంది. దీంతో సిజేరియన్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తి మరణాలు సంభవిస్తున్నాయి. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు తప్పనిసరిగా గర్భిణులను 2, 3 రోజులకోసారైనా పరిశీలించాల్సి ఉన్నా వాస్తవానికి ఆ పరిస్థితి లేనేలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా అనేక వైద్య సేవలకు రూ. కోట్లు కేటాయిస్తున్నా అవి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న మాతాశిశు మరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ముందుకు రావాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. మరణాలకు కారణాలివీ.. ⇒ గ్రామాల్లో తల్లులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండటం, ప్రసవ సమయంలో తల్లికి అవసరమైన రక్తం/సంబంధిత గ్రూపు దొరక్కపోవడం వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ⇒ చిన్న వయసులో పెళ్లిళ్లు జరిగి గర్భం దాల్చడం వల్ల కూడా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ⇒ గర్భిణుల్లో తలెత్తే బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించడంలో వైద్య లోపాలు కూడా కారణంగా ఉంటోంది. ⇒ 51%మంది గ్రామీణ గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందట్లేదు. ⇒ గర్భస్త పిండాల ఎదుగుదల/లోపాల గురించి గర్భిణులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోకపోవడం నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. -
ఇంతకీ ఎటు!
జిల్లా ఆస్పత్రి తరలింపులో అయోమయం - నిర్ణయం తీసుకోలేకపోతున్న ప్రజాప్రతినిధులు - రోజుకో తీరుగా మారుతున్న అభిప్రాయాలు - అయోమయంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రి ఎట్టకేలకు మెడికల్ కళాశాలకు అనుసంధా నం కావడంతో, జనరల్‌గా మారిన జిల్లా ఆస్పత్రిని ఎక్కడకు మారుస్తారో అన్న విషయంలో స్పష్టత రావడం లేదు. అటు ప్రజాప్రతినిధు లు, ఇటు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోతున్నారు. దీంతో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కొందరు మెడికల్ కళాశాలకు వెళ్లడానికి సమ్మతి తెలుపుతున్నా, ఆస్పత్రి తరలింపు విషయం తేలే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ఆస్పత్రి మార్పు విషయంలో మూడేళ్లుగా సందిగ్ధం కొనసాగుతుంది. గతంలో మంత్రిగా ఉన్న పి.సుదర్శన్‌రెడ్డి దీని ని బోధన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అపుడు వైద్య విధాన పరిషత్ కమిషనర్ మూడు రోజులపాటు బోధన్‌లో ఉండి పరిశీలించారు కూడా. మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయి అనుమతి రాగానే బోధన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఈ పక్రియ నిలిచిపోయింది. మెడికల్ కళాశాలకు అనుమతులు కూడా ఆలస్యంగా రావడంతో ఆస్పత్రి మార్పులోనూ ఆలస్యం జరిగింది. బోధన్కా... బాన్సువాడకా? గతంలో ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రిని బోధన్‌కు తరలించాలనే అనుకున్నారు. అరుుతే, ప్రస్తుతం దీనిని వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బాన్సువాడకు తరలించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడకు చెందినవారు కాబట్టి ఆస్పత్రిని తన నియోజకవర్గానికి తీసుకెళుతున్నారని భావిస్తున్నారు. 15 మండలాలు బాన్సువాడకు దగ్గరగా ఉంటాయి. జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బాన్సువాడకు ఆస్పత్రిని తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆ స్పత్రిని కామారెడ్డికి తరలించాలని వైద్యాధికారులు ఉన్నతాధికారులకు నివేదిం చారు. కామారెడ్డి పట్టణం బాన్సువాడ కన్న పెద్దదిగా ఉండడం, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నందున ఈ అంశాన్ని పరిశీలించాలని విన్నవించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వెయి పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణరుుంచినందున జిల్లా ఆస్పత్రి తరలింపు ఉండబోదనే వాదనా వినిపిస్తోంది. కొత్తగా నిర్మించే ఆస్పత్రులలోనే ఆధునిక సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం భావి స్తున్నట్లు సమాచారం. కాగా, బాన్సువాడకు జిల్లా ఆస్పత్రితో తరలింపుతోపాటు అక్కడ వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని కూడా మంత్రి ఆలోచిస్తున్న ట్లు తెలిసింది. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాలైన జుక్కల్, మద్నూరు, పిట్లం, బిచ్కుంద, ఇతర మండలాల ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అయోమయంలో ఉద్యోగులు జిల్లా ఆస్పత్రి తరలింపుపై తుది నిర్ణయం రాకపోవడంతో వైద్యా విధాన పరిషత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో 23 మంది ఉద్యోగులు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో 211 మంది సిబ్బంది ఉన్నారు. 43 మంది స్టాఫ్ నర్సులు, ఆరుగురు హెడ్‌నర్సులు ఉన్నారు. ఇందులో కొందరు మెడికల్ కళాశాలకు వెళ్లేందుకు సమ్మతి తెలిపారు. మరి కొందరు వైద్య శాఖలోని ఇతర విభాగాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇదిలా ఉం డగా, ఉద్యోగులకు మరో రెండు, మూడు రోజులలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లా ఆస్పత్రి ఇక జనరల్ బాన్సువాడ : జిల్లా కేం ద్రంలో ఉన్న ఆస్పత్రిని జ నరల్ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా ఆస్పత్రిగానే ఉన్న దీనిని నిజామాబాద్ మెడికల్ కళాశాలలో విలీనం చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులతోపాటు సిబ్బందిని వారి సమ్మతితోనే త్వరలో కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉంటారా? ఇతర ఏరియా ఆస్పత్రులకు వెళ్తారా అనేది వైద్యులతోపాటు సిబ్బందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మెడికల్ కళాశాల ప్రారంభమై రెండేళ్లవుతుండగా, ఎట్టకేలకు ప్రస్తుతం ఆస్పత్రిని జనరల్ హాస్పిటల్‌గా మార్చారు. దీంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిని బాన్సువాడకు తరలించేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. -
అనుసంధానం ఎప్పుడు?
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగోలా ఎంసీఐని ఒప్పించిన అధికారులు అధికారి కంగా ఆస్పత్రిని అనుసంధానం చేయడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో రోగులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వైద్యుల మధ్య సమన్వయం కొరవడి ‘మీదంటే మీదంటూ’’ విధుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతలను వైద్యా విధాన పరిషత్ అధికారులకే అప్పగించడంతో కళాశాల అధికారులు నిరుత్సాహపడుతున్నారు. చిరకాల కోరిక తీరినా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో నిజామాబాద్‌లో 2012లో మెడికల్ ప్రారంభమైంది. రెండేళ్లు పూర్తి అయినా బాలారిష్టాలను మాత్రం దాటడం లేదు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎనిమిది అంతస్తుల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. జిల్లా ఆస్పత్రి పాత భవనంలో కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పుడే కళాశాలకు ఆస్పత్రిని అనుసంధానించి, జిల్లా ఆస్పత్రిని ఇతర ప్రాంతానికి తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటివరకూ నత్తనడకన కొనసాగుతోంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. వైద్య విధాన పరిషత్‌కే శానిటేషన్ నిర్వహణ, సౌకర్యాల ఏర్పాటు, వైద్యుల విధుల కేటాయింపు,బాధ్యతలు ఉండడం తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులను ఆస్పత్రికి కేటాయించారు. వైద్య విధాన పరిషత్‌కు చెందిన అధికారులు సూపరిండెంట్లుగా ఉన్నారు. దీంతో సమన్వయం కుదరడం లేదు. గతంలో ఓసారి సూపరిండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్ విధులకు గైర్హాజరైన ప్రొఫెసర్లకు రిజిష్టరులో ఆబ్సెంట్ వేశారు. అంతే, భగ్గుమన్న ప్రొఫెసర్లు రాష్ట్ర స్థాయి వైద్యుల సంఘం నాయకులను పిలిపిచించి పంచాయతీ పెట్టారు. వైద్య విధాన పరిషత్ అధికారులను నిలదీయడంతో వారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆస్పత్రికి దాదాపు వంద మంది ప్రొఫెసర్లు ఇప్పటి వరకు గైర్హాజరవుతునే ఉన్నారు. వీరిని సమన్వయపరిచి సేవలు అందేలా చూసేందుకు అధికారి అందుబాటులో లేరు. నిధులు మురుగుతున్నా ఆరోగ్యశ్రీ నిధులు దాదాపు రెండు కోట్ల రూపాయ లు ఖజానాలోనే మూలుగుతున్నాయి. వీటిని ఖర్చు చేయడంలో వైద్యా విధాన పరిషత్ అధికారులు డోలాయమానంలో పడ్డారు. రేపోమాపో ఆస్పత్రి తరలిపోతుందని, కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఆస్పత్రికి తామెలా నిధులను ఖర్చుపెట్టాలని ఆలోచిస్తున్నారు. దీంతో ఆపరేషన్లు చేసిన వైద్యుల కు కూడా డబ్బులు కేటాయించడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుబాటులో ఉన్న 30 మంది శానిటేషన్ సిబ్బంది సరిపోవడం లేదు. కళా శాల అధికారులు అదనపు సిబ్బందిని నియమించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటీవలే వైద్యావిధా న పరిషత్ శానిటేషన్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగిం చింది. వైద్య సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఖాళీల కొరత తీవ్రంగా ఉండడంతో ఉన్నవారిపైనే భారం ఎక్కువగా పడుతోంది. ఆస్పత్రిలో క్యాంటిన్లు, జనరిక్ మందుల దుకాణాలువైద్యా విధాన పరిషత్ పరిధిలో ఉండగా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఆస్పత్రి ఎక్కడికో జిల్లా ఆస్పత్రిని ఇతర ప్రాంతానికి తరలించే విషయం మూడు సంవత్సరాలుగా ఊగిసలాడుతోంది. పి.సుదర్శన్‌రెడ్డి మంత్రిగా ఉండగా ఆస్పత్రిని బోధన్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేశా రు. ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం తో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రిని బాన్సువాడకు తరలించేం దుకు యత్నిస్తున్నారు. ఇటీవలే ఆ విషయాన్ని ప్రకటన కూడా చేశారు. ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం పేర్కొనలేదు. సాధ్యమైనంత త్వరలో ఆస్పత్రిని తరలించి అధికారికంగా కళాశాలకు ఉన్న ఆస్పత్రిని అనుసంధానం చేస్తే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. -
వైఎస్ ఫొటోలను తొలగిస్తే ఊరుకోం
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పేర్కొన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఆయన జిల్లా ఆస్పత్రి ఎదుట మంగళవారం పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ ఫొటోను డిప్యూటీ సీఎం రాజయ్య దగ్గరుండి తొలగించడం అన్యాయమన్నారు. రాజయ్యను రాజకీయంగా ఆదుకున్నది వైఎస్సే అనే విషయం మరువరాదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైఎస్ ఫొటోను తీయించారే తప్ప ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న ఆయనను ఎవరూ తీయలేరన్నారు. మరెక్కడైనా వైఎస్ ఫొటోలను తొలగించినట్లు తెలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలు పదవీ వ్యామోహంతో వ్యవహరిస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత లేకుండా కేవలం 25 శాతం రైతులకు మాత్రమే మాఫీ చేయడం తగదన్నారు. జిల్లాలో అప్పుల బాధలు ఎక్కువై వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. జిల్లాలో పాముకాటుతో మరణిస్తున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందమన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సివస్తుందన్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్దకు వస్తున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ నేతలు ఎస్ఎస్ పాటిల్, సుధాకర్‌గౌడ్, మక్సూద్ అలీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్..రాజయ్య
స్వయంగా రోగులను పరీక్షించిన డిప్యూటీ సీఎం - జిల్లాకేంద్ర ఆస్పత్రిలో కలియదిరిగి వసతుల పరిశీలన - రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి నల్లగొండ టౌన్ : డాక్టర్ తాటికొండ రాజయ్య.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. శుక్రవారం నల్లగొండకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంట సేపు ఆస్పత్రి అంతా కలియదిరిగారు. మంత్రి హోదాను కాసేపు పక్కన పెట్టి మెడలో స్టెతస్కోప్ వేసుకుని చిన్నపిల్లల డాక్టర్‌గా మారారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నారులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఓ చిన్నారిపల్స్రేట్ చూసి ఆరోగ్యంపై ఆ చిన్నారి తల్లికి తగినసూచనలిచ్చారు. అనంతరం కాన్పుల వార్డును సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. మెడికల్ వార్డు, పోస్ట్ ఆపరేషన్ వార్డులలోని రోగులను ఆప్యాయంగా పలకరించారు. మెడికల్ కళాశాల మంజూరుకు కృషి తనిఖీ అనంతరం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో కలెక్టర్ చిరంజీవులుతో కలిసి ఆస్పత్రి పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రి సామర్థ్యం 250 పడకలు మాత్రమే అయినప్పటికీ ఇన్‌పేషంట్ల సంఖ్య రోజుకు 350కి మించుతుందన్నారు. సామర్థ్యానికి మించి రోగులు వస్తున్నందున కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రాస్పత్రికి 100 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరై పనులు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు. అదే విధంగా ఆస్పత్రి స్థాయిని పెంచినందున 150 పడకల సామర్థ్యానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నామన్నారు. ఆ పనులు పూర్తయితే అస్పత్రి సామర్థ్యం 500 పడకల స్థాయికి పెరుగుతుందని చెప్పారు. దీనికి మెడికల్ కళాశాల మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయించ డానికి కృషి చేస్తానన్నారు. ఆస్పత్రి తనిఖీలో కొందరు రోగులు తమకు మందులు ఇవ్వకుండా బయటనుంచి కొనుగోలు చేయిస్తున్నారని, ఎక్స్‌రే, స్కానింగ్ బయట తీయించుకోమని చెబుతున్నారని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఇకనుంచి ఎట్టి పరిస్థితులలో బయటనుంచి మందులు కొనుగోలు చేయించవద్దని, స్కానింగ్ కూడా బయట తీయించవద్దని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైన మందులు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పామన్నారు. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నందున, భర్తీ చేయడానికి ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులను కూడా అకస్మికంగా తనిఖీ చేసి బంగారు తెలంగాణలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారిపైన అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీని సమర్థంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద ఆపరేషన్లు తప్ప మిగతా ఆపరేషన్లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో జరగడానికి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్లు నర్సింగరావు, పుల్లారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పేరుకే.. పెద్దాసుపత్రా..?
పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లా కేంద్ర ఆస్పత్రి తీరు. ఈ ఆస్పత్రికి నిత్యం జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు.కానీ వారికి మెరుగైన సేవలు అందడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నా చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహించడం లేదని రోగులు వాపోతున్నారు. - న్యూస్‌లైన్, నల్లగొండ టౌన్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాల ఉంది. కానీ ఇ క్కడ చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహిం చకుండా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పరీక్షకైనా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపి తమ జేబు ను గుల్లా చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కేసులతో పాటు ఇతర కేసులకు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో పరీ క్షలు చేయించుకోవాలని పంపించడం బా ధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్త గ్రూపును కనుగొనే పరీక్షలకు కూడా ప్రైవేటుకు పంపిస్తున్నారంటే ప్ర యోగశాల దుస్థితి అర్థమవుతోంది. రసాయనాలు లేకపోవడమేనా..? ఆస్పత్రి ప్రయోగశాలలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు చొప్పున ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండంర్లు పనిచేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్లు పని చేస్తున్నా అవసరమైన రసాయనాలు లేకపోవడంతోనే వివిధ పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్పట్లు సమాచారం. -
క్షయవ్యాధి నివారణకు పాటుపడాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ క్షయవ్యాధి నివారణకు పాటుపడాలనికలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్ర వైద్యశాలలో క్షయ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్ర జల భాగస్వామ్యం, డాక్టర్ల అంకితభావంతో పనిచేస్తే క్షయవ్యాధిని సంపూర్ణ ంగా నిర్మూలించవచ్చునన్నారు. మసూ చీ, ప్లేగు, పోలియో వ్యాధులను శాశ్వతంగా నిర్మూలించగలిగామన్నారు. కానీ ప్రజలను చైతన్యపరచని కారణంగా మలేరియా, పైలేరియా, క్షయ వ్యాధుల ను నిర్మూలించలేకపోతున్నామని విచా రం వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం, అవగాహన రాహిత్యం కారణంగా క్షయవ్యాధి పెరిగిపోతుందన్నారు. కొన్ని రకా ల వృత్తులు కూడా క్షయ, ఇతర అంటురోగాలకు కారణమవుతున్నాయని చె ప్పారు. సిగరేట్, గుట్కా, పొగాకు ఇత ర వ్యసనాలు విడిచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలు నిజ మైన వైద్య సేవలు అందించాలన్నారు. సేవాభావంతో పనిచేసే ఆర్ఎంపీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే చైనా తర్వాత ఇండియా క్షయవ్యాధిలో 2వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 4 వేల మంది రోగులకు వైద్య సౌకర్యం అంది స్తున్నట్లు తెలిపారు. అనంతరం క్షయవ్యాధి నియంత్రణకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ మెమోంటో, ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, డీఐఓ డాక్టర్ ఎబీనరేంద్ర, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ్‌కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్ గౌరి శ్రీ, డెమో తిరుపతయ్య పాల్గొన్నారు. -
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేవలు నిల్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రికి రోజూ 600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. 350 వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. రోజూ అత్యవసర సేవల కోసం 25 నుంచి 30 మంది వరకు వస్తుంటారు. వీరికి సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలలో సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. ఆస్పత్రిలో 130 స్టాఫ్‌నర్సు పోస్టులుండగా 32 మంది మాత్రమే ఉన్నారు. 250 వరకు సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అవసరం కాగా 19 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. వీరి సేవలూ అన్ని విభాగాలకు అందుబాటులోకి రావడం లేదు. అత్యవసర సేవల కోసం వచ్చేవారికి కుట్లు, కట్లు వేయడం కోసం వైద్యసిబ్బందికీ కొరత ఉంది. ఒకేసారి అత్యవసర చికిత్స కోసం మూడు నుంచి నాలుగు కేసుల వరకు వచ్చినపుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది. దీంతో రోగుల బంధువులు వైద్యులు, వైద్యసిబ్బందితో తరచూ వాగ్వాదానికి దిగుతున్నారు. అందుబాటులో ఉండని వైద్యులు ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడానికి వైద్యులు సైతం అందుబాటులో లేరు. రోజు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు ఓపీ సేవలకోసం వేచి చూడాల్సిందే.. వైద్యులు ఇష్టానుసారంగా ఆస్పత్రికి వస్తుండడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. జిల్లా ఆస్పత్రిలో 36 మంది వైద్యులు ఉండాలి. కానీ, 14 మందే ఉన్నారు. మెడికల్ కళాశాలకు సంబంధించి 66 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రిలో సేవలందించాల్సి ఉండగా, 18 మందికి మించి విధులకు హాజరు కావడం లేదు. మిగతా ప్రొఫెసర్లు ఆస్పత్రి వైపే కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రొఫెసర్లలో మార్పు రావడం లేదు. సమస్యలపై స్పందన కరువు ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, ఆర్ఎంఓ లేకపోవడంతో స్థానిక వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా పోస్టులలో రెగ్యులర్ అధికారులను నియమిస్తే ఆస్పత్రి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి. వెంటిలేటర్ సౌకర్యం లేదు ఆస్పత్రిలో వెంటలేటర్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటు. దీంతో వెంటిలేటర్ అవసరమైన రోగిని ఇతర ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో అప్పటి కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆస్పత్రిలో ఆ సౌకర్యం ఏర్పాటు కాలేదు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ కూడా లేదు. పోస్టుమార్టం కోసం ప్రత్యేక డాక్టర్‌ను నియమించినా, ఆయన ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రికి వచ్చే వైద్యులు, ప్రొఫెసర్లే అత్యవసర సేవలు, వైద్య సేవలు, పోస్టుమార్టం తదితర సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సరైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.