డాక్టర్..రాజయ్య | Dr.Rajaiah | Sakshi
Sakshi News home page

డాక్టర్..రాజయ్య

Published Sat, Jun 28 2014 5:08 AM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM

డాక్టర్..రాజయ్య - Sakshi

డాక్టర్..రాజయ్య

స్వయంగా రోగులను పరీక్షించిన డిప్యూటీ సీఎం
- జిల్లాకేంద్ర ఆస్పత్రిలో కలియదిరిగి వసతుల పరిశీలన
- రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి

నల్లగొండ టౌన్ : డాక్టర్ తాటికొండ రాజయ్య.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. శుక్రవారం నల్లగొండకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంట సేపు ఆస్పత్రి అంతా కలియదిరిగారు. మంత్రి హోదాను కాసేపు పక్కన పెట్టి మెడలో స్టెతస్కోప్ వేసుకుని చిన్నపిల్లల డాక్టర్‌గా మారారు.  నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నారులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఓ చిన్నారిపల్స్‌రేట్ చూసి ఆరోగ్యంపై ఆ చిన్నారి తల్లికి తగినసూచనలిచ్చారు. అనంతరం కాన్పుల వార్డును సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. మెడికల్ వార్డు, పోస్ట్ ఆపరేషన్ వార్డులలోని రోగులను ఆప్యాయంగా పలకరించారు.
 
మెడికల్ కళాశాల మంజూరుకు కృషి
తనిఖీ అనంతరం డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో కలెక్టర్ చిరంజీవులుతో కలిసి ఆస్పత్రి పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రి సామర్థ్యం 250 పడకలు మాత్రమే అయినప్పటికీ ఇన్‌పేషంట్ల సంఖ్య రోజుకు 350కి మించుతుందన్నారు. సామర్థ్యానికి మించి రోగులు వస్తున్నందున కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రాస్పత్రికి 100 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరై పనులు వేగవంతంగా నడుస్తున్నాయన్నారు.

అదే విధంగా ఆస్పత్రి స్థాయిని పెంచినందున 150 పడకల సామర్థ్యానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నామన్నారు. ఆ పనులు పూర్తయితే అస్పత్రి సామర్థ్యం 500 పడకల స్థాయికి పెరుగుతుందని చెప్పారు. దీనికి మెడికల్ కళాశాల మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయించ డానికి కృషి చేస్తానన్నారు.

ఆస్పత్రి తనిఖీలో కొందరు రోగులు తమకు మందులు ఇవ్వకుండా బయటనుంచి కొనుగోలు చేయిస్తున్నారని, ఎక్స్‌రే, స్కానింగ్ బయట తీయించుకోమని చెబుతున్నారని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఇకనుంచి ఎట్టి పరిస్థితులలో బయటనుంచి మందులు కొనుగోలు చేయించవద్దని, స్కానింగ్ కూడా బయట తీయించవద్దని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైన మందులు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధుల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పామన్నారు.

డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నందున, భర్తీ చేయడానికి ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులను కూడా అకస్మికంగా తనిఖీ చేసి బంగారు తెలంగాణలో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారిపైన అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆరోగ్యశ్రీని సమర్థంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద ఆపరేషన్‌లు తప్ప మిగతా ఆపరేషన్‌లు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో జరగడానికి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హరినాథ్, డాక్టర్లు నర్సింగరావు, పుల్లారావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement