నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాగోలా ఎంసీఐని ఒప్పించిన అధికారులు అధికారి కంగా ఆస్పత్రిని అనుసంధానం చేయడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.
దీంతో రోగులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వైద్యుల మధ్య సమన్వయం కొరవడి ‘మీదంటే మీదంటూ’’ విధుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతలను వైద్యా విధాన పరిషత్ అధికారులకే అప్పగించడంతో కళాశాల అధికారులు నిరుత్సాహపడుతున్నారు.
చిరకాల కోరిక తీరినా
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో నిజామాబాద్‌లో 2012లో మెడికల్ ప్రారంభమైంది. రెండేళ్లు పూర్తి అయినా బాలారిష్టాలను మాత్రం దాటడం లేదు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎనిమిది అంతస్తుల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. జిల్లా ఆస్పత్రి పాత భవనంలో కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పుడే కళాశాలకు ఆస్పత్రిని అనుసంధానించి, జిల్లా ఆస్పత్రిని ఇతర ప్రాంతానికి తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటివరకూ నత్తనడకన కొనసాగుతోంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.
వైద్య విధాన పరిషత్‌కే శానిటేషన్ నిర్వహణ, సౌకర్యాల ఏర్పాటు, వైద్యుల విధుల కేటాయింపు,బాధ్యతలు ఉండడం తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులను ఆస్పత్రికి కేటాయించారు. వైద్య విధాన పరిషత్‌కు చెందిన అధికారులు సూపరిండెంట్లుగా ఉన్నారు. దీంతో సమన్వయం కుదరడం లేదు.
గతంలో ఓసారి సూపరిండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్ విధులకు గైర్హాజరైన ప్రొఫెసర్లకు రిజిష్టరులో ఆబ్సెంట్ వేశారు. అంతే, భగ్గుమన్న ప్రొఫెసర్లు రాష్ట్ర స్థాయి వైద్యుల సంఘం నాయకులను పిలిపిచించి పంచాయతీ పెట్టారు. వైద్య విధాన పరిషత్ అధికారులను నిలదీయడంతో వారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆస్పత్రికి దాదాపు వంద మంది ప్రొఫెసర్లు ఇప్పటి వరకు గైర్హాజరవుతునే ఉన్నారు. వీరిని సమన్వయపరిచి సేవలు అందేలా చూసేందుకు అధికారి అందుబాటులో లేరు.
నిధులు మురుగుతున్నా
ఆరోగ్యశ్రీ నిధులు దాదాపు రెండు కోట్ల రూపాయ లు ఖజానాలోనే మూలుగుతున్నాయి. వీటిని ఖర్చు చేయడంలో వైద్యా విధాన పరిషత్ అధికారులు డోలాయమానంలో పడ్డారు. రేపోమాపో ఆస్పత్రి తరలిపోతుందని, కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఆస్పత్రికి తామెలా నిధులను ఖర్చుపెట్టాలని ఆలోచిస్తున్నారు. దీంతో ఆపరేషన్లు చేసిన వైద్యుల కు కూడా డబ్బులు కేటాయించడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
అందుబాటులో ఉన్న 30 మంది శానిటేషన్ సిబ్బంది సరిపోవడం లేదు. కళా శాల అధికారులు అదనపు సిబ్బందిని నియమించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటీవలే వైద్యావిధా న పరిషత్ శానిటేషన్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగిం చింది. వైద్య సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఖాళీల కొరత తీవ్రంగా ఉండడంతో ఉన్నవారిపైనే భారం ఎక్కువగా పడుతోంది. ఆస్పత్రిలో క్యాంటిన్లు, జనరిక్ మందుల దుకాణాలువైద్యా విధాన పరిషత్ పరిధిలో ఉండగా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
ఆస్పత్రి ఎక్కడికో
జిల్లా ఆస్పత్రిని ఇతర ప్రాంతానికి తరలించే విషయం మూడు సంవత్సరాలుగా ఊగిసలాడుతోంది. పి.సుదర్శన్‌రెడ్డి మంత్రిగా ఉండగా ఆస్పత్రిని బోధన్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేశా రు. ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం తో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రిని బాన్సువాడకు తరలించేం దుకు యత్నిస్తున్నారు. ఇటీవలే ఆ విషయాన్ని ప్రకటన కూడా చేశారు. ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం పేర్కొనలేదు. సాధ్యమైనంత త్వరలో ఆస్పత్రిని తరలించి అధికారికంగా కళాశాలకు ఉన్న ఆస్పత్రిని అనుసంధానం చేస్తే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
అనుసంధానం ఎప్పుడు?
Published Fri, Jan 2 2015 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement