‘కల్తీ’కల్లోలం
- కల్తీ కల్లు బారిన బాధితులు
- వింత మార్పులు.. విచిత్ర ప్రవర్తనలు..
- జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరిన 96 మంది
- ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం..
- తాళ్లతో కట్టేసి చికిత్స చేస్తున్న వైద్యులు
- మత్తు పదార్థాలు తగ్గడమే ప్రధాన కారణం
నిజామాబాద్‌అర్బన్ : ఆస్పత్రిలో అటూ ఇటూ తిరుగుతూ పిచ్చిగా అరవడం... ఆస్పత్రి మంచంపై చిందులు వేయడం... ఎదురు పడిన వారిని కొరకడం.. ఇలా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి విధి వక్రీకరించి వచ్చిన వ్యాధి కాదు.. వీరంతా కల్తీ కల్లు బారిన పడిన బాధితులు.. ఇలా రెండు రోజుల్లో 96 మంది ఆస్పత్రిలో చేరి అల్ల కల్లోలం చేస్తున్నారు. పదార్థాల మోతాదు తగ్గడమే దీనికి కారణమని వైద్యులు అంటున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో కల్లులో కలిపే నిషేధిత పదార్థమైన డైజోఫాంను తయారీదారులు వినియోగించడం లేదు. అరుుతే రోజూ కల్లుకు అలవాటుపడిన వారికి డైజోఫాం లేక మత్తు మోతాదు తగ్గిపోయి వింతగా ప్రవర్తిస్తూ, విచిత్ర చేష్టలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇలా పిచ్చి ప్రవర్తనతో శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలం కులాస్‌పూర్, కులాస్‌పూర్ తండాలో ఎనిమిది మంది శనివారం నుంచి ఇలా విచిత్ర చేష్టలు చేస్తున్నారు. బోధన్ మండలం ఎడపల్లి ప్రాంతంతో పాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో 30 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.
ఇందులో పోచమ్మగల్లికి చెందిన ఎల్లయ్య నగరంలోని ఓ కల్లు డిపోలో పనిచేస్తాడు. ఇతడు నాలుగు రోజులుగా విచిత్ర చేష్టలకు పాల్పడుతున్నాడు. గౌతంనగర్‌కు చెందిన రాజయ్య కల్లు తాగినా మత్తు రాకపోవడంతో ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దీంతో తలకు గాయాలు కాగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదర్శనగర్‌కు చెందిన ఇద్దరు దంపతులు ఇదే కారణంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇలా.. రెండు రోజులుగా మొత్తం 56 మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా రు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని వైద్యులు అంటున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పరామర్శించారు. కల్తీకల్లును నిరోధించడంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మత్తు సరిపోక చిత్తు..
ఆదర్శనగర్‌కు చెందిన గంగాధర్ చిన్న వ్యా పారం చేస్తుంటాడు. ప్రతి రోజు పని ముగియగానే కల్లు తాగడం అలవాటు. అయితే మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ప్రవర్తనలో మా ర్పు వచ్చింది. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా మార్పు లేదు. ఫిట్స్ రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి అటెండర్ కూడా..
రాజయ్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే అటెండర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కల్లు తాగడం అలవాటు. రెండు రోజులుగా కల్లు దొరకకపోవడంతో ప్రవర్తనలో మార్పు వచ్చింది. డిచ్‌పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తే అక్కడా కల్లు లేకపోవడంతో కుప్పకూలిపోరుు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఫిట్స్ కూడా వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
మత్తు మోతాదు తగ్గడం వల్లే...
కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం వంటివి జరుగుతుంటారుు. ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. బాధితులకు వివిధ మందుల ద్వారా పిచ్చి ప్రవర్తనలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. క్రమంగా మెరుగుపడుతారు.
- డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు