‘గర్భ’ గోస
♦ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల అవస్థలు
♦ గంటల తరబడి పడిగాపులు
♦ రోజంతా 20 మందికే స్కానింగ్
♦ వందల మంది వెనుతిరుగుతున్న వైనం
♦ ఒక రోజు ముందే వస్తున్న మహిళలు
♦ రోడ్డు మీదే పడుకుంటున్న తీరు
♦ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, డాక్టర్లు
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గర్భిణుల గోస అరణ్యరోదనను తలపిస్తోంది. వారి ఇక్కట్లు ఎవరికీ పట్టడం లేదు. స్కానింగ్ కోసం వచ్చిన వందలాది మంది పేదలు నిందించుకుంటూ తిరిగి వెళుతున్నారు. తమ తలరాతలు ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రతి సోమ, గురువారాల్లో గర్భిణులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు స్కానింగ్ తీస్తున్నారు. ఈ సమయంలో ముందు వరుసలో ఉన్న 30 మందికి స్కానింగ్ ఫారాలు ఇస్తున్నారు. దాంతో వందలాది గర్భిణులు వెనుతిరుగుతున్నారు. రాత్రి వచ్చి వరుసలో నిల్చున వారందరూ నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. ఇలా ఒక్కొక్కరు నెల, రెండు నెలల నుంచి స్కానింగ్ కోసం ఆసుపత్రి చుట్టు ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు.
రాత్రంతా పడిగాపులు..
ఆసుపత్రి సిబ్బంది 35 మందికి స్కానింగ్ చేస్తున్నామని చెబుతున్నా అస లు 20 మందికి కూడా ఫారాలు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా స్కానింగ్ చేసుకోవాలని తలంచిన పేదలు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు ఒక రోజు ముందే వస్తున్నారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్ బిల్డింగ్ ముందు ఉన్న రోడ్డుపైనే నిద్రపోతున్నారు. ఉదయాన్నే తమ వరుస రావాలని గేటుకు (దేవుని గుడిలో మొక్కులు కట్టినట్టు) గుర్తుగా గుడ్డలు కడుతున్నారు. ఉదయం తమకు స్కానిం గ్ అవుతుందో లేదో అని రాత్రంతా వారు పడే వేదన అంతాఇంతా కాదు. నిండు గర్భిణులు రాత్రంతా అవస్థలు పడుతున్న తీరు వర్ణణాతీతం. ఈ సమస్య చాలా కాలంగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
స్కానింగ్ తీసే సరికి ప్రసవం అయిపోతోంది..
8, 9 నెలల గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారు స్కానింగ్ కోసం నెల, రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో వారి ప్రసవం సమయం కూడా అయిపోతున్నదని పలువురు తెలిపారు. ఈ విషయంపై డాక్టర్లు ఏమి సమాధానం చెప్పడం లేదు. ఏ దారి లేక కొందరు పేదలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజూ స్కానింగ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే ‘ స్కానింగ్ మిషిన్ ఒక్కటే ఉంది, డాక ్టర్ల కొరత ఉంద’ని ఆసుపత్రి అధికారులు దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి నివేదించామని బుకాయిస్తున్నారు.
నలుగురే డాక్టర్లు
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. అందులో ఇద్దరు రెగ్యులర్, మరో ఇద్దరు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రి ఇన్‌చార్జి పర్యవేక్షకులు రెగ్యులర్ డాక్టరుగా ఉన్నారు. దాంతో ఆయన సేవలు ప్రసూతి వార్డుకు సరిగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు తెలిపారు. అంతే కాకుండా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓకు డీసీహెచ్‌ఎస్‌గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయన నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు.