నర్సులే దిక్కు!
పేరుకే 24 గంటల ఆస్పత్రులు
వైద్యులు అందుబాటులో ఉండని వైనం
కరెంటుపోతే పేషెంట్లకు కష్టాలే
మచిలీపట్నం : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల పాటు పనిచేసే ఆస్పత్రులు 24 ఉన్నాయి. 90 శాతం ఆస్పత్రుల్లో సాయంత్రం 6 గంటల నుంచి వైద్యులు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. 24 గంటల ఆస్పత్రుల వద్ద అంబులెన్స్ అందుబాటులో ఉంచాలి. అయితే 108 వాహనాలే దిక్కవుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లోకరెంటుపోతే గర్భిణులు, బాలింతలు, శిశువులు దోమలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 గంటల ఆస్పత్రులను సాక్షి బృందం శనివారం రాత్రి 9 నుంచి 12 గంటల వరకు విజిట్ చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలు వెలుగుచూశాయి.
అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు. పామర్రు నుంచి ఇక్కడకు వైద్యులు వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. శనివారం రాత్రి ప్రసూతి కోసం ఓ మహిళ ఆస్పత్రికి రాగా నర్సులే వైద్యం చేశారు. శనివారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య వాంతులు, జ్వరంతో వచ్చిన స్థానిక బాలిక రీమాసేన్‌కు నర్సులే వైద్యసేవలు చేశారు. ఈ సమయంలో చల్లపల్లిలో ఆరోగ్య కేంద్రంలో ఒక పాయిజన్ తీసుకున్న కేసు, కొట్లాట కేసు, పాముకాటు కేసులు వస్తే రాత్రి డ్యూటీ డాక్టర్ సాంబశివరావు వైద్యసేవలు అందించారు.
కైకలూరు ఆస్పత్రిలో రాత్రివేళ కుక్కల బెడద అధికంగా ఉంది. నైట్‌వాచ్‌మన్ లేరు.
గుడ్లవల్లేరు 24 గంటల ఆస్పత్రిలో గైనకాల జిస్టు, చిన్నపిల్లల డాక్టర్లు అందుబాటులో లేరు. ఆపరేషన్ థియేటర్ తలుపులు తీసి 45 రోజులైనట్లు సిబ్బంది చెబుతున్నారు. డాక్టర్ గుంటూరు నుంచి వచ్చివెళ్తున్నారు. సాయంత్రం 5గంటల నుంచి డాక్టర్ ఉండరు.నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు, చాట్రాయి ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్‌నర్సులు ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో మైల వరం, రెడ్డిగూడెం, వెలగలేరు, ఇబ్రహీంపట్నం ఆసుపత్రుల్లో అంబులెన్సులు లేవు. సాయంత్రం 5గంటలైతే వైద్యులు అందుబాటులో ఉండరు. స్టాఫ్‌నర్సులే రోగులకు వైద్యసేవలు అందించారు.
జగ్గయ్యపేట ఆస్పత్రికి రాత్రి సమయంలో ఎవరైనా పేషంట్లు వచ్చి డాక్టర్‌కు తెలిపితే ఆయన వస్తారు. పెనుగంచిప్రోలులో డాక్టర్ అందుబాటులో లేరు. వత్సవాయిలో వాచ్‌మన్ ఒక్కరే ఉన్నారు. సాక్షి బృందం వచ్చిం దని తెలుసుకుని స్టాఫ్ నర్సు వచ్చారు.
పెడన నియోజకవర్గంలో గూడూరు, చినపాండ్రాకలో 24 గంటల ఆస్పత్రులు ఉన్నాయి. గూడూరులో ఆరుగురు వైద్యులకు ముగ్గురే ఉన్నారు. గూడూరు ఆస్పత్రిలో ఇరువురు ఏఎన్‌ఎంలు ఉన్నారు. చినపాండ్రాక ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరు.
నందిగామ నియోజకవర్గంలోని కంచి కచర్ల ఆస్పత్రిలో శనివారం రాత్రి వైద్యులు, నర్సులు అందుబాటులో లేరు. నందిగామ ఆస్పత్రి ఆవరణలో నీరు నిలిచి ఉంది.