వైఎస్ ఫొటోలను తొలగిస్తే ఊరుకోం
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు తొలగించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పేర్కొన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఆయన జిల్లా ఆస్పత్రి ఎదుట మంగళవారం పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ ఫొటోను డిప్యూటీ సీఎం రాజయ్య దగ్గరుండి తొలగించడం అన్యాయమన్నారు.
రాజయ్యను రాజకీయంగా ఆదుకున్నది వైఎస్సే అనే విషయం మరువరాదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైఎస్ ఫొటోను తీయించారే తప్ప ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న ఆయనను ఎవరూ తీయలేరన్నారు. మరెక్కడైనా వైఎస్ ఫొటోలను తొలగించినట్లు తెలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ నేతలు పదవీ వ్యామోహంతో వ్యవహరిస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత లేకుండా కేవలం 25 శాతం రైతులకు మాత్రమే మాఫీ చేయడం తగదన్నారు.
జిల్లాలో అప్పుల బాధలు ఎక్కువై వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. జిల్లాలో పాముకాటుతో మరణిస్తున్న రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందమన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సివస్తుందన్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం తహశీల్దార్ కార్యాలయాల వద్దకు వస్తున్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ నేతలు ఎస్‌ఎస్ పాటిల్, సుధాకర్‌గౌడ్, మక్సూద్ అలీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.