నియోజకవర్గంలో ఏటా అంబలి పంపిణీతో ఎనలేని సంతృప్తినిస్తుంది. నాకు భక్తిభావం ఎక్కువే. శ్రీవేంకటేశ్వర స్వామిని ఇష్టదైవంగా కొలుస్తా. మాది 13 మందితో ఉమ్మడి కుటుంబం. నా ప్రతీ పనిలో నా భార్య రమాదేవి సహకారం మరువలేనిది. ఎస్పీఎం (సిర్పూర్ పేపర్ మిల్లు)ను తెరిపించేలా చూడాలని ఏ గుడికి వెళ్లినా మొక్కుకునేవాడిని. మిల్లు పునఃప్రారంభం కావడం ఎంతో బలాన్నిచ్చింది. ఖాళీ సమయాల్లో మనువలు, మనువరాళ్లతో గడుపుతుంటా’ అంటున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ‘సాక్షి’ పర్సనల్ టైం ఆయనను పలుకరించగా.. అనేక విషయాలు వెల్లడించారు.
సాక్షి, ఆసిఫాబాద్: మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కోనేరు సూర్యనారాయణ, అమ్మ క్రిష్ణవేణి. నలుగురు అన్నదమ్ములం, నలుగురు అక్కాచెల్లెళ్లు. నేను రెండోవాడిని. కాగజ్‌నగర్ సర్‌సిల్క్‌లోని జెడ్పీహైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశా. ఇంటర్ ఇక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివా. ఆ తర్వాత సర్‌సిల్క్‌లో క్యాంటీన్ స్టోర్ కీపర్‌గా పనిచేశా. 1984లో మిల్లు మూతపడడంతో కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో కర్ర బొగ్గు వ్యాపారం చేశా. కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశా. అప్పట్లో మాకు రెండెకరాల భూమి ఉండేది. అంతా కలిసి వ్యవసాయం చేసేవాళ్లం.
మాది ఉమ్మడి కుటుంబం..
మా మేనమామ కూతురు రమాదేవితో 1981లో మా వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వంశీకృష్ణ వివాహం జరిగింది. నాకు చేదోడువాదోడుగా ఇక్కడే ఉంటున్నాడు. అమ్మాయి ప్రతిమ వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రతీ పనిలో నా భార్య రమాదేవి నాకు ఎంతగానో సహకరిస్తుంది. రోజూ అంబలి తయారు చేసి పంపిణీ చేయడంలో ఆమె సహకారం మరువలేనిది. ప్రస్తుతం మా అన్నదమ్ముల కొడుకులు, మనుమలు, మనరాళ్లతో మొత్తం 13 మంది ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసే ఉంటున్నాం.
మొక్కులు బాకీ ఉన్నాయి..
సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడిన మూడున్నరేళ్లు నేను ఏ గుడికి వెళ్లినా మిల్లు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని మొక్కుకునే వాడిని. తిరుపతి, వేములవాడ, కొండగట్టు, బెజవాడ కనకదుర్గమ్మతో పాటు నాగ్‌పూర్, అజ్మీర్ దర్గాలు, రాజస్థాన్‌లోని సలాసర్ గుడి, కర్ణాటకలోని పలు గుళ్లకు వెళ్లినప్పుడు మొక్కుకున్నా. మిల్లు పునఃప్రారంభం కావడంతో ఒక్కో మొక్కు తీర్చుకుంటూ వస్తున్నా. ఇంకా కొన్ని మొక్కులు ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది.
సేవ చేయడం ఇష్టం..
వేసవిలో నిత్యం మా ఇంటి నుంచి ఐదు వేల లీటర్ల అంబలి తయారు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వార సంతలతోపాటు కాగజ్‌నగర్ బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అందిస్తున్నాం. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, బసవతారకం ఆసుపత్రుల్లో ఎంతో మంది రోగులకు పంపిణీ చేశాం. అంబలి తాగిన వారు ‘కడుపు చల్లగా ఉండా’ అని దీవిస్తుంటారు. ఆ దివేనలు నాకు చాలు. ఇంత మంది దీవెనలు ఎంతో సంతృప్తినిస్తాయి.
ఒక పూట భోజనం పెట్టాలి..
నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి నిత్యం కాగజ్‌నగర్‌కు వేలాది మంది వస్తుంటారు. వాళ్లలో అనేక మంది మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటారు. అలాంటి వారి కోసం పట్టణంలో ప్రతి రోజూ ఒకపూట భోజనం పెట్టాలని అనుకుంటున్నా. ఇప్పటికే 25వేల ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, కోనేరు కిట్ పేరు మీద గర్భిణులకు పోషకాహార కిట్ అందించాం. విద్యార్థులకు బుక్స్, స్పోకెన్ ఇంగ్లిష్ మెటీరియల్‌తో పాటు సైనిక్ స్కూల్ ప్రవేశాలు, పోలీస్, అటవీ ఉద్యోగాల పరీక్షల సన్నద్ధత కోసం ఉచితంగా కోచింగ్ ఇచ్చాం. సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు 2018లో కోనేరు ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి.
వైఎస్సార్ నా గురువు..
రాజకీయాల్లో నాకు ప్రధాన గురువు అంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెబుతా. క్రీయాశీలక రాజకీయాల్లోకి రాక ముందు మొదట కేవీ నారాయణరావు హయాంలో టీడీపీ సానుభూతిపరుడిగా ఉండేవాడిని. ఆ తర్వాత 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరా. కార్మిక నాయకుడు జి.సంజీవరెడ్డి నాయకత్వంలో ఎస్పీఎం యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యా. తొలిసారి 1999లో కాంగ్రెస్ నుంచి సిర్పూర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా. ఓటమితో కుంగిపోయి ఉండడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టిన సమయంలో వైఎస్సార్ నాకు ఎంతో తోడ్పాటునిచ్చారు. అనేక రకాలుగా భరోసా నింపారు. వైఎస్సార్ హయాంలోనే 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందా. 2009లో పోటీ చేసి ఓడిపోయినా తిరిగి 2014లో రెండోసారి, 2018లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్నల ప్రోత్సాహం ఉంది. అప్పట్లో జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ సులాన్ అహ్మద్ నాకు రాజకీయంగా అండగా ఉన్నారు. అయితే మొదట్లో నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు.
‘సాక్షి’లో వ్యాసానికి పారితోషికం..
ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడి రైతులకు ఎంత ఆవశ్యకమో తెలియజేస్తూ 2010లో ‘సాక్షి’ దినపత్రికలో వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలకు చక్కటి స్పందన వచ్చింది. ఇందుకు ‘సాక్షి’ యాజమాన్యం నుంచి పారితోషికంగా నాకు రూ.1500 డీడీ పంపారు. తీపి గుర్తుగా ఆ డీడీని దాచుకున్నా. ఇప్పటికీ నాకు అనేక విషయాలపై వ్యాసాలు రాయాలని ఉంటుంది. కానీ వీలు కుదరడం లేదు.
‘మంత్రి’ సాధ్యపడకపోవచ్చు..
మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు ఉన్నప్పటికీ సీనియార్టీ, ప్రాంతం, సామాజిక, జిల్లాల వారీగా తదితర సమీకరణలు చూసినప్పుడు నాకు కేబినెట్‌లో చోటు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చు. మంత్రి పదవి వచ్చినా, రాకున్నా నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి చేస్తా. – సాక్షి, ఆసిఫాబాద్
వైఎస్సార్ నా గురువు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
Published Sun, Jun 2 2019 11:32 AM | Last Updated on Sun, Jun 2 2019 11:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment