సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సుజాత
ఆదిలాబాద్‌రూరల్ : మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు దాహార్తిని తీర్చుకోవడానికి పడరాని పట్లు పడుతున్నారని, అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని చిచ్‌ధరి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీకొరి, చిచ్‌ధరి గ్రామాలను ఆదివారం సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అల్లీకొరి గ్రామంలోని బావిని, చేతి పంపును పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని చేతి పంపుల నీళ్లు అడుగంటిపోవడంతో గ్రామానికి కొంత దూరంలోని బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు.
ఒడ్డు ఉండడంతో నెత్తిపై బిందెలను తెచ్చుకోవడంతో కాళ్లు, చేతులు నొప్పి వస్తున్నాయన్నారు. దానికి మోటార్ బిగించిన అది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడో పని చేయదో తెలియదన్నారు. అంతేకాకుండా తమ గ్రామంలో సీసీ రోడ్లు కూడా నిర్మించలేదని వాపోయారు. అనంతరం గండ్రత్ సుజాత మాట్లాడుతూ కలుషిత నీరు తాగి గిరిజనప్రాంతాల ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని విమర్శించారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికి పలుగ్రామాలకు తాగేందుకు నీళ్లు లభించడం లేదన్నారు.
పలు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేవలం టీఆర్‌ఎస్ నాయకులు మాటల్లో చెబుతున్నారు కానీ చేతల్లో మాత్రం చూపించడం లేదని విమర్శించారు. కొన్నేళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోడు భూములకు పట్టాలను అందించిన విధంగా తాము మళ్లీ అందిస్తామన్నారు. అంతేకాకుండా రూ. 2లక్షల రైతు రుణమాఫీతోపాటు డ్వాక్రా మహిళాలను రుణాలు మాఫీ చేస్తామన్నారు. పండించిన పంటలను రైతులు విక్రయించుకుంటే నెలల తరబడి డబ్బు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. వీరి వెంట ఆ పార్టీ నాయకులు మల్లేశ్, మధుకర్, మాజీ ఎంపీటీసీ వెంకట్, రుపేశ్‌రెడ్డి, ఎస్సీ జిల్లా కన్వీనర్ అడేల్లు, రాష్ట్ర నాయకుడు విలాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment