helth problems
-
వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే!
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంతం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరిగిన వైద్యులు రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్ వైద్యులుండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెరి్వకల్ క్యాన్సర్) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్ హాస్పిటల్లలో క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు ఇవీ.. ► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం ► లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ► పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ► యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ► మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు ఇలా చేస్తే నివారణ సాధ్యం 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. –డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. –డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
షుగర్ వ్యాధికి జాగ్రత్తలే ఔషధం
అరసవల్లి: మధుమేహంగా పిలిచే షుగర్వ్యాధి.. తీపి పదార్ధాలు ఎక్కువ తినే వారిలో వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయా యం చేయకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటివి సమస్యగా పరిణమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్ వ్యాధి బయటపడుతోంది. ఈలోపే నష్టం జరిగిపోతోంది. కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్.. జిల్లాలో 1,34,303 మందికి కోవిడ్ పాజిటివ్ బారినపడ్డారు. కరోనా సోకిన తర్వాత ఎక్కువ శాతం మందికి షుగర్ వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నవారు కోవిడ్ నుంచి సులభంగానే బయటపడ్డారు. నియంత్రణ లేని వారు ఐసీయూలో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 49560 మంది షుగర్ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. 15 శాతం కేసులు పెరిగాయి.. జిల్లా జనాభాలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు..ఇప్పుడు కరోనా తర్వాత 15 శాతం మంది పెరిగారు. ఆహారంలో కార్బోహైడ్రేడ్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పీచు కలిగిన పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి బరువు పెరగకుండా సహాయం చేస్తుంది. – డాక్టర్ కెల్లి చిన్నబాబు, షుగర్ వ్యాధి నిపుణుడు స్టెరాయిడ్స్ వాడితే ప్రమాదం షుగర్ వ్యాధి ఉన్నవారు స్టెరాయిడ్స్ మందులు వాడకూడదు. ఇవి వాడితే శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హానిచేయదు. – డాక్టర్ ఎం.మనోజ్, ద్వారకామయి హాస్పిటల్ -
ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం నాది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్సైజ్లు చేయడంలాంటివి చేయాలా? – కె.పల్లవి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే గర్భిణులు ఒకే పొజిషన్లో కూర్చుని ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయకుండా రెండు గంటలకొకసారి లేచి అటూ ఇటూ తిరగడం చెయ్యాలి. ఎక్కువ ముందుకు వంగి పని చెయ్యకుండా నడుమును కుర్చీకి మంచిగా ఆన్చి కూర్చుని పని చేసుకోవాలి. లేకపోతే నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. గర్భం పెరిగే కొద్దీ బరువు పెరగడం, తర్వాత కాళ్ల వాపులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి టేబుల్ కింద చిన్న స్టూల్ వేసుకుని, లేదా డస్ట్‌బిన్ మీద కాళ్లు ఎత్తుగా పెట్టుకుని కూర్చోవాలి. మంచినీళ్లు బాగా తాగాలి. మధ్యలో పండ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. చిన్నగా కాళ్లను తిప్పడం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చెయ్యాలి. డాక్టర్ సలహా మేరకు చిన్నగా మెట్లు ఎక్కి దిగడం, కింద కూర్చుని మెల్లగా లేవడం వంటివి కొద్దిగా చెయ్యవచ్చు. హెల్త్ఫైల్ కాపీ ఫొటో తీసి మీ ఫోన్లో పెట్టుకోవాలి. ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే, వెంటనే నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి మీ ఫోన్లోని కాపీ చూపించవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గురించి వివరంగా తెలియజేయగలరు. ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుందా? ఈ ఇండెక్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – పి.మాలిక, టంగుటూరు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటే ఒకరి బరువును కేజీల్లో చూసి, ఎత్తును మీటర్లలో కొలిచి, బరువులో మీటర్లను రెట్టింపు చేసి భాగించడం ద్వారా లెక్కిస్తారు. ఎవరైనా ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇదొక సూచిక. బీఎంఐ 18.5 ఉంటే బరువు తక్కువ ఉన్నట్లు, 18.5 నుంచి 24.9 వరకు ఉంటే తగిన బరువు ఉన్నట్లు, 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు ఉన్నట్లు, 30 కంటే ఎక్కువ ఉంటే మరీ అధిక బరువు లేదా ఒబేసిటీ ఉన్నట్లు అంచనా. ప్రపంచం మొత్తం మీద బీఎంఐ లెక్క, వాల్యూ ఒకే విధంగా ఉంటుంది. బీఎంఐ ఆధారంగా ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో చూడటం జరుగుతుంది. బీఎంఐ తక్కువగా ఉంటే బరువు పెరగమని, ఎక్కువగా ఉంటే బరువు తగ్గమని సూచించడం జరుగుతుంది. బీఎంఐ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఎంఐ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. మా వారి ఉద్యోగం షిఫ్ట్‌ల ప్రకారం ఉంటుంది. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి ఉంటుంది. బయటి తిండి ఎక్కువగా తినడం వల్ల ఆయన లావు అవుతున్నారు. దీనివల్ల ఈస్ట్రోజెన్ సమస్య ఏర్పడి పిల్లలు కలగకపోవచ్చునని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – ఆర్జీ, విజయనగరం అధిక బరువు ఉండటం వల్ల కొందరు మగవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఈస్ట్రోజెన్‌గా మార్పు చెంది, టెస్టోస్టిరాన్ మోతాదు తగ్గిపోతుంది. దీనివల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం, కోరికలు సరిగా లేకపోవడం, కలయికలో ఇబ్బందులు వంటి సమస్యల వల్ల సంతానం కలగడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల స్క్రోటమ్‌లో వృషణాలకు గాలి ఆడక, వాటి ఉష్ణోగ్రత పెరిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల బీపీ, సుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి మీవారు ఏదో రకంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చెయ్యడం, వదులుగా ఉండే లోదుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వీర్యపరీక్ష చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
లెక్క తేలుస్తున్నారు..!
సాక్షి కడప : ప్రతి మనిషికి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ ఎంతమందికి సమకూరుతున్నాయి. ప్రజలకు సంబంధించి సౌకర్యాల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమిటి? ప్రభుత్వాలు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయా? లేదా ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? అంగవైకల్యానికి సంబంధించి బాధితులెందరు? ఇతర అనేక సమస్యలకు జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) సంస్థ ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రతి ఏడాది అనేక అంశాలపై సర్వే చేస్తున్న కేంద్రం పరిధిలోని నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయ సిబ్బంది జులై నుంచి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంగవైకల్యం, స్వచ్ఛబారత్ లాంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. ప్రాధాన్యత అంశాలపై సర్వే ఈ ఏడాది జులైలో మొదలైన సర్వే డిసెంబరు వరకు తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యం, అంగవైకల్యం తదితర ప్రాధాన్యత అంశాలపై కొనసాగుతుంది. ప్రజలు వ్యాధుల బారిన పడటం.. శిశు మరణాలు కూడా అధికంగా ఉండటాని కి కారణం సురక్షితం కాని తాగునీటి వినియోగం, బహిరంగ మల విసర్జన, మురుగు నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడమేనని చెప్పవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం ప్రక్షాళన చేపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. అయితే ఇవి ఎంతమాత్రం గ్రామీణ, పట్టణ స్థాయిలో అమలవుతున్నాయో తెలుసుకోవడంతోపాటు ఇతర కారణాలను కూడా సేకరిస్తున్నారు. అంగవైకల్యంపై వివరాల సేకరణ ఆధునిక సమాజంలో అంగవైకల్యం గల వారు సామాజికంగా, ఆర్థికంగా అసమానతలకు గురవుతున్నారు. పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తున్నారు. అయితే కుంటి, గుడ్డి, శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యత, అటిజం తదితర మానసిక వైకల్యం రావడానికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా అంగవైకల్యం గల వారికి పునరావాసం కల్పించే విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు తీరు తెన్నులపై జిల్లాలో సర్వే సాగుతోంది. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులతోపాటు వాటి ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అనుగుణంగా నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం 76వ విడత సర్వేలో భాగంగా అనేక కీలక అంశాలను సేకరిస్తోంది స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన మరుగుదొడ్లతోపాటు బహిరంగ మల విసర్జన, స్థానిక పరిస్థితులు, వనరులపై క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. నిష్ణాణుతులైన సిబ్బందితో సర్వే నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం సుశిక్షితులైన క్షేత్రస్థాయి సిబ్బందిని ఎంపిక చేసుకుని సర్వే చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10 గ్రామీణ ప్రాంతాలతోపాటు ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో బ్లాక్‌లలో తిరుగుతూ వివరాలు సేకరిస్తారు. సంబంధిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను కలిసినా....వాటిలో లెక్కవేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి సంబంధిత షెడ్యూల్లలో నింపుతారు. ఇందుకోసం దాదాపు 10 మంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఆరుగురు సూపర్వైజర్లు, 175 శ్యాంపిళ్లను సేకరించనున్నారు. సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సర్వేతో ఎన్నో ప్రయోజనాలు ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరు నెలల్లో సర్వేను పూర్తి చేసి సంబంధిత ఉన్నత కార్యాలయాలకు నివేదికలు పంపిస్తారు. దాని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. సర్వే ఆధారంగా అక్కడి పరిస్థితులను అంచనా వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. ప్రజలు సహకరించాలి సరైన సమాచారం లేకుండా ఏ విషయంపైనైనా విధాన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ సర్వే విజయం, లక్ష్యసాధన ప్రజలు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. అసంపూర్తి, అసత్య సమాచారాన్ని అందించడం వల్ల ప్రణాళిక రూపకల్పన దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ప్రజలంతా ఈ సర్వే ప్రాముఖ్యతను గుర్తించి తమ వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు, కచ్చితమైన సమాచారాన్ని అందించి విజయవంతం చేయాలి. – మనోహర్, డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ఓ సర్వే -
ఏజెన్సీలో నీటిఎద్దడి తీర్చాలి
ఆదిలాబాద్‌రూరల్ : మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు దాహార్తిని తీర్చుకోవడానికి పడరాని పట్లు పడుతున్నారని, అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని చిచ్‌ధరి ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లీకొరి, చిచ్‌ధరి గ్రామాలను ఆదివారం సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అల్లీకొరి గ్రామంలోని బావిని, చేతి పంపును పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లోని చేతి పంపుల నీళ్లు అడుగంటిపోవడంతో గ్రామానికి కొంత దూరంలోని బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. ఒడ్డు ఉండడంతో నెత్తిపై బిందెలను తెచ్చుకోవడంతో కాళ్లు, చేతులు నొప్పి వస్తున్నాయన్నారు. దానికి మోటార్ బిగించిన అది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడో పని చేయదో తెలియదన్నారు. అంతేకాకుండా తమ గ్రామంలో సీసీ రోడ్లు కూడా నిర్మించలేదని వాపోయారు. అనంతరం గండ్రత్ సుజాత మాట్లాడుతూ కలుషిత నీరు తాగి గిరిజనప్రాంతాల ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని విమర్శించారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికి పలుగ్రామాలకు తాగేందుకు నీళ్లు లభించడం లేదన్నారు. పలు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేవలం టీఆర్ఎస్ నాయకులు మాటల్లో చెబుతున్నారు కానీ చేతల్లో మాత్రం చూపించడం లేదని విమర్శించారు. కొన్నేళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోడు భూములకు పట్టాలను అందించిన విధంగా తాము మళ్లీ అందిస్తామన్నారు. అంతేకాకుండా రూ. 2లక్షల రైతు రుణమాఫీతోపాటు డ్వాక్రా మహిళాలను రుణాలు మాఫీ చేస్తామన్నారు. పండించిన పంటలను రైతులు విక్రయించుకుంటే నెలల తరబడి డబ్బు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. వీరి వెంట ఆ పార్టీ నాయకులు మల్లేశ్, మధుకర్, మాజీ ఎంపీటీసీ వెంకట్, రుపేశ్రెడ్డి, ఎస్సీ జిల్లా కన్వీనర్ అడేల్లు, రాష్ట్ర నాయకుడు విలాస్ తదితరులు ఉన్నారు. -
ఆరోగ్యం సహకరించక..
తుంగతుర్తి : ఆరోగ్యం సహకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇద్దరు బలవన్మరణం పొందారు. తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బొజ్జ శోభ(26) బావిలో దూకి, త్రిపురారంలో దువ్వాలి సుబ్రహ్మణ్యం పురుగుల మందు తాగి బలవన్మరణం పొందారు. నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొజ్జ శోభ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె ఆరోగ్యాన్ని బాగుచేయించేందు కు తుంగతుర్తి మండలం సంగెం గ్రామానికి గతవారం భార్యాభర్తలు కలిసి దేవుడమ్మ (భూతవైద్యురాలు) వద్దకు వచ్చారు. ఆరోగ్యం కుదుట పడాలంటే మూడు వారాల పాటు ఇక్కడికి రా వా లని దేవుడమ్మ చెప్పడంతో చివరివారం ఆది వారం భార్య, భర్త, కూతురు కలిసి బైక్‌పై సంగెం వచ్చారు. దేవుడమ్మ వద్ద ఎక్కువ జనం ఉండడంతో వెంకటేశ్ నేను వెళ్తున్నానని, దేవుడమ్మ వద్ద చూపించుకున్న అనంతరం ఫోన్చేయమని భార్య కు చెప్పి, స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అనంతరం శోభ తన నాలుగేళ్ల కూతురుని తీసుకుని కోడూరువైపు వెళ్లి అక్కడ ఉన్న బావిగడ్డపై కూతురుని కూర్చోబెట్టి బావిలో దూకింది. అటుగా వస్తున్న ఓ ప్రయాణికుడు పాప ఏడుపు, సెల్‌ఫోన్ రింగ్ అవుతుండటంతో దగ్గరికి వెళ్లి పాపను ఓదార్చి ఫోన్ లిప్ట్ చేశాడు. ఫోన్లో శోభ భర్త వెంకట్‌తో సంగెం సమీపంలోని బావి వద్ద పాప ఏడుస్తుంది.. పక్కన ఎవరులేరని చెప్పాడు. పాప బావివైపు వెళ్లిందని సంజ్ఞలు చేయడంతో బావిలో చూశాడు. బావిలో శోభ చెప్పులు కన్పి స్తుండడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అనంత రం భర్త, గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని శోభ మృతదేహాన్ని వెలికితీశారు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాలునాయక్ కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శోభ విగతజీవిగా పడి ఉండడంతో పాప ఏడుపు అక్కడివారిని కలిచివేసింది. పురుగుల మందు తాగి వ్యక్తి.. త్రిపురారం(నాగార్జునసాగర్) : అనారోగ్య కారణంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురారం మం డల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దువ్వారి సుబ్రహ్మణ్యం(48) కారుడ్రైవర్‌గా పని చేస్తూ జీవన సాగిస్తున్నాడు. ఇటీవల సు బ్రమణ్యం అనారోగ్యానికి గురై తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సుబ్రహ్మణ్యం త్రిపురారం గ్రామ శివారులో వ్యవసాయ పొ లాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలాల్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహం స్థానికులను కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని సంఘటన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు త్రిపురారం ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు. -
కష్టాల కొండయ్య
భద్రాచలంఅర్బన్ : పట్టణ ఆదర్శనగర్‌లో నివాసముంటున్న సేగు కొండయ్య దాతల కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనిది లేచి నిలబడలేని స్థితి. కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేడు. ఒకప్పుడు పాత మార్కెట్ ఏరియాలో హోటల్ నడిపిన అతను, కాల క్రమేణ ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మూసివేశాడు. కొంత కాలం క్రితం అనారోగ్యంతో భార్య సీతమ్మ చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లై వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయాడు. తన మరదలు ఇప్పుడు కొండయ్య యోగక్షేమాలు చూసుకుంటోంది. కనీస సొంత ఇల్లు కూడా లేని కొండయ్య ఆదర్శనగర్‌లో నెలకు రూ 400 అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రభుత్వం వృద్ధులకు అందజేస్తున్న రూ.1000 ఆసరా ఫింఛన్ అతని జీవనధారం. వైశ్య కుటుంబంలో పుట్టిన అతను హోటల్ వ్యాపారం కన్న ముందు అనేక చిన్న చిన్న వ్యాపారులు చేసి చితికి పోయాడు. కనీసం ఇంట్లో మంచం, దుప్పట్లు, ఫ్యాన్ కూడా లేదు. ప్రభుత్వ ఇస్తున్న రేషన్ బియ్యాన్ని జావలా చేసి ఇస్తే తాగుతున్నాడు. తనను ఎవరైనా దాతలు ఆదుకోవాలని దీనంగా ఎదురుచూస్తున్నాడు. దాతలు భద్రాద్రి పట్టణంలోని ఆదర్శనగర్ 185 ఇంటి నంబర్లో సంప్రదించాలి. -
ఎంతపని చేశావమ్మా!
ఆమె ఓ విధి వంచిత.. ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో కన్నవారు దగ్గరకు రానీయలేదు.. పుట్టిన పిల్లలిద్దరూ దివ్యాంగులే.. మనస్పర్థలతో భర్త దూరమయ్యాడు.. ఈ సమస్యలకు తోడు వేధిస్తున్న అనారోగ్యం.. మానసికంగా కుంగిపోయింది.. చివరకు కొడుకులిద్దరినీ అనాథలను చేసి బలవన్మరణానికి పాల్పడింది. తినడం కూడా చేతకాని స్థితిలో వైకల్యంతో బాధ పడుతున్న చిన్నారుల బేల చూపులు చూపరులను కంట తడి పెట్టిస్తున్నాయి. కానీ వారిని అక్కున చేర్చుకునేదెవరు? ఈ విషాద ఘటన చీడికాడ మండలం అప్పలరాజుపురంలో జరిగింది. చీడికాడ (మాడుగుల): అప్పలరాజుపురం విషాదంతో కుమిలిపోయింది. పిల్లల్ని అనాథలను చేసి ఓ తల్లి ఆత్మహత్య అందరినీ కలచివేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి ఎస్సై హిమగిరి అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన రెడ్డి సునీత (30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పెదపాటి లక్ష్మి ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు, పెద్దల సమక్షంలో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రేమకు దూరమైన అభాగ్యురాలు ప్రేమ రాహిత్యమే సునీత మరణానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సునీత పుట్టింటి వారిది రోలుగుంట మండలం జె.నాయుడు పాలెం గ్రామం. పదేళ్ల క్రితం సునీత, అప్పలరాజుపురానికి చెందిన రెడ్డి గంగరాజులు ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలకు చెందిన వారు కావడంతో సునీత కుటుంబసభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదురించి సునీత గంగరాజును పెళ్లాడింది. వీరికి భానుతేజ(8), త్రిగుణు(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం గంగరాజు మండలంలోని దిబ్బపాలెం యూపీ స్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు పుట్టాక కూడా సునీత తల్లిదండ్రులు సునీతతో సక్యతగా మెలగలేదు. దీంతో ఒంటరితనం ఆవహించింది. ఇదిలా ఉంటే పెద్ద కుమారుడు భానుతేజ ఆరోగ్యం అంతంత మాత్రం. మానసిక వికలాంగుడు. రెండో కుమారుడు పుట్టుకతోనే ఒక చెవి పూర్తిగా లేకపోవడంతో వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యలన్నింటి మధ్య భర్త గంగరాజుతో మనస్పర్ధలు ఏర్పడడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడింది.ç సునీత ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలిపోయారు. వారికి దిక్కెవరు?ఇదిలా ఉంటే చిన్న కుమారుడికి చేతితో తినడం చేతకాకపోవడంతో రోజూ సునీతే తినిపించేదని చుట్టుపక్కల వారు చెబుతూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. పిల్లలిద్దిరినీ ఎవరికి అప్పగించాలో చెప్పాలని మృతురాలి తల్లి లక్ష్మీ, సోదరి, కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలముకున్నాయి.∙ -
జర భద్రం లేకుంటే పానీపూరితో పరేషానే
వైరా: సాయంత్రం వేళల్లో వేడివేడి గప్‌చుప్, పానీపూరి తింటుంటే ఆహా..భలే రుచి అనుకుంటారు. అయితే..తయారీలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీటిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే..పరిశుభ్రంగా ఉన్న బండ్ల వద్దనే తినాలని పెద్దలు, వైద్యులు సూచిస్తున్నారు. పూరిని బొటనవేలుతో నొక్కి..అందులో ద్రావణాన్ని నింపుతాడు. గోరులో మట్టి రేణువులు ఉంటే..అవి అందులో కలిసే అవకాశముంది. కుండకు కట్టే ఎర్రటి వస్త్రాన్ని ఉతకడంపై అనేక అనుమానాలు ఉంటాయి. నీటిని వేడి చేయని కారణంగా సూక్ష్మజీవులు చనిపోవు. ఈ–కొలై అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు అంటున్నారు. పానీ, పూరిలను తయారు చేసే ప్రాంతాలపై పట్టింపు లేదు. అధికారుల తనిఖీలు ఉండవు రోడ్ల పక్కన అమ్ముతున్నప్పుడు దుమ్ముధూళి ఎగసిపడుతున్నా..అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటివి తింటే..వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. చింతపండు పులుసు (పానీ) తయారీకి ఉప్పు, జీరావన్ (మధ్యప్రదేశ్‌కు చెందిన మసాలా), పుదీనా, నల్ల మిరియాల పొడి ఇలా అనే రకాలు కలుపుతారు. అయితే..పరిశుభ్రమైన నీటిని వాడరనే అపవాదు ఉంది. సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెద్దలు అంటున్నారు. నిల్వ ఉంటే బ్యాక్టీరియానే.. పానీలో రాజస్థాన్‌కు చెందిన మసాలాలు కలుపుతారు. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. చిన్న పిల్లలకు జీర్ణం కావు. వేడి చేయకుండా నిల్వ ఉండే పులుసులో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పటికప్పుడు తయారు చేసింది కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. ఎక్కువ తీసుకోవద్దు. కడుపులో అల్సర్, గ్యాస్ సమస్యలున్న వారు దీని జోలికి వెళ్లకపోవడం మంచిది. – డాక్టర్ ఖలీముద్దీన్, ప్రభుత్వ వైద్యుడు , వైరా -
పూరైన ఇంటింటి కాళ్లవాపు సర్వే
వీఆర్ పురం : కాళ్ల వాపుతో పలువురు మృత్యువాత పడుతున్న నేపధ్యంలో మంగళవారం నుంచి మండల వ్యాప్తంగా నిర్వహించిన సర్వే పూర్తయింది. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7748 కుంటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. సర్వే బృందం కాళ్ల వాపు లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి తొలుత రేఖపల్లి ఆస్పత్రికి తరలించేదని వారు తెలిపారు. అక్కడ వారిని వైద్య నిపుణులు పరీక్షించాక, అవసరమైన వారికి అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేవారని వివరించారు. మంగళవారం 18 మంది కాళ్ల వ్యాపు వ్యాధిగ్రస్తులను గుర్తించగా, నలుగురిని కాకినాడకు తరలించారన్నారు. బుధవారం 31 మందిని గుర్తించగా వారిలో 16మందిని, గురువారం 12 మందిని గుర్తించగా ఇద్దరిని ,శుక్రవారం నలుగురిని గుర్తించగా ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని చెప్పారు. శనివారం నుంచి మళ్లీ మండల వ్యాప్తంగా రెండో దఫా కాళ ్లవాపు సర్వే కొనసాగుతుందని వారు చెప్పారు. -
వ్యాధులపై ఎట్టకేలకు కదలిక
వైద్యశాఖ కేంద్రంగా చింతూరు ఏరియా ఆసుపత్రి, ప్రత్యేక వైద్య నిపుణులు వ్యాధులపై నిరంతర నివేదిక తొలినుంచీ ‘సాక్షి’ పోరాటం బాధితుల వెతలపై వరుస కథనాలు 18004253077 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చింతూరు : ఏజెన్సీలోని విలీన మండలాల్లో విజృంభిస్తున్న వ్యాధులపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుసకొడుతున్న జ్వరాలు, డెంగీ, పెరుగుతున్న మలేరియా కేసులపై ‘సాక్షి’ నెట్వర్క్ బాధితుల వెతలను ఎప్పటిప్పుడు వెలుగులోకి తేవడంతో ఇటు సర్కారు, అటు అధికారులు కదలక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితులపై ఆరా తీయడంతో అంతవరకూ పట్టించుకోని మంత్రుల్లో చలనం కలిగింది. ఇప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్పలు స్పందించిన దాఖలాలు లేవు. గిరిజన శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు వచ్చి తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోయారు. తరువాత వైఎస్పార్ సీపీ ఎమ్మెల్సీ సుభాస్ చంద్రబోస్, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబులు ఏజెన్సీ ప్రాంతంలోను పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులను పలుకరించారు. దీంతో తేరుకున్న అధికారులు విలీన మండలాల్లో వ్యాధుల నివారణకు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పీవో చక్రధరబాబు సోమవారం విలీన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వ్యాధుల నివారణకు తక్షణం చేపట్టాల్సిన చర్యలను ఈ పర్యటనలో చర్చించినట్లు తెలిసింది. గత ఇరవై రోజులుగా విలీన మండలాల్లో వ్యాధులు ప్రబలి కొంతమంది మృత్యువాత పడడం అనేకమంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే. కాళ్లవాపు వ్యాధి కారణంగా వీఆర్‌పురం మండలంలో నలుగురు మృత్యువాత పడగా 32 మంది వరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి చింతూరు మండలానికి కూడా పాకింది. దీంతోపాటు డెంగీ, మలేరియా వ్యాధులతో కూడా గిరిజనులు మృత్యువాత పడుతుండడంతో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులను నియంత్రించడంలో అధికారుల వైఫల్యంపై ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. చింతూరులో ఏరియా ఆసుపత్రి... విలీన మండలాల్లో వైద్యసేవలు మెరుగు పరిచేందుకు చింతూరులో రూ నాలుగున్నర కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని దీనికోసం టెండర్లు కూడా పిలిచామని పీవో చక్రధరబాబు తెలిపారు. సోమవారం ఆయన చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ చింతూరులో పౌష్టికాహారం కేంద్రం, ఆపరేషన్ ధియేటర్ నిర్మిస్తామని, ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని తెలిపారు. చింతూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్పీహెచ్వోకు డిప్యూటీ సివిల్ సర్జన్ బాధ్యతలను అప్పగిస్తున్నామని, కూనవరం ఆసుపత్రి భవనానికి కూడా మరమ్మతులు చేయిస్తామని పీవో తెలిపారు. సోమవారం నుంచి మూడ్రోజులపాటు వైద్యసిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధులపై ఆరా తీస్తారని, ఎవరికైనా వ్యాధి తీవ్రత అ«ధికంగా ఉంటే వెంటనే కాకినాడ తరలిస్తామని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని, ఆర్డీటీ, ఏసీటీ కిట్లతోపాటు క్లోరోక్విన్, ప్రైమాక్విన్, పారాసెట్మాల్ మాత్రలను ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యశిబిరాలు, గ్రామాల్లోకి వెళ్లేందుకు పీహెచ్సీ వైద్యులకు వాహన సదుపాయం కల్పిస్తామని, త్వరలోనే స్ప్రేయింగ్ కార్యక్రమం చేపడతామని పీవో పేర్కొన్నారు. 18004253077 అనే టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై నిరంతరం ఐటీడీఏ... ఇప్పటివరకు కేవలం బుధవారం సంతరోజు మాత్రమే నిర్వహిస్తున్న ఐటీడీఏ కార్యక్రమాలు ఇకపై నిరంతరంగా నిర్వహించాలని పీవో చక్రధరబాబు ఏపీవో వెంకటేశ్వరరావును ఆదేశించారు. తక్షణమే ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను భర్తీచేసి పాలన నిర్వహించాలని, విలీన మండలాల్లోని వ్యాధులు, వైద్యంపై ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. -
చింతూరుకు పాకిన కాళ్లవాపు వ్యాధి
చింతూరు : ఏజన్సీలో గిరిజనులను హడలెత్తిస్తున్న కాళ్లవాపు వ్యాధి చింతూరు మండలానికీ పాకింది. గురువారం ఈ వ్యాధితో బాధపడుతూ మండలంలోని కల్లేరు గ్రామానికి చెందిన సోడె రాములయ్య అనే ఆటోడ్రైవర్ చింతూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతడిని పరిశీలించిన వైద్యులు రక్తపూతలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను ఇవ్వగా కాళ్లవాపు కొద్దిగా తగ్గినట్టు వైద్యాధికారి శివరామకృష్ణ తెలిపారు. వారం రోజులుగా కాళ్లు వాచి ఇబ్బంది పడుతున్నానని, దీంతో గురువారం ఆసుపత్రికి వచ్చానని బాధితుడు రాములయ్య తెలిపాడు. తమ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కూడా ఈ వ్యాధిసోకి తగ్గినట్టు అతను తెలిపాడు. ఇప్పటికే కాళ్లవాపు వ్యాధితో వీఆర్‌పురం మండలంలో ముగ్గురు మృత్యువాత పడగా, 32 మంది కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధితో పక్క మండలంలో గిరిజనులు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకుని కల్లేరుతో పాటు పక్క గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మధుమేహం వ్యాధితో విరక్తి చెంది అఘాయిత్యం అమలాపురం టౌన్ : సరదాగా సాగి పోవాల్సిన వయసు నుంచే మధుమేహం వ్యాధి ఆ ఇంజనీరింగ్ విద్యార్థినికి ఇబ్బందిగా మారడంతో జీవితంపై విరక్తి చెంది చివరకు తన ప్రాణాలనే బలవంతంగా తీసుకున్న సంఘటన అమలాపురం వంటెద్దువారి వీధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తన 12 ఏళ్ల వయసు నుంచే తనకు వచ్చిన మధుమహం వ్యాధి ఇక తగ్గదన్న బాధతో ఆ వీధికి చెందిన ఎస్.తేజస్విని (20) అనే యువతి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం... తేజస్విని భట్లపాలెం ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఎనిమిదేళ్లుగా మధుమేహానికి ఆమె మందులు వాడుతూనే ఉంది. దీంతో ఆత్మనూన్యతా భావానికి గురైంది. బుధవారం రాత్రి తమ ఇంటి పక్కన బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతోంది. తమ ఇంట్లో వారంతా ఆ పెళ్లి హడావుడిలో అక్కడే ఉన్నారు. ఈ సమయంలో తేజస్విని తన ఇంట్లో ఉరి వేసుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అర్ధరాత్రి సమయంలో కుటుంబీకులు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. అందరితో చలాకీగా ఉండే తేజస్విని మధుమేహం ఇక తగ్గదన్న బెంగతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో గుర్తించారు. ఇక కొద్ది నెలల్లో ఇంజనీరింగ్ పట్టా అందుకోవాల్సిన తమ కూతురు ఇలా ఆత్యహత్య చేసుకోవడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో వంటెద్దవారి వీధిలో విషాదం అలుముకుంది. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.