వ్యాధులపై ఎట్టకేలకు కదలిక
-
వైద్యశాఖ కేంద్రంగా చింతూరు
-
ఏరియా ఆసుపత్రి, ప్రత్యేక వైద్య నిపుణులు
-
వ్యాధులపై నిరంతర నివేదిక
-
తొలినుంచీ ‘సాక్షి’ పోరాటం
-
బాధితుల వెతలపై వరుస కథనాలు
-
18004253077 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు
చింతూరు :
ఏజెన్సీలోని విలీన మండలాల్లో విజృంభిస్తున్న వ్యాధులపై ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుసకొడుతున్న జ్వరాలు, డెంగీ, పెరుగుతున్న మలేరియా కేసులపై ‘సాక్షి’ నెట్‌వర్క్ బాధితుల వెతలను ఎప్పటిప్పుడు వెలుగులోకి తేవడంతో ఇటు సర్కారు, అటు అధికారులు కదలక తప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితులపై ఆరా తీయడంతో అంతవరకూ పట్టించుకోని మంత్రుల్లో చలనం కలిగింది. ఇప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్పలు స్పందించిన దాఖలాలు లేవు. గిరిజన శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు వచ్చి తూతూమంత్రంగా పర్యటించి వెళ్లిపోయారు. తరువాత వైఎస్పార్ సీపీ ఎమ్మెల్సీ సుభాస్ చంద్రబోస్, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబులు ఏజెన్సీ ప్రాంతంలోను పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులను పలుకరించారు. దీంతో తేరుకున్న అధికారులు విలీన మండలాల్లో వ్యాధుల నివారణకు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పీవో చక్రధరబాబు సోమవారం విలీన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. వ్యాధుల నివారణకు తక్షణం చేపట్టాల్సిన చర్యలను ఈ పర్యటనలో చర్చించినట్లు తెలిసింది. గత ఇరవై రోజులుగా విలీన మండలాల్లో వ్యాధులు ప్రబలి కొంతమంది మృత్యువాత పడడం అనేకమంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే. కాళ్లవాపు వ్యాధి కారణంగా వీఆర్‌పురం మండలంలో నలుగురు మృత్యువాత పడగా 32 మంది వరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి చింతూరు మండలానికి కూడా పాకింది. దీంతోపాటు డెంగీ, మలేరియా వ్యాధులతో కూడా గిరిజనులు మృత్యువాత పడుతుండడంతో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులను నియంత్రించడంలో అధికారుల వైఫల్యంపై ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి.
చింతూరులో ఏరియా ఆసుపత్రి...
విలీన మండలాల్లో వైద్యసేవలు మెరుగు పరిచేందుకు చింతూరులో రూ నాలుగున్నర కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని దీనికోసం టెండర్లు కూడా పిలిచామని పీవో చక్రధరబాబు తెలిపారు. సోమవారం ఆయన చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ చింతూరులో పౌష్టికాహారం కేంద్రం, ఆపరేషన్ ధియేటర్ నిర్మిస్తామని, ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని తెలిపారు. చింతూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్పీహెచ్‌వోకు డిప్యూటీ సివిల్ సర్జన్ బాధ్యతలను అప్పగిస్తున్నామని, కూనవరం ఆసుపత్రి భవనానికి కూడా మరమ్మతులు చేయిస్తామని పీవో తెలిపారు. సోమవారం నుంచి మూడ్రోజులపాటు వైద్యసిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధులపై ఆరా తీస్తారని, ఎవరికైనా వ్యాధి తీవ్రత అ«ధికంగా ఉంటే వెంటనే కాకినాడ తరలిస్తామని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని, ఆర్డీటీ, ఏసీటీ కిట్లతోపాటు క్లోరోక్విన్, ప్రైమాక్విన్, పారాసెట్‌మాల్ మాత్రలను ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల వద్ద ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యశిబిరాలు, గ్రామాల్లోకి వెళ్లేందుకు పీహెచ్‌సీ వైద్యులకు వాహన సదుపాయం కల్పిస్తామని, త్వరలోనే స్ప్రేయింగ్ కార్యక్రమం చేపడతామని పీవో పేర్కొన్నారు. 18004253077 అనే టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇకపై నిరంతరం ఐటీడీఏ...
ఇప్పటివరకు కేవలం బుధవారం సంతరోజు మాత్రమే నిర్వహిస్తున్న ఐటీడీఏ కార్యక్రమాలు ఇకపై నిరంతరంగా నిర్వహించాలని పీవో చక్రధరబాబు ఏపీవో వెంకటేశ్వరరావును ఆదేశించారు. తక్షణమే ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను భర్తీచేసి పాలన నిర్వహించాలని, విలీన మండలాల్లోని వ్యాధులు, వైద్యంపై ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.