చింతూరుకు పాకిన కాళ్లవాపు వ్యాధి
Published Thu, Sep 15 2016 10:25 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
చింతూరు :
ఏజన్సీలో గిరిజనులను హడలెత్తిస్తున్న కాళ్లవాపు వ్యాధి చింతూరు మండలానికీ పాకింది. గురువారం ఈ వ్యాధితో బాధపడుతూ మండలంలోని కల్లేరు గ్రామానికి చెందిన సోడె రాములయ్య అనే ఆటోడ్రైవర్ చింతూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతడిని పరిశీలించిన వైద్యులు రక్తపూతలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను ఇవ్వగా కాళ్లవాపు కొద్దిగా తగ్గినట్టు వైద్యాధికారి శివరామకృష్ణ తెలిపారు. వారం రోజులుగా కాళ్లు వాచి ఇబ్బంది పడుతున్నానని, దీంతో గురువారం ఆసుపత్రికి వచ్చానని బాధితుడు రాములయ్య తెలిపాడు. తమ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కూడా ఈ వ్యాధిసోకి తగ్గినట్టు అతను తెలిపాడు. ఇప్పటికే కాళ్లవాపు వ్యాధితో వీఆర్‌పురం మండలంలో ముగ్గురు మృత్యువాత పడగా, 32 మంది కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధితో పక్క మండలంలో గిరిజనులు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకుని కల్లేరుతో పాటు పక్క గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement