ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం నాది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడంలాంటివి చేయాలా?
– కె.పల్లవి, హైదరాబాద్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే గర్భిణులు ఒకే పొజిషన్‌లో కూర్చుని ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయకుండా రెండు గంటలకొకసారి లేచి అటూ ఇటూ తిరగడం చెయ్యాలి. ఎక్కువ ముందుకు వంగి పని చెయ్యకుండా నడుమును కుర్చీకి మంచిగా ఆన్చి కూర్చుని పని చేసుకోవాలి. లేకపోతే నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. గర్భం పెరిగే కొద్దీ బరువు పెరగడం, తర్వాత కాళ్ల వాపులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి టేబుల్ కింద చిన్న స్టూల్ వేసుకుని, లేదా డస్ట్‌బిన్ మీద కాళ్లు ఎత్తుగా పెట్టుకుని కూర్చోవాలి. మంచినీళ్లు బాగా తాగాలి. మధ్యలో పండ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. చిన్నగా కాళ్లను తిప్పడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చెయ్యాలి. డాక్టర్ సలహా మేరకు చిన్నగా మెట్లు ఎక్కి దిగడం, కింద కూర్చుని మెల్లగా లేవడం వంటివి కొద్దిగా చెయ్యవచ్చు. హెల్త్‌ఫైల్ కాపీ ఫొటో తీసి మీ ఫోన్‌లో పెట్టుకోవాలి. ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే, వెంటనే నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి మీ ఫోన్‌లోని కాపీ చూపించవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గురించి వివరంగా తెలియజేయగలరు. ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుందా? ఈ ఇండెక్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
– పి.మాలిక, టంగుటూరు
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటే ఒకరి బరువును కేజీల్లో చూసి, ఎత్తును మీటర్లలో కొలిచి, బరువులో మీటర్లను రెట్టింపు చేసి భాగించడం ద్వారా లెక్కిస్తారు. ఎవరైనా ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇదొక సూచిక. బీఎంఐ 18.5 ఉంటే బరువు తక్కువ ఉన్నట్లు, 18.5 నుంచి 24.9 వరకు ఉంటే తగిన బరువు ఉన్నట్లు, 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు ఉన్నట్లు, 30 కంటే ఎక్కువ ఉంటే మరీ అధిక బరువు లేదా ఒబేసిటీ ఉన్నట్లు అంచనా. ప్రపంచం మొత్తం మీద బీఎంఐ లెక్క, వాల్యూ ఒకే విధంగా ఉంటుంది. బీఎంఐ ఆధారంగా ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో చూడటం జరుగుతుంది. బీఎంఐ తక్కువగా ఉంటే బరువు పెరగమని, ఎక్కువగా ఉంటే బరువు తగ్గమని సూచించడం జరుగుతుంది. బీఎంఐ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఎంఐ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. మా వారి ఉద్యోగం షిఫ్ట్‌ల ప్రకారం ఉంటుంది. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి ఉంటుంది. బయటి తిండి ఎక్కువగా తినడం వల్ల ఆయన లావు అవుతున్నారు. దీనివల్ల ఈస్ట్రోజెన్ సమస్య ఏర్పడి పిల్లలు కలగకపోవచ్చునని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.
– ఆర్‌జీ, విజయనగరం
అధిక బరువు ఉండటం వల్ల కొందరు మగవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఈస్ట్రోజెన్‌గా మార్పు చెంది, టెస్టోస్టిరాన్ మోతాదు తగ్గిపోతుంది. దీనివల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం, కోరికలు సరిగా లేకపోవడం, కలయికలో ఇబ్బందులు వంటి సమస్యల వల్ల సంతానం కలగడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల స్క్రోటమ్‌లో వృషణాలకు గాలి ఆడక, వాటి ఉష్ణోగ్రత పెరిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల బీపీ, సుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి మీవారు ఏదో రకంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చెయ్యడం, వదులుగా ఉండే లోదుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వీర్యపరీక్ష చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్
ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Published Sun, May 26 2019 7:30 AM | Last Updated on Sun, May 26 2019 7:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment