తలకిందులైన సాఫ్ట్‌వేర్‌ లైఫ్‌స్టైల్‌.. | No Guarantee in Software Jobs IT Employees Focus on Savings | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌.. సేవింగ్స్‌పై ‘కేర్‌’..

Published Thu, Jun 6 2019 12:32 PM | Last Updated on Wed, Jun 12 2019 9:46 AM

No Guarantee in Software Jobs IT Employees Focus on Savings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ పూర్తవగానే ఎంఎన్‌సీ కంపెనీలు కొలువిచ్చాయి. కెరీర్‌ మొదలు పెట్టగానే ఐదంకెల జీతం.. ఐదు రోజుల పని.. వీకెండ్‌ పార్టీలు, మాల్స్‌లో షాపింగ్‌లు.. బ్రాండెడ్‌ వస్తువులు.. ఖరీదైన సెల్‌ఫోన్లు.. ఇదీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లైఫ్‌ అంటే ఇంత సుఖంగా ఉంటుందా అన్న రేంజ్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మనవాళ్లని పెంచి పోషించాయి. సాఫ్ట్‌వేర్‌ ఇదో డిగ్రీ పేరో.. కోర్సు పేరో.. కాదు.. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్‌. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో అంతకన్నా స్వేచ్ఛగా యువతను ఎగిరేలా చేసినా ఓ లైఫ్‌ట్రెండ్‌. ఇండియాలో సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ మొదలయ్యాక సీన్‌ అంతా మారిపోయింది. 

సాప్ట్‌వేరు.. జీవితం వేరు..
దేశంలో ఏ రంగంలో ఇవ్వలేనన్ని జీతాలు ఒక్క సాఫ్ట్‌వేర్‌ రంగం మాత్రం ఇవ్వగలిగింది. ఒక్క జీతాల్నే కాదు. ఒక ఉద్యోగి ఊహించని సదుపాయాల్ని కల్పించింది. ఉద్యోగులకు ప్రాజెక్టులు లేకపోయినా సరే వారికి ప్రాజెక్టులు వచ్చే వరకు పూర్తి జీతం ఇచ్చి బెంచ్‌ మీద ఉంచింది. బాస్‌ ఒక్కమాట అన్నా సరే రిజైన్‌ లెటర్‌ ఇచ్చి మర్నాడే వేరే కంపెనీలో జాయిన్‌ అయిపోయేవారు. దీంతో తమ జీవితాలకు అసలు ఢోకా లేదనుకున్నారు. వీళ్లను చూసి కొత్తతరం అంతా ఇంజనీరింగ్‌ బాట పట్టారు. క్యాంపస్‌లో బీటెక్‌లు పూర్తిచేయకముందే కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవి. కంపె నీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటివ్‌లతో ఒక్కసారిగా లగ్జరీ ఆవరించేసింది. కానీ కాలం, కర్మం కలసి రాకపోవడంతో తత్వం బోధపడి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దూకుడు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ..
దేశంలో ఎక్కడా లేనంతమంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఏటేటా తెలుగు రాష్ట్రాల్లో పుట్టుకొస్తారు. వీరికితోడు ఇన్‌స్టెంట్‌ ఉద్యోగం కోసం కోర్సులు నేర్చుకుని మరీ రెడీ అయ్యేవారు. సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ కారణంగా ఒకప్పుడు గ్రూప్స్‌ కోచింగ్‌కు కేంద్రమైన అమీర్‌పేట్‌ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌కు అడ్డాగా మారడమే దీని క్రేజ్‌కు అద్దంపడుతోంది. అమెరికాలో గానీ.. ఇక్కడ గానీ.. సాఫ్ట్‌వేర్‌ ఓ పదేళ్లు నడిచింది. జనం డబ్బులు నీళ్లలా ఖర్చు చేశారు. కొద్దిమంది తెలివైన వాళ్లు డబ్బులు దాచుకున్నారు. కానీ ఇంతలోనే వారికి తత్వం బోధపడింది. సాప్ట్‌వేర్‌ను ఓ సునామీ ముంచెత్తింది. అమెరికాలో లేమండ్స్‌ బ్రదర్స్‌ దెబ్బకి అక్కడి బ్యాంకింగ్‌ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. దీంతో అక్కడి బ్యాంకులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు భారత్‌కి తమ ఔట్స్‌సోర్స్‌ సేవల్ని పూర్తిగా నిలిపివేశాయి.

అంతే.. ఇండియాలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఆర్డర్లు ఆగిపోయాయి. ఆ దెబ్బకి కంపెనీలన్నీ కాస్ట్‌ కట్టింగ్‌ మెథడ్‌ని ఫాలో అయ్యాయి. అప్పటివరకు విదేశీ కంపెనీల నుంచి లక్షల్లో తీసుకుని తమ ఉద్యోగులకి వేలల్లో ఇచ్చే కంపెనీలు ఒక్కసారిగా తమకు బిజినెస్‌ రాకపోయే సరికి ఉద్యోగుల్ని ఒక్కొరిని తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటివరకు లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సాఫ్ట్‌వేర్‌ బాబులకు కొత్తగా పింక్‌స్లిప్‌లు అలవాటయ్యాయి. అప్పటివరకు కంపెనీకి రాకపోయినా పట్టించుకోని హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా తీసేయడం మొదలు పెట్టేశాయి. దీంతో ఒక్కసారిగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో గుబులు మొదలైం ది. పింక్‌స్లిప్‌లతోపాటు, అప్పటివరకు లేని ఆర్థిక అభద్రత కొత్తగా పరిచయమైంది. 2007 లో వచ్చిన మాంద్యం ఐటీపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారి లైఫ్‌ మారిపోయే సరికి జీవితం విలువేంటో తెలిపొచ్చింది.

భరించలేని ఒత్తిడి..
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల లైఫ్‌ ఎంత హ్యాపీగా ఉంటుందని తెలిపేందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉండే హంగులు, ఎంప్లాయీస్‌ ఆర్భాటాలు, ఐదు రోజుల పని ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఆఫీస్‌లో వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు ఎవరికీ తెలియవు. తెల్లారితే చాలు ఒత్తిడికి ఎంత నలిగిపోతారో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. 5రోజుల్లో ఎన్ని టార్గె ట్లు ఉంటాయో వారికే తెలుసు. కళ్ల ముందు కనిపించే టార్గెట్లు, ముంచుకొచ్చే డెడ్‌లైన్‌లు, భయపెట్టే పింక్‌స్లిప్‌లు ఇలా ఒత్తిళ్ల వలయం లో సమస్యల అరణ్యంలో పనిచేస్తున్నామని పలువురు ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. 

సేవింగ్స్‌పై దృష్టి పెట్టడం అవసరం: శివ, ఇన్ఫోసిస్‌ ఉద్యోగి  
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు జీతాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ప్లేఆఫ్స్‌ వల్ల ఉద్యోగాలకు భద్రత కష్టతరమైంది. ఈ మధ్య కాలంలో దుబారా తక్కువగా ఉండే ఎంజాయ్‌మెంట్స్‌కి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌
అధిక ప్రాధాన్యతఇస్తున్నారు.  

ఒకప్పటి వైభవం లేదు..
ఒకప్పుడు ఉన్న సాఫ్ట్‌వేర్‌ వైభవం ఇప్పుడు లేదనే చెప్పాలి. కొత్త ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక్కో కాలేజీ నుంచి వందల నుంచి తీసుకునే కంపెనీలు పది మందికి మించి తీసుకోవడం లేదు. కొత్త ఉద్యోగం అటుంచితే ఉన్న ఉద్యోగాలు పీకేయడం మొదలైంది. 2015 మార్చిలో ఒక దిగ్గజ సంస్థ 35 వేల మందిని ఒకేసారి తొలగించింది. ఎప్పుడు పింక్‌స్లిప్‌ వస్తుందో తెలియక నిత్యం భయంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ లైఫ్‌ వేరు, ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు. ఉద్యోగం పోయినా బ్యాంకు బాలెన్స్‌ లేకపోవడం, ఈఎంఐలు కూడా భారీగా మిగిలిపోయాయి.

మాంద్యం దెబ్బకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తమ కార్లను కూడా తిరిగి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు నష్టానికే తాము కొన్న ఫ్లాట్లను లోన్లు ఇచ్చిన బ్యాంకులకే అప్పగించాల్సి వచ్చింది. దీంతో అప్పటివరకు చేసిన తప్పుల్ని ఒక్కసారి బేరీజు వేసుకన్నారు. క్రెడిట్‌ కార్డుల్ని బలవంతంగా వదిలించుకోవడం, వీకెండ్‌ పార్టీలకు వెళ్లడం మానేసి వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ వీకెండ్‌లో ఎలా ఎంజాయ్‌ చేయాలా అని ఆలోచించేవాళ్లు ఇప్పుడు ఈ వీకెండ్‌లోగా ఉన్న ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 


ఇడ్లీ బండి దగ్గరే టిఫిన్లు
గతంలో కిటకిటలాడిన హోటళ్లు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. అక్కడికి వెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోడ్డుపక్కన ఇడ్లీ బండ్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. నెలంతా చేసే ఖర్చులు తగ్గించారు. చిట్లు కట్టుకుంటూ పొదుపు మంత్రాలు జపిస్తున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా కార్లు వాడిన వారు నడకకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసులో ఇష్టానుసారం వర్క్‌ చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి వర్క్‌ చేస్తున్నారు. ప్రమోషన్‌ కోసం, కెరీర్‌లో ఎదగడం కోసం పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇలా ఒకప్పటి ఉద్యోగులకు ఇప్పటి సాఫ్ట్‌వేర్‌ జీవితాలకు ఎంతో తేడా కనిపిస్తుంది.  
– సందీప్, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement