ముంబై: మూన్‌లైటింగ్ (రెండో చోట్ల ఉద్యోగాలు చేయడం)పై వివాదం నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇది అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నారు. వాల్యువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో దాదాపు 81 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం మూన్‌లైటింగ్‌కు ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు.
సర్వేలో పాల్గొన్న ప్రతి అయిదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే (19 శాతం) మూన్‌లైటింగ్ వైపు మొగ్గు చూపగా మిగతా వారు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 1,281 సంస్థలు, 1,533 మంది ఉద్యోగార్థులు .. ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం మూన్‌లైటింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది (37 శాతం) .. అకస్మాత్తుగా ప్రధాన ఉద్యోగం పోయినా ఆదాయం దెబ్బతినకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు.
మరికొందరు (27 శాతం) కొంత అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కంపెనీల అభిప్రాయం మాత్రం మరో రకంగా ఉంది. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లుగా నివేదిక పేర్కొంది.
క్వైట్ క్విటింగ్ సమస్య..
ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ (క్రమంగా నిష్క్రమించడం) సమస్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగాన్ని అట్టే పెట్టుకునేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్‌గా ఉండటం వంటి కారణాలు ఎక్కువగా ఉంటున్నట్లు 33 శాతం కంపెనీలు తెలిపాయి.
21 శాతం కంపెనీలు.. ఉద్యోగం పట్ల నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని అభిప్రాయపడ్డాయి. ఉద్యోగుల కోణంలో చూస్తే 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్‌కు కారణమని తెలిపారు. మేనేజర్లు, బాస్‌ల నుండి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు.
చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!
Comments
Please login to add a commentAdd a comment