సాక్షి కడప : ప్రతి మనిషికి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ ఎంతమందికి సమకూరుతున్నాయి. ప్రజలకు సంబంధించి సౌకర్యాల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమిటి? ప్రభుత్వాలు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయా? లేదా ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? అంగవైకల్యానికి సంబంధించి బాధితులెందరు? ఇతర అనేక సమస్యలకు జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సంస్థ ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రతి ఏడాది అనేక అంశాలపై సర్వే చేస్తున్న కేంద్రం పరిధిలోని నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయ సిబ్బంది జులై నుంచి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంగవైకల్యం, స్వచ్ఛబారత్ లాంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకుంటున్నారు.
ప్రాధాన్యత అంశాలపై సర్వే
ఈ ఏడాది జులైలో మొదలైన సర్వే డిసెంబరు వరకు తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యం, అంగవైకల్యం తదితర ప్రాధాన్యత అంశాలపై కొనసాగుతుంది. ప్రజలు వ్యాధుల బారిన పడటం.. శిశు మరణాలు కూడా అధికంగా ఉండటాని కి కారణం సురక్షితం కాని తాగునీటి వినియోగం, బహిరంగ మల విసర్జన, మురుగు నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడమేనని చెప్పవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం ప్రక్షాళన చేపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. అయితే ఇవి ఎంతమాత్రం గ్రామీణ, పట్టణ స్థాయిలో అమలవుతున్నాయో తెలుసుకోవడంతోపాటు ఇతర కారణాలను కూడా సేకరిస్తున్నారు.
అంగవైకల్యంపై వివరాల సేకరణ
ఆధునిక సమాజంలో అంగవైకల్యం గల వారు సామాజికంగా, ఆర్థికంగా అసమానతలకు గురవుతున్నారు. పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తున్నారు. అయితే కుంటి, గుడ్డి, శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యత, అటిజం తదితర మానసిక వైకల్యం రావడానికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా అంగవైకల్యం గల వారికి పునరావాసం కల్పించే విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు.
స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులపై
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు తీరు తెన్నులపై జిల్లాలో సర్వే సాగుతోంది. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులతోపాటు వాటి ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అనుగుణంగా నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం 76వ విడత సర్వేలో భాగంగా అనేక కీలక అంశాలను సేకరిస్తోంది స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన మరుగుదొడ్లతోపాటు బహిరంగ మల విసర్జన, స్థానిక పరిస్థితులు, వనరులపై క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.
నిష్ణాణుతులైన సిబ్బందితో సర్వే
నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం సుశిక్షితులైన క్షేత్రస్థాయి సిబ్బందిని ఎంపిక చేసుకుని సర్వే చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10 గ్రామీణ ప్రాంతాలతోపాటు ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో బ్లాక్‌లలో తిరుగుతూ వివరాలు సేకరిస్తారు. సంబంధిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను కలిసినా....వాటిలో లెక్కవేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి సంబంధిత షెడ్యూల్‌లలో నింపుతారు. ఇందుకోసం దాదాపు 10 మంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఆరుగురు సూపర్‌వైజర్లు, 175 శ్యాంపిళ్లను సేకరించనున్నారు. సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.
సర్వేతో ఎన్నో ప్రయోజనాలు
ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరు నెలల్లో సర్వేను పూర్తి చేసి సంబంధిత ఉన్నత కార్యాలయాలకు నివేదికలు పంపిస్తారు. దాని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. సర్వే ఆధారంగా అక్కడి పరిస్థితులను అంచనా వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది.
ప్రజలు సహకరించాలి
సరైన సమాచారం లేకుండా ఏ విషయంపైనైనా విధాన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ సర్వే విజయం, లక్ష్యసాధన ప్రజలు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. అసంపూర్తి, అసత్య సమాచారాన్ని అందించడం వల్ల ప్రణాళిక రూపకల్పన దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ప్రజలంతా ఈ సర్వే ప్రాముఖ్యతను గుర్తించి తమ వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు, కచ్చితమైన సమాచారాన్ని అందించి విజయవంతం చేయాలి. – మనోహర్, డైరెక్టర్, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే
Comments
Please login to add a commentAdd a comment