National Sample Survey Organization
-
ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే!
తెలుగింటి పాకశాలల్లో గతంలో రాజ్యమేలిన గోంగూర, ఆవకాయ ఇప్పుడు సైడ్ అయిపోయాయి. ‘తాజాకూరలలో రాజా ఎవరండీ.. వంకాయేనండీ..’అంటూ పాడుకున్న కూరగాయలేవీ తెలుగువారి పంటికి రుచించడం లేదు. ఇంటా బయటా, విందు వినోదం ఏదైనా సరే.. ముక్క లేనిదే ముద్ద దిగేదేలే.. అన్నట్టుగా మారిపోయింది. మాటామంతీ జరగాలంటే మటన్.. చీటికీమాటికీ చికెన్.. ఫుల్లు జోష్‌లో ఫిష్.. వెరైటీగా కావాలంటే ప్రాన్స్, బర్డ్స్.. ఎన్ని రకాల మాంసం ఉంటే అంత సరదా. సండే లేదు మండే లేదు.. అన్నీ నాన్‌వెజ్‌డేలే అయిపోయాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. ఇందులోనూ తెలంగాణ టాప్‌లో, ఏపీ మూడో స్థానంలో ఉండటం విశేషం. గొర్రెలు, మేక మాంసం వృద్ధిలో తెలంగా ణ.. చేపలు, రొయ్యల ఉత్పత్తితో ఏపీ ముందంజ లో ఉంది. ఇంకోవైపు చికెన్, గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి కూడా తెలుగు రాష్ట్రాలే. దమ్ బి ర్యానీ, పాయ, తలకాయ, కీమా, నాటు కోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, ఎండు చేపల వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే జిహ్వకో రుచి అన్నట్టుగా మాంసం వంటకాల జాబితా చాంతాడును మించి ఉంటోంది. ఫంక్షన్లలో అయితే ఎన్నో వెరైటీల డిష్‌లను వడ్డిస్తుండటం కనిపిస్తోంది. దేశంలో తెలంగాణనే టాప్ మాంసాహార వినియోగంలో దేశంలో తెలంగాణదే హవా. తినడమే కాదు ఉత్పత్తిలోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఉత్పత్తి పెరుగుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో ధరలూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో మాంసం ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు గత నలభై ఏళ్లకాలంలో మాంసం ధరలు 30రెట్లు పెరగడం గమనార్హం. జాతీయ వార్షిక తలసరి మాంసం వినియోగం 5.4 కేజీలుకాగా.. అదే తెలంగాణలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 21.17 కిలోల మాంసం వినియోగిస్తున్నారు. గతంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 700–800 లారీల గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యేవని.. రాష్ట్రంలో గొర్రెలు/మేకల సంఖ్య పెరగడంతో దిగుమతి చేసుకునే లారీల సంఖ్య 100 వరకు తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఇలా.. గ్రామీణ భారతీయుల్లో 6.4% మంది మటన్, 21.7 % మంది చికెన్, 26.5 % మంది చేపలు, 29.2% మంది గుడ్లు తింటున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21% మంది మటన్, 21% మంది చేపలు, 27% చికెన్, 37.6% మంది గుడ్లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం పురుషు లు, 76.6 శాతం మహిళలు శాకాహారులే. ఇక హరియాణాలో 68.5శాతం పురుషులు, 70 శాతం మ హిళలు.. పంజాబ్‌లో 65.5శాతం పురుషులు.. 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతుండటం విశేషం. రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం ‘‘2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తిలో విప్లవాత్మక మా ర్పులు వచ్చాయి. దీనికి ముందు రాష్ట్రంలో మటన్ ఉత్పత్తి 5.4 లక్షల టన్నులుగా ఉంటే, ప్ర స్తుతం 10.04 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. 2014– 15లో సాలీనా తల సరి మాంసం లభ్యత 12.95 కేజీలుకాగా అదిప్పుడు 22.70 కేజీలకు చేరింది. గొర్రెల పెంపకానికి ఇ ప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. తద్వారా రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం. – దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ -
లెక్క తేలుస్తున్నారు..!
సాక్షి కడప : ప్రతి మనిషికి కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ ఎంతమందికి సమకూరుతున్నాయి. ప్రజలకు సంబంధించి సౌకర్యాల విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమిటి? ప్రభుత్వాలు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయా? లేదా ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? అంగవైకల్యానికి సంబంధించి బాధితులెందరు? ఇతర అనేక సమస్యలకు జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) సంస్థ ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రతి ఏడాది అనేక అంశాలపై సర్వే చేస్తున్న కేంద్రం పరిధిలోని నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయ సిబ్బంది జులై నుంచి జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంగవైకల్యం, స్వచ్ఛబారత్ లాంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకుంటున్నారు. ప్రాధాన్యత అంశాలపై సర్వే ఈ ఏడాది జులైలో మొదలైన సర్వే డిసెంబరు వరకు తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యం, అంగవైకల్యం తదితర ప్రాధాన్యత అంశాలపై కొనసాగుతుంది. ప్రజలు వ్యాధుల బారిన పడటం.. శిశు మరణాలు కూడా అధికంగా ఉండటాని కి కారణం సురక్షితం కాని తాగునీటి వినియోగం, బహిరంగ మల విసర్జన, మురుగు నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోవడమేనని చెప్పవచ్చు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం ప్రక్షాళన చేపట్టడం ప్రభుత్వాల కర్తవ్యం. అయితే ఇవి ఎంతమాత్రం గ్రామీణ, పట్టణ స్థాయిలో అమలవుతున్నాయో తెలుసుకోవడంతోపాటు ఇతర కారణాలను కూడా సేకరిస్తున్నారు. అంగవైకల్యంపై వివరాల సేకరణ ఆధునిక సమాజంలో అంగవైకల్యం గల వారు సామాజికంగా, ఆర్థికంగా అసమానతలకు గురవుతున్నారు. పలు సంక్షేమ పథకాలు వారి కోసం అమలు చేస్తున్నారు. అయితే కుంటి, గుడ్డి, శారీరక వైకల్యం, బుద్ధి మాంద్యత, అటిజం తదితర మానసిక వైకల్యం రావడానికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా అంగవైకల్యం గల వారికి పునరావాసం కల్పించే విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న అవకాశాల వివరాలను సర్వేలో సేకరిస్తున్నారు. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు తీరు తెన్నులపై జిల్లాలో సర్వే సాగుతోంది. స్వచ్ఛభారత్ అమలు తీరు తెన్నులతోపాటు వాటి ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అనుగుణంగా నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం 76వ విడత సర్వేలో భాగంగా అనేక కీలక అంశాలను సేకరిస్తోంది స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన మరుగుదొడ్లతోపాటు బహిరంగ మల విసర్జన, స్థానిక పరిస్థితులు, వనరులపై క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. నిష్ణాణుతులైన సిబ్బందితో సర్వే నేషనల్ శ్యాంపిల్ సర్వే కార్యాలయం సుశిక్షితులైన క్షేత్రస్థాయి సిబ్బందిని ఎంపిక చేసుకుని సర్వే చేస్తున్నారు. జిల్లాలో సుమారు 10 గ్రామీణ ప్రాంతాలతోపాటు ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో బ్లాక్‌లలో తిరుగుతూ వివరాలు సేకరిస్తారు. సంబంధిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను కలిసినా....వాటిలో లెక్కవేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి సంబంధిత షెడ్యూల్లలో నింపుతారు. ఇందుకోసం దాదాపు 10 మంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఆరుగురు సూపర్వైజర్లు, 175 శ్యాంపిళ్లను సేకరించనున్నారు. సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సర్వేతో ఎన్నో ప్రయోజనాలు ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరు నెలల్లో సర్వేను పూర్తి చేసి సంబంధిత ఉన్నత కార్యాలయాలకు నివేదికలు పంపిస్తారు. దాని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. సర్వే ఆధారంగా అక్కడి పరిస్థితులను అంచనా వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. ప్రజలు సహకరించాలి సరైన సమాచారం లేకుండా ఏ విషయంపైనైనా విధాన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ సర్వే విజయం, లక్ష్యసాధన ప్రజలు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. అసంపూర్తి, అసత్య సమాచారాన్ని అందించడం వల్ల ప్రణాళిక రూపకల్పన దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ప్రజలంతా ఈ సర్వే ప్రాముఖ్యతను గుర్తించి తమ వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు, కచ్చితమైన సమాచారాన్ని అందించి విజయవంతం చేయాలి. – మనోహర్, డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ఓ సర్వే -
రైతు ఆదాయం నెలకు ఆరువేలే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒక రైతు కుటుంబం అన్ని వనరుల నుంచి పొందే ఆదాయం సగటున నెలకు కేవలం రూ.6,426 మాత్రమేనని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. దేశంలోని రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణాంకాలను జాతీయ శాంపిల్ సర్వే 2013లో సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఆ సర్వే దేశంలోని ఒక రైతు కుటుంబం పొందే నెలసరి ఆదాయం సగటున 6426 రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిపారు. 2018-19 ఏడాదికి రైతు కుటుంబాల వార్షిక ఆదాయాల గణన నేషనల్ శాంపిల్ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం 2018 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్‌తో ఖర్చుల్లో తగ్గుదల.. సాగు వ్యయంలో మైక్రో ఇరిగేషన్ ద్వారా 20 నుంచి 50 శాతం ఖర్చులు తగ్గించుకోవచ్చునని గజేంద్ర సింగ్ వెల్లడించారు. ఎరువుల ఖర్చులో 28 శాతం ఆదా చేయవచ్చునని తెలిపారు. విద్యుత్ వాడకాన్ని 31 శాతం తగ్గించుకునే అవకాశం మైక్రో ఇరిగేషన్ కల్పిస్తుందన్నారు. ఈ విధానంలో పంట ఉత్పాతకత 42 నుంచి 52 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైందని మంత్రి అన్నారు. తద్వారా రైతు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘బీఫ్’ వినియోగం పెరుగుతోంది!
న్యూఢిల్లీ: దేశంలో బీఫ్ వినియోగం పెరుగుతోంది. గోవధ నిషేధంపై వివాదం రేగుతున్న సమయంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్ఓ) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా బీఫ్ వినియోగం పెరుగుతున్నట్లు తేలింది. 2010- 2012 మధ్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.9% నుంచి 4 శాతానికి.. పట్టణ ప్రాంతాల్లో 4.3% నుంచి 5 శాతానికి పెరిగిందని ఎన్ఎస్ఎస్ఓ పేర్కొంది. దేశంలో దాదాపు 8 కోట్లమంది బీఫ్‌ను ఆహారంగా తీసుకుంటారని తెలిపింది. ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బీఫ్‌తో పాటు పాలు, గుడ్లు, చికెన్.. తదితర ఆహార పదార్ధాల వినియోగం పెరుగుతోంది. వీటి స్థాయిలో పప్పు దినుసుల వినియోగం పెరగకపోవడం విశేషం. అధిక ధరల కారణంగా చేపలు, రొయ్యలు, మటన్(గొర్రె, మేక మాంసం) తదితరాల వినియోగం క్రమంగా తగ్గుతోంది. చేపలు, రొయ్యల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 30.7% నుంచి 26.5 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 27.1% నుంచి 21 శాతానికి తగ్గింది. 2004 తరువాతే ఎన్ఎస్ఎస్ఓ మటన్, బీఫ్‌ల వినియోగాన్ని వేరువేరుగా లెక్కిస్తోంది.