లంకమల అభయారణ్యంలోని సాసర్‌పిట్‌లో చుక్కనీరు లేని దృశ్యం నీటి కోసం జనావాసాల్లోకి వచ్చి మృత్యువాతపడిన చిరుత (ఫైల్)
ఆకలేసినా, దప్పికేసినా చెప్పుకోలేని మూగజీవాలు అడవుల్లో విలవిలలాడిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అడవుల్లో చుక్కనీరు దొరక్క మూగజీవాల గొంతెండుతోంది. చర్యలు తీసుకోవాల్సినఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కి, వాహనాలుఢీకొని మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసంవిడుదలవుతున్న నిధులు ఏమవుతున్నాయో అంతుపట్టడం లేదు.
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గంలో లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యం, నల్లమల అభయారణ్యాలు విస్తరించి ఉన్నాయి. సుమారు 30 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో వివిధ రకాల జంతుజాలం నివసిస్తోంది. వీటిలో అత్యంత అరుదైన కలివికోడి, పెద్దపులి, హనీబ్యాడ్జెర్ వంటి జంతువులు కూడా ఉన్నాయి. వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఆయా అడవుల్లోని జంతువులను సంరక్షించేందుకు ఏటా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఆ నిధులతో అడవుల్లో సాసర్‌పిట్లు ఏర్పాటు చేసి అందులో నీటిని నింపడం, అడవుల చుట్టూ వన్యప్రాణులు బయటికి రాకుండా కందకాలు తవ్వించడం వంటి పనులు చేపట్టాలి. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడం, అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చర్యలు చేపట్టడం లేదు.
జనావాసాల్లోకి ..
అడవుల్లో వన్యప్రాణులకు నీరు అందించేందుకు గాను లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలలో సుమారు 65కు పైగా సాసర్‌పిట్లు ఏర్పాటు చేశారు. అయితే సాసర్‌పిట్లలో నీటిని నింపి జంతువుల దాహార్తిని తీర్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చేసేది లేక నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని చనిపోవడం, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మరణించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. బద్వేలు రేంజ్ పరిధిలోని జంగంరాజుపల్లె బీటులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ వెనుకజల్లాల్లో ఉన్న ముత్తూటిసెల అటవీ ప్రాంతాల్లో నీటి కోసం వస్తున్న వన్యప్రాణులను నీటిలో విషపు గుళికలు కలిపి వేటాడుతున్నారు. అంతేకాకుండా జిల్లా సరిహద్దులోని గోపవరం మండల సమీపంలో, అట్లూరు మండల సమీపంలో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఉచ్చులు వేసి వన్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో అట్లూరు మండల పరిధిలో సుమారు నాలుగైదు పొడదుప్పిలు మృత్యువాతపడ్డాయి. అలాగే కాశినాయన మండలంలోని వరికుంట్ల గ్రామసమీపంలో తాగునీటి కోసం జనసంచారంలోకి వచ్చిన రెండు చిరుతలు విద్యుత్‌షాక్‌కు గురై మరణించాయి. ఇలా చెప్పుకుంటూపోతే నిత్యం ఎక్కడో ఒక చోట వన్యప్రాణులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం
వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. అడవుల్లోని సాసర్‌పిట్లలో తక్షణమే నీరందించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే వన్యప్రాణుల వేటగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం. – గురుప్రభాకర్, ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment