వైరా: సాయంత్రం వేళల్లో వేడివేడి గప్‌చుప్, పానీపూరి తింటుంటే ఆహా..భలే రుచి అనుకుంటారు. అయితే..తయారీలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీటిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే..పరిశుభ్రంగా ఉన్న బండ్ల వద్దనే తినాలని పెద్దలు, వైద్యులు సూచిస్తున్నారు. పూరిని బొటనవేలుతో నొక్కి..అందులో ద్రావణాన్ని నింపుతాడు.
గోరులో మట్టి రేణువులు ఉంటే..అవి అందులో కలిసే అవకాశముంది. కుండకు కట్టే ఎర్రటి వస్త్రాన్ని ఉతకడంపై అనేక అనుమానాలు ఉంటాయి. నీటిని వేడి చేయని కారణంగా సూక్ష్మజీవులు చనిపోవు. ఈ–కొలై అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు అంటున్నారు. పానీ, పూరిలను తయారు చేసే ప్రాంతాలపై పట్టింపు లేదు. అధికారుల తనిఖీలు ఉండవు
రోడ్ల పక్కన అమ్ముతున్నప్పుడు దుమ్ముధూళి ఎగసిపడుతున్నా..అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటివి తింటే..వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. చింతపండు పులుసు (పానీ) తయారీకి ఉప్పు, జీరావన్ (మధ్యప్రదేశ్‌కు చెందిన మసాలా), పుదీనా, నల్ల మిరియాల పొడి ఇలా అనే రకాలు కలుపుతారు. అయితే..పరిశుభ్రమైన నీటిని వాడరనే అపవాదు ఉంది. సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెద్దలు అంటున్నారు.
నిల్వ ఉంటే బ్యాక్టీరియానే..
పానీలో రాజస్థాన్‌కు చెందిన మసాలాలు కలుపుతారు. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. చిన్న పిల్లలకు జీర్ణం కావు. వేడి చేయకుండా నిల్వ ఉండే పులుసులో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పటికప్పుడు తయారు చేసింది కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. ఎక్కువ తీసుకోవద్దు. కడుపులో అల్సర్, గ్యాస్ సమస్యలున్న వారు దీని జోలికి వెళ్లకపోవడం మంచిది. – డాక్టర్ ఖలీముద్దీన్, ప్రభుత్వ వైద్యుడు , వైరా
Comments
Please login to add a commentAdd a comment