Dirty water
-
జర భద్రం లేకుంటే పానీపూరితో పరేషానే
వైరా: సాయంత్రం వేళల్లో వేడివేడి గప్‌చుప్, పానీపూరి తింటుంటే ఆహా..భలే రుచి అనుకుంటారు. అయితే..తయారీలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, కలుషిత నీటిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే..పరిశుభ్రంగా ఉన్న బండ్ల వద్దనే తినాలని పెద్దలు, వైద్యులు సూచిస్తున్నారు. పూరిని బొటనవేలుతో నొక్కి..అందులో ద్రావణాన్ని నింపుతాడు. గోరులో మట్టి రేణువులు ఉంటే..అవి అందులో కలిసే అవకాశముంది. కుండకు కట్టే ఎర్రటి వస్త్రాన్ని ఉతకడంపై అనేక అనుమానాలు ఉంటాయి. నీటిని వేడి చేయని కారణంగా సూక్ష్మజీవులు చనిపోవు. ఈ–కొలై అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు అంటున్నారు. పానీ, పూరిలను తయారు చేసే ప్రాంతాలపై పట్టింపు లేదు. అధికారుల తనిఖీలు ఉండవు రోడ్ల పక్కన అమ్ముతున్నప్పుడు దుమ్ముధూళి ఎగసిపడుతున్నా..అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటివి తింటే..వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. చింతపండు పులుసు (పానీ) తయారీకి ఉప్పు, జీరావన్ (మధ్యప్రదేశ్‌కు చెందిన మసాలా), పుదీనా, నల్ల మిరియాల పొడి ఇలా అనే రకాలు కలుపుతారు. అయితే..పరిశుభ్రమైన నీటిని వాడరనే అపవాదు ఉంది. సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తే..ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెద్దలు అంటున్నారు. నిల్వ ఉంటే బ్యాక్టీరియానే.. పానీలో రాజస్థాన్‌కు చెందిన మసాలాలు కలుపుతారు. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. చిన్న పిల్లలకు జీర్ణం కావు. వేడి చేయకుండా నిల్వ ఉండే పులుసులో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అప్పటికప్పుడు తయారు చేసింది కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. ఎక్కువ తీసుకోవద్దు. కడుపులో అల్సర్, గ్యాస్ సమస్యలున్న వారు దీని జోలికి వెళ్లకపోవడం మంచిది. – డాక్టర్ ఖలీముద్దీన్, ప్రభుత్వ వైద్యుడు , వైరా -
అరుణాచల్ ‘నది’లో చైనా బురద!
(సాక్షి నాలెడ్జ్ సెంటర్): అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి జీవనరేఖగా పేరుగాంచిన సియాంగ్ నదీ జలాలు గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో కలుషితమౌతున్నాయి. చైనాలో అంతర్భా గమైన టిబెట్‌లో ఈ నది పేరు యార్లుంగ్ త్సాంగ్పో. అక్కడ 1,600 కిలో మీటర్లు ప్రయాణించి ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దిబాంగ్ పేరుతో 250 కిలోమీటర్లు ప్రవహించాక లోహిత్ అనే మరో నదితో కలసి పెద్ద నదిగా మారుతుంది. ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సియాంగ్ నుంచి నీటిని టిబెట్‌లోనే మళ్లించి షిన్జియాంగ్ ప్రావిన్స్ మీదుగా తక్లామకాన్ ఎడారికి తరలించేందుకు చైనా యత్నిస్తోంది. ఇందుకోసం వేయి కిలో మీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తోందని సమాచారం. టిబెట్‌లో సొరంగ నిర్మాణం కోసం చైనా రాళ్లు పగులగొట్టడం, సిమెంటు వాడకం కారణంగా సియాంగ్ జలాలు కలుషితమై రంగు మారిపోతున్నాయని నెలన్నర క్రితమే వార్తలొచ్చాయి. అయితే చైనా మాత్రం తాము సొరంగం నిర్మించ డమే లేదని వాదిస్తోంది. నదిలో మురికి నీరు ప్రవహించడానికి కారణమేంటో తమకు అంతుచిక్కడం లేదనీ, అరుణాచల్ ఉత్తర ప్రాంతానికి ప్రాణప్రదమైన సియాంగ్లో మళ్లీ నీరు సహజ రంగులో ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అరుణాచల్ తూర్పు లోక్‌సభ సభ్యుడు నినాంగ్ ఇరింగ్(కాంగ్రెస్) ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. తమ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ నదిలో కలుషిత నీరు ప్రవహించడం వల్ల ప్రజలకు, పర్యావర ణానికి తీవ్రనష్టం జరుగుతోందనీ, ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి ఓ అంతార్జాతీయ బృందాన్ని రప్పించాలని ఇరింగ్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా నీతి ఆయోగ్ గతంలో ప్రతిపాదించింది. దోషి చైనాయే: ఉప కమిషనర్ రెండు నెలలుగా సియాంగ్ నది నీరు బాగా కలుషితమైందనీ, కాలుష్యం స్థాయి సాధా రణం కన్నా వందల రెట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర జలసంఘం పరీక్షలో తేలిందని తూర్పు సియాంగ్ జిల్లా ఉప కమిషనర్ తామ్యో తాతక్ చెప్పారు. ‘ఈ వానాకాలంలో నదిలో నల్లని నీరు ప్రవహించింది. బురదతో నీటి రంగు మారిందనుకున్నాం. నవంబర్ృఫిబ్రవరి కాలంలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నిండా నీళ్లున్నా నదీగర్భం కనిపించేది’ అని ఆయన వివరించారు. టిబెట్‌లో లోతైన బోరింగ్ పని జరుగుతున్న కారణంగానే నీటి రంగు మారిందనీ, అందుకే చైనాను అనుమానిం చాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. నది నీరు రంగు మారడానికి, తమకు సంబంధం లేదని వాదిస్తోంది. -
మురుగంతా రోడ్లపైకే..
- కుప్పలు తీయరు.. మోరీలు క్లీన్ చేయరు.. - సంగారెడ్డి పట్టణంలో వెదజల్లుతున్న దుర్గంధం సంగారెడ్డి మున్సిపాలిటీ: చూసేందుకు రోడ్లున్నా.. మురికి నీరు పోవడానికి కాల్వలున్నా వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే మురుగునీరంతా రోడ్లపైకే వస్తోంది. పట్టణంలోని శాంతినగర్, కల్వకుంట, మార్క్స్‌నగర్, విజయనగర్‌కాలనీ, ఇంద్రాకాలనీలలో మున్సిపల్ సిబ్బంది మురికి కాల్వను శుభ్రం చేశారు. ఇందుకోసం కాల్వలో నుంచి మట్టిని, చెత్తను రోడ్లపై వేసి రోజులు గడుస్తున్నా ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు పందులు సంచరిస్తున్నాయి. మరో వైపు వర్షాలు కురియడంతో మురికి కుప్పలు మురిగి పోయి కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని అయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట చౌరస్తా వద్ద 20 రోజుల క్రితం మురికికాల్వలను శుభ్రం చేశారు. ఇక్కడ డ్రైనెజీలలో నుంచి తీసిన చెత్తను అక్కడే కుప్పలు వేశారు కానీ ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు. గాలొస్తే చాలు చెత్తంతా కొట్టుకొచ్చి ఇండ్లలోకి వస్తోందని అంటున్నారు. గణేష్‌నగర్ లో సైతం మురికి కల్వలు లేకపోవడంతో పందులు సంచరించడం వల్ల కచ్ఛాకాల్వలు నేలమట్టమై మురికి నీరు రోడ్లుపైనే ప్రవహిస్తుంది. ఇంద్రాకాలనీలో సైతం డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కాలనీ లో ఒక్క రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కాల్వలను శుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కొత్తగా సీసీ డ్రైన్లు నిర్మించలేకపోయిన కనీసం కచ్ఛాకాల్వలు ఏర్పాటు చేస్తే నీరు నిలువకుండా ఉంటుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోని పారిశుద్ధ్యంలోపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అయా కాలనీ వాసులు కోరారు. కమిషనర్ వివరణ.. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయని ఇన్చార్జి కమిషనర్ గయాసొద్దీన్‌ను వివరణ కోరగా మురికి కాల్వలలో తీసిన చెత్తను వెంటనే తొలగించేందుకు రాదని అందుకు తీసిన మూడు రోజుల తర్వాత తొలగిస్తారని తెలిపారు. వారం రోజులైనా తమ సిబ్బంది తొలగించకుంటే మాత్రం చర్యలు తీసుకుంటామని తెలిపారు.