సునీత మృతదేహం
ఆమె ఓ విధి వంచిత.. ప్రేమ వివాహం చేసుకుంది.. దీంతో కన్నవారు దగ్గరకు రానీయలేదు.. పుట్టిన పిల్లలిద్దరూ దివ్యాంగులే.. మనస్పర్థలతో భర్త దూరమయ్యాడు.. ఈ సమస్యలకు తోడు వేధిస్తున్న అనారోగ్యం.. మానసికంగా కుంగిపోయింది.. చివరకు కొడుకులిద్దరినీ అనాథలను చేసి బలవన్మరణానికి పాల్పడింది. తినడం కూడా చేతకాని స్థితిలో వైకల్యంతో బాధ పడుతున్న చిన్నారుల బేల చూపులు చూపరులను కంట తడి పెట్టిస్తున్నాయి. కానీ వారిని అక్కున చేర్చుకునేదెవరు? ఈ విషాద ఘటన చీడికాడ మండలం అప్పలరాజుపురంలో జరిగింది.
చీడికాడ (మాడుగుల): అప్పలరాజుపురం విషాదంతో కుమిలిపోయింది. పిల్లల్ని అనాథలను చేసి ఓ తల్లి ఆత్మహత్య అందరినీ కలచివేసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇన్‌చార్జి ఎస్సై హిమగిరి అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన రెడ్డి సునీత (30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి పెదపాటి లక్ష్మి ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు, పెద్దల సమక్షంలో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ప్రేమకు దూరమైన అభాగ్యురాలు
ప్రేమ రాహిత్యమే సునీత మరణానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. సునీత పుట్టింటి వారిది రోలుగుంట మండలం జె.నాయుడు పాలెం గ్రామం. పదేళ్ల క్రితం సునీత, అప్పలరాజుపురానికి చెందిన రెడ్డి గంగరాజులు ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలకు చెందిన వారు కావడంతో సునీత కుటుంబసభ్యులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదురించి సునీత గంగరాజును పెళ్లాడింది. వీరికి భానుతేజ(8), త్రిగుణు(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం గంగరాజు మండలంలోని దిబ్బపాలెం యూపీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు పుట్టాక కూడా సునీత తల్లిదండ్రులు సునీతతో సక్యతగా మెలగలేదు. దీంతో ఒంటరితనం ఆవహించింది. ఇదిలా ఉంటే పెద్ద కుమారుడు భానుతేజ ఆరోగ్యం అంతంత మాత్రం. మానసిక వికలాంగుడు. రెండో కుమారుడు పుట్టుకతోనే ఒక చెవి పూర్తిగా లేకపోవడంతో వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు.
ఈ సమస్యలన్నింటి మధ్య భర్త గంగరాజుతో మనస్పర్ధలు ఏర్పడడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడింది.ç సునీత ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలిపోయారు. వారికి దిక్కెవరు?ఇదిలా ఉంటే చిన్న కుమారుడికి చేతితో తినడం చేతకాకపోవడంతో రోజూ సునీతే తినిపించేదని చుట్టుపక్కల వారు చెబుతూ రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. పిల్లలిద్దిరినీ ఎవరికి అప్పగించాలో చెప్పాలని మృతురాలి తల్లి లక్ష్మీ, సోదరి, కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలముకున్నాయి.∙
Comments
Please login to add a commentAdd a comment