కష్టపడి పెంచిన బిడ్డా.. ఇడిసిపోతివా? | Young Women Commits Suicide In Vemulawada Over Disputes In Family, Details Inside | Sakshi
Sakshi News home page

కష్టపడి పెంచిన బిడ్డా.. ఇడిసిపోతివా?

Published Thu, Jul 4 2024 8:43 AM | Last Updated on Thu, Jul 4 2024 9:21 AM

Young Women suicide in Vemulawada

 చికిత్స పొందుతూ బాలిక మృతి

 ఆస్తి విషయంలో గొడవలతో మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం 

  బండపల్లిలో విషాదం 

చందుర్తి(వేములవాడ): ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఒక్కగానొక్క బిడ్డవని రెక్కల కష్టం చేసి, పెంచి పెద్ద చేసుకుంటిని బిడ్డా.. నన్ను ఇడిసిపెట్టి ఎలా పోవాలనిపించింది బిడ్డా.. ఎవరిని చూసుకొని బతకాలె బిడ్డా అంటూ ఆమె తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.  పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన కుమ్మరి లచ్చయ్యకు భార్య లలిత, కుమారుడు బాబు ఉన్నారు. 

లలిత తల్లిగారింటికి వెళ్లిపోయి, కాపురానికి రాలేదు. తర్వాత లచ్చయ్య లచ్చవ్వను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు శ్రీవాణి(14) జన్మించింది. ఆమె తొమ్మిదోతరగతి చదువుతోంది. లచ్చయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటివరకు ఎలాంటి బాధ లేని ఆ కు టుంబంలో లచ్చయ్య మరణంతో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇంటితోపాటు రెండెకరాల భూమిలో తమ కు వాటా ఉందని అతని మొదటి భార్య కొడుకు బాబు పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో ఆ ఇంటి వెనక స్థలంలో గుడిసె వేసుకోవాలని బాబు చూడగా లచ్చవ్వ అడ్డు చెప్పింది. ఆస్తిలో తనకు హక్కు ఉందని అతను.. తమకు వీలునామా రాశాడని ఆమె గొ డవ పడుతున్నారు. దీంతో శ్రీవాణి మనస్తాపానికి గురైంది. ఈ నెల 1న ఇంట్లోనే దూలానికి ఉరి పెట్టుకుంది. గమనించిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి, ఆమెను కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి చేరిన శ్రీవాణిని ఆటోలో వేములవాడ ఆస్పత్రికి తరలించారు. 

పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. మృతురాలి తల్లి  ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కాగా, శ్రీవాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, రాత్రి స్వగ్రామం తరలించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement