తల్లి ఫిర్దోస్, చిన్నారి హయాన (ఫైల్)
సాక్షి, చెన్నై: వరకట్న వేధింపులు తాళలేక బిడ్డతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని కడకల్ తోపుకు చెందిన లాలూ బాషా కుమార్తె ఫిర్దోస్ (22)కు తిరువణ్ణామలై జిల్లా కిలిపెన్నత్తూరుకు చెందిన అబ్దుల్లా(25)తో గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. తిరువణ్ణామలైలోని ఓ దుకాణంలో అబ్దుల్లా పనిచేస్తున్నాడు. ఫిర్దోస్ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు హయాన అని పేరు పెట్టారు.
ఈ నెల 2వ తేదీ బిడ్డతో కలిసి ఆవూరులోని భర్త ఇంటికి వెళ్లింది. అనంతరం ఈ నెల 17న తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫిర్దోస్, చిన్నారి కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. రాత్రి 10 గంటలకు వ్యవసాయ బావిలో చిన్నారి శవమై తేలడాన్ని ఆ ప్రాంత వాసులు గుర్తించి ఫిర్దోస్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.
సెంజి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శిని, ఇన్‌స్పెక్టర్ తంగం, సబ్ ఇన్‌స్పెక్టర్ శంకర సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా వరకట్నం తేవాలని వేధించేవాడని తెలిసింది. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అబ్దుల్లాని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment