సాక్షి, అల్వాల్: కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలూ అల్పాయుష్షుతోనే కన్నుమూశారు. ప్రస్తుతం జన్మనిచిన కవలలూ అనారోగ్యానికి గురయ్యారు. మేనరికపు పెళ్లి కారణంగానే పిల్లలు ఆయుర్దాయం లేకుండా చనిపోతున్నారని ఆవేదనకు గురైంది ఆ తల్లి.
భవిష్యత్‌లో తాను మాతృమూర్తిగా మనగలిగే పరిస్థితి ఉండదని భావించిన ఆమె పదిరోజుల వయసున్న పసికందులను ఇంటి ఆవరణలోని సంపులో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజీగూడ శివనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్‌రావుకు మేనమామ కూతురు సంధ్యారాణితో 2012లో వివాహమైంది. 5 సంవత్సరాల అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించి అనారోగ్యంతో చనిపోయారు. 2018లో పుట్టిన కొద్ది రోజులకే కూతురు మరణించింది. అనంతరం ఈ నెల 11న ఇద్దరు కవల (మగ, ఆడ) పిల్లలు జన్మించారు. వీరు సైతం అనారోగ్యానికి గురయ్యారు. బాబుని కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
14వ తేదీన ఇంటికి తీసుకువచ్చారు. పుట్టిన పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతూ మృత్యువాత పడుతుండడం.. ఈ ఇద్దరు పసికందులు కూడా దక్కకుండాపోతారేమోనని భావించిన సంధ్యారాణి.. ఆదివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వారిని పడేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంట్లో అర్ధరాత్రి సంధ్యారాణి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ సంపులో వెతకగా సంధ్యారాణి, ఇద్దరు పిల్లల మృతదేహాలు సంపులో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మేనరికపు పెళ్లి వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు రాసి ఉన్న సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’
Comments
Please login to add a commentAdd a comment