సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలను పార్టీలో చేర్చుకునే అంశంపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. టీఆర్‌ఎస్‌కు అనుబంధ సభ్యులుగా కొనసాగేందుకు ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే సుముఖంగా ఉన్నప్పటికీ, ఏకంగా పార్టీలోనే చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జిల్లాలో పార్టీ కీలక నేత జోగు రామన్నకు ఈ బాధ్యతలు అప్పగించిన ట్లు తెలుస్తోంది. ఆయన ఈ ఇద్దరు సభ్యులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, అధినేత కేసీఆర్ మాత్రం కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు పొందిన టీఆర్‌ఎస్ ఈ ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను ఏకంగా పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న పక్షంలో స్థానికంగా అసంతృప్తులను సర్ది చెప్పాలనే యోచ నలో అధినాయకత్వం ఉంది. ఈ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని నియోజకవర్గ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు.
బీఎస్పీ ఎమ్మెల్యేల తర్జనభర్జన
పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగాలా? టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై బీఎస్పీ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీ మారిన పక్షంలో అనర్హత వేటు.. వంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనుబంధ సభ్యులుగా ఉంటూ.. రానున్న రోజుల్లో ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో ఈ ఇద్దరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం మంత్రి పదవి ఆశిస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది.
సర్కారులో బెర్తు దక్కిన పక్షంలో పార్టీలో చేరడం ఖాయమనినే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. వీరు బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ, తమ వ్యక్తిగత చరిష్మాతోనే విజయం సాధించారు. అలాగే కోనప్ప కూడా ప్రాదేశిక ఎన్నికల్లో తమ అనుచరులను బరిలోకి దింపి, నియోజకవర్గంలో రెండు మండలాల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకున్నారు. పార్టీ మారే విషయమై ఈ నేతలను సంప్రదించగా ఇప్పటి వరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ గాలం?
Published Sat, May 31 2014 12:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement