Allola indrakaran Reddy
-
అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఐకేరెడ్డి..
సాక్షి, ఆదిలాబాద్: భక్తులకు కొంగుబంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లిగా.. జిల్లా ప్రజల ఇలవేల్పుగా పేరొందిన అడెల్లి మహా పోచమ్మతల్లి గంగనీళ్లజాతర ఆదివారం ఘనంగా ముగిసింది. అమ్మవారి ఆభరణాలు, గంగాజలంతో దిలావర్పూర్ మండలం సాంగ్వి నుంచి చేపట్టి న శోభాయాత్ర ఆదివారం అడెల్లి ఆలయానికి చేరింది. అమ్మవారికి నగలు అలంకరించిన ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, అనంత రం పవిత్రోత్సవం తదితర పూజలు జరిపించారు. శనివారం రాత్రినుంచే ఆలయానికి భక్తులు రావడంతో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఉమ్మడి ఆదిలా బాద్జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, చంద్రాపూర్ జిల్లాలనుంచి, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలనుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం కోనేరులో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దిలావర్పూర్లో జరిగిన అమ్మవారి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్నారు. గంగాజలంతో ఆభరణాల శుద్ధి దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి పరీవాహక ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తజనంతో పులకించింది. అడెల్లి మహాపోచమ్మ ఆభరణాల ఊరేగింపు శోభాయాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి మొదలై దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు రాత్రంతా అమ్మవారి నామస్మరణతో జాగరణలో పాల్గొన్నారు. ఆటపాటలతో అమ్మవారి ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. స్టానిక ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకున్న భక్తులు గంగనీళ్ల జాతరకు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు. గంగనీళ్ల జాతరలో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి కన్నుల పండువగా శోభాయాత్ర సాంగ్వి ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రా రంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగుపయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభా యాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. దిలావర్పూర్ గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీపూలతోరణం)తో స్వాగతం పలకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాటపిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. దారి పొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు. భక్తులకు ప్రత్యేక వసతులు.. అడెల్లి ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ఇన్చార్జి ఈవో, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్‌గౌడ్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సారంగపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో వలంటీర్లు భక్తులకు సేవలందించారు. భారీ పోలీస్ బందోబస్తు! అమ్మవారి ఆభరణాలతో శోభాయాత్ర నిర్వహించగా దారివెంట నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, సారంగపూర్ ఎస్సై కృష్ణసాగర్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. దిలావర్పూర్లోనూ నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ సీఐ శ్రీనివాస్, సోన్ సీఐ నవీన్‌కుమార్, దిలావర్పూర్ ఎస్సై యాసిర్ అరాఫత్, సోన్ ఎస్సై రవీందర్, రూరల్ ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్
నిర్మల్: తెలంగాణ అంతటా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలున్నాయని.. భవిష్యత్‌లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో అరుదైన ఘట్టం.. జిల్లా వైద్యరంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్‌గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ చేతుల మీదుగానే నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలు.. జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. సంతోషంగా ఉంది.. మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్, నిర్మల్ అమ్మ కల నిజం చేస్తా.. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్.భానుతేజ, నిర్మల్ నేను చదువుకోలేకపోయినా.. నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్ కావాలన్నదే నా కోరిక. – విజయ్‌కుమార్, ఆదిలాబాద్, విద్యార్థి తండ్రి మంచి డాక్టర్‌గా ఎదుగుతా.. ఎంతో కష్టపడితేనే నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్‌గా ఎదుగుతా. – సమ్మిత్, ఆదిలాబాద్ సైకియాట్రిస్ట్‌ను అవుతా.. తెలంగాణలో మెడికల్ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్‌ను అవుతా. డాక్టర్ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్ చాలా దగ్గరగా ఉంది.. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనుకుంటున్నాను. – మహిన్, ఆర్మూర్ అక్కలాగే కావాలని.. మా అక్కయ్య వికారాబాద్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్, భైంసా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, నాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి, పాకాల రాంచందర్, అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
మళ్లీ కడెం టెన్షన్.. మంత్రి మొక్కు
సాక్షి, నిర్మల్: కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టించింది. నాలుగు గేట్లు తెరుచుకోకుండా మొరాయించడంతో.. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని పర్యక్షించారు. కాసేపటికి వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. కడెం ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా, నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయించాయి. జర్మన్ క్రస్ట్ గేట్లపై నుంచి వరదనీరు పారింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు ఇక కడెం ప్రాజెక్ట్ కు చేరుకోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ క్రమంలో అంతా వరదకు భయపడి ఒకసారి వెనక్కి వెళ్లారు. అయితే.. వరద తగ్గితే కట్ట మైసమ్మ మొక్కు చెల్లించుకుంటానంటూ కడెం వద్ద మొక్కుకున్నారు మంత్రి. ఆపై కాసేపటికే కడెం వరద తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కడెం సామర్థ్యం : 8.227/7.60 TMC. ఇన్ ఫ్లో 230138 c/s అవుట్ ఫ్లో 236032c/s 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #kadam #TelanganaRains #nirmal @balaji25_t pic.twitter.com/VyQNwVXQeb — Shaik Adnan Ahmed شیخ عدنان احمد (@skadnan05) July 27, 2023 #kadam #TelanganaRains #nirmal @balaji25_t pic.twitter.com/VyQNwVXQeb — Shaik Adnan Ahmed شیخ عدنان احمد (@skadnan05) July 27, 2023 -
Indrakaran Reddy: అమాత్యుడి మాటల్లో ఆంతర్యం ఏమిటో!
సాక్షి, నిర్మల్: ‘ఇంత వయ సొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టం లేదు. భవిష్యత్తులో ఎవరైన వచ్చి నిల్చున్నా అభ్యంతరం లేదు’అంటూ బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పనితీరు, పథకాల గురించి చెబుతూ నిర్మల్ రుణం తీర్చుకునేందుకు ఎన్నో పనులు చేశామన్నారు. ఈ క్రమంలో ఇంత వయసొచ్చినందున ఇక రాజకీయాలంటే ఇష్టంలేదని, రేపొద్దున ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా స్టేజీపై, సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ‘ఐకేరెడ్డి జిందాబాద్’అంటూ నినాదాలు చేశారు. అందరూ స్టేజీ వద్దకు వెళ్లి మంత్రికి అండగా ఉంటామని చెప్పారు ఈ క్రమంలో కాసేపు ఇంద్రకరణ్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ఇటీవలే సీనియర్లు శ్రీహరి రావు, సత్యనారాయణగౌడ్ అసమ్మతివర్గంగా తయారు కావడం, కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడం, పలువురు కౌన్సిలర్లనూ బీజేపీ టార్గెట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఇలా మాట్లాడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. చదవండి: మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే -
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
గవర్నర్ వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు
నిర్మల్: ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన తర్వాత గవర్నర్ తమిళిసై వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకనుంచి నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం నల్లజెండా ఎగరేసి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉగాది రోజు తాను యాదాద్రికి వస్తున్నానని 20నిమిషాల ముందు ఫోన్ చేసి చెప్పారన్నారు. అంత తక్కువ సమయంలో ఏర్పాట్లెలా చేస్తారని ప్రశ్నించారు. పది గంటల ముందు చెబితే ప్రొటోకాల్ ప్రకారం గౌరవించే వాళ్లమన్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని, ఆమె మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశాక నాటి గవర్నర్ రాంలాల్ ప్రజాగ్రహాన్ని చవిచూసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గవర్నర్‌గా నరసింహన్ రాష్ట్రాన్ని ప్రోత్సహించారని ఇంద్రకరణ్ గుర్తుచేశారు. చదవండి: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. ముదిరిన పంచాయితీ -
18న మేడారానికి సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు. సీఎస్, డీజీపీ దిశానిర్దేశం సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
Telangana Haritha Haram: ఏడో విడత..19.91 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడో విడత హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి పదిరోజుల పాటు 19.91 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈసారి రహదారి వనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీ రోడ్ల వెంట మొక్కలు నాటాలని (మల్టీ అవెన్యూ ప్లాంటేషన్) నిర్ణయించింది. వీలున్న ప్రతిచోటా మియావాకీ మోడల్లో మొక్కలు నాటాలని ఆదేశించింది. హైదరాబాద్ శివార్లలోని అంబర్పేట్ కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ఏడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో ఏడో విడతను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేలా ప్రోత్సహించనున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ పచ్చదనం పెంచేలా చర్యలు చేపడుతున్నామని పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నాటిన మొక్కలన్నీ బతికేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈసారి 230 కోట్ల లక్ష్యం పూర్తి 2015లో హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టినపుడు మొత్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తాజా విడతలో మొత్తం లక్ష్యాన్ని అధిగమించనున్నారు. హరితహారం కోసం అన్నిశాఖల్లో కలిపి ఇప్పటిదాకా రూ.5,591 కోట్లు ఖర్చు చేశారు. -
చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు
బోథ్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, డిమాండ్ లేదనే మొక్కజొన్న పంట వేయవద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమేనని, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని మంత్రులకు ఫోన్ చేసిన రైతులతో అన్న మాటలివి. పంట కొంటామనలేదు.. టీ– శాట్ ఛానల్లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోన్ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన భీమ గోవింద రాజు టి శాట్ ఛానల్‌కి ఫోన్ చేయగా.. మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పిందని.. ప్రత్యామ్నాయంగా జొన్నపంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు. మా చేతిలో ఏమీ లేదు: మంత్రి ఐకేరెడ్డి మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని ఫోన్లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతుకు సూచించారు. తమ జిల్లాలో 50వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
స్వామి సన్నిధిలో సంయమనం పాటించండి
సాక్షి, హైదరాబాద్: ‘భగవంతుడికి–భక్తుడికి మధ్య ఇంత విరామం అసాధారణం. లాక్డౌన్ వల్ల ఎడబాటు తప్పలేదు. జాగ్రత్తలతో దైవదర్శనానికి కేంద్రం అనుమతించటంతో రాష్ట్రంలో కూడా అందుకు అవకాశం కల్పించాం. భక్తులు హడావుడి పడకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. ఒకేసారి విరుచుకుపడకుండా భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలి. నేరుగా ఆలయానికి రావాల్సిన అవసరం లేకుండా కోరిన రోజు, కోరుకున్న సేవను స్వామి, అమ్మవార్లకు నిర్వహించేలా ఆన్లైన్ సేవలను మరింతగా విస్తరించబోతున్నాం’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. తొలిరోజు భక్తులు భారీ సంఖ్యలోనే ఆలయాలకు తరలి వచ్చారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని, భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించారు. దేవాలయాలకు సంబంధించిన వివరాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నిబంధనలు పాటిస్తే అంతా సంతోషమే లాక్‌డౌన్‌తో ఆగిపోయిన దర్శనాలు 78 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది. కానీ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనవసరంగా హడావుడి పడి తమతో పాటు తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు. తొలిరోజు ఆశించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్లారు. ఆదాయం కోల్పోవడంపై ఆలోచించలేదు.. లాక్డౌన్ వల్ల దేవాలయాలకు భక్తులు రాక దేవాదాయ శాఖకు దాదాపు రూ.200 కోట్ల ఆదాయం పోయింది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. తప్పని పరిస్థితిలో ఆలయాలకు భక్తుల రాకను నిలిపేయాల్సి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటించాం. ఆదాయం కంటే భక్తులకు స్వామి దర్శనాలు ప్రశాంతంగా కల్పిస్తూ ఆలయాల్లో భక్తి పూర్వక వాతావరణాన్ని పెంపొందించటమే మా కర్తవ్యం. ఇప్పుడు ఆలయాలు తెరుచుకున్నందున భక్తులకు ఇబ్బందులు, భయాందోళనలు లేని దర్శనాలు నిర్వహిస్తాం. అందుకే కేంద్రం విధించిన నిబంధనలతో పాటు మరికొన్నింటిని అదనంగా చేర్చి అమలు చేస్తున్నాం. దీనికి భక్తులంతా సహకరించాలి. ఇక ఆలయాలకు ఆదాయం తగ్గినా వాటి నిర్వహణకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏ ఇబ్బందీ రానీయలేదు మూసి ఉన్న సమయంలో ఆలయాలకు ఆదాయం లేకున్నా అర్చకులు, ఆలయాల సిబ్బంది జీతాలకు, ధూపదీప నైవేద్యం పథకం కింద పేద దేవాలయాలకు చెల్లింపులకు ఎక్కడా లోటు రానీయలేదు. 4 వేలకు పైగా పేద దేవాలయాలకు చెల్లిస్తున్న ధూపదీప నైవేద్యం సాయాన్ని కొనసాగించాం. 3,600 మందికిపైగా అర్చకులకు చెల్లించాల్సిన జీతాలను చెల్లించాం. లాక్డౌన్ నిబంధనలు కొనసాగినన్నాళ్లూ ఆలయాల్లో స్వామి కైంకర్యాలు యథావిధిగా జరిగాయి. అర్చకులు వాటిని పద్ధతి ప్రకారం నిర్వహించారు. ఇప్పుడు కూడా ప్రత్యేక వేడుకలను అలాగే నిర్వహిస్తారు. ఆన్లైన్ దర్శనాలను విస్తరిస్తాం ఇటీవల భద్రాచలం రాముల వారి కల్యాణ తలంబ్రాలను పోస్టు ద్వారా భక్తులకు పంపాం. 25 వేల మంది భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నారు. అదే తరహాలో ఆన్లైన్లో ప్రధాన ఆలయాల్లో కోరుకున్న ఉత్సవాలను నిర్వహించుకుని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను పోస్టులో పొందే వీలు కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల్లో ప్రారంభించిన ఆన్లైన్ సేవలను ఇతర అన్ని ప్రధాన దేవాలయాలకు విస్తరిస్తున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విదేశీ భక్తులు కూడా ఖండాంతరాల నుంచే స్వామి సేవలో తరించొచ్చు. -
మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్!
సాక్షి, హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకుంటే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాణకోటికి అనూకూలంగా ఉన్న ఏకైక గ్రహం భూమి అని, భూ గ్రహాన్ని సంరంక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలతో పాటు కొత్త కొత్త వ్యాధులు ఇవన్ని కూడా పర్యావరణానికి మనం చేస్తున్న హాని వల్లేనని గ్రహించాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతే వివిధ వైరస్లు సోకడం ముమ్మరమవుతుందనేది మహ్మమ్మారి కరోనా వైరస్ భయానక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ఈ సందర్బంగా తెలిపారు. (భూమాతకు కృతజ్ఞతలు తెలుపుదాం: మోదీ) మానవ తప్పిదాల వల్లే వైరస్లు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైరస్‌లను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పర్యావరణ విధ్వంసంతోనే గతంలో మెర్స్, నిఫా, సార్స్, బర్డ్ ఫ్లూ, ఎబోలా లాంటి వ్యాధులు సంభవించిన విషయం మనందరికీ తెలిసిందేనని, ఇప్పుడు కొత్తగా కరోనా.. ఇలా మానవులను వరుస పెట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్నాళ్లకు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆరోగ్యంపై ప్రభావం చూపి మానవాళి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. (పుడమి తల్లికి ప్రణామం) భూమిపై ఉన్న జీవరాశులు మనిషి లేకుండా బతుకుతాయని, కానీ మనిషి జీవరాశులు లేకుండా మనుగడ సాధించలేదని మంత్రి అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచడాన్ని ఉద్యమంలాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ‘చెట్టు అంటే కలప కాదు, అదొక జీవ వ్యవస్థ అని గ్రహించాలి. మానవ జాతిని ఇన్ని కోట్ల సంవత్సారాలు సంరక్షిస్తున్నది అడవులతో కూడిన జీవ వ్యవస్థని గుర్తించాలి. అందుకే ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఉన్న చెట్లను సంరక్షించండి, కొత్తగా మొక్కలను నాటండి’ అని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. (వరమా.. శాపమా!) -
‘లోక కల్యాణార్థం కోసమే యాగాలు’
సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్ చేసిన యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువులు వాగులు నిండాయని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో ఆదివారం ప్రారంభమైన అతిరుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటిన్నర ఎకరాల మాగానికి సాగునీళ్లు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కల్యాణానికి దోహదపడతాయన్నారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. రెండు జాతరలు నిర్వహించిన స్ఫూర్తితో ఈ సారి కూడా మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. -
‘రూ. 17 కోట్లతో రాజేశ్వర పంపును ప్రారంభించాం’
సాక్షి, సిరిసిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషి వల్లే నేడు తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని, అది కళ్లెదుటే కనబడుతోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి మాట్లాడుతూ .. నాసిక్‌లో మొదలైన గోదావరిని వేములవాడ రాజన్న ఆలయం చెరువులోకి రప్పించడానికి కేటీఆర్ పంపు హౌజ్‌ను ప్రారంభించాలని ఆదేశించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన రాజన్న ఆలయం తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాకముందు వేములవాడ దేవాలయం ఎలా ఉండేదో... ఇప్పుడేలా ఉందో గమనించాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. వేములవాడ రాజన్న దేవాలయం చెరువులోకి గోదావరి జలాలను రప్పించడానికి 17కోట్లతో రాజేశ్వర పంపును ప్రారంభించామన్నారు. తెలంగాణలో అత్యధికంగా భక్తులు వచ్చే పెద్ద గుడి వేములవాడ రాజన్న ఆలయమని, దానిని రూ. 400కోట్లతో దశలవారిగా అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. మిడ్ మానేరు ద్వారా లక్షలాది ఎకరాలు సస్య శ్యామలం అవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథతో తాగునీటి సమస్యలు తీరుతున్నాయన్నారు. అలాగే కళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అతి వేగంగా పూర్తి చేశామని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. -
ఆదిలాబాద్‌లో ఢీ అంటే ఢీ
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిపక్షం కయ్యానికి కాలు దువ్వడంతో అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎండగట్టాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతాం అని ఇలా ఒకరికొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీదా తొలి జెడ్పీ సర్వసభ్య సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్షాన్ని ప్రశ్నలు సంధించకుండా అధికార పక్షం దాటవేసే ధోరణి అవలంబించింది. ఏదేమైనా జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే గొంతు ప్రతిపక్ష రూపంలో కనిపించగా.. ఎదురు దాడి ద్వారా పైచేయి ఎలా సాధించాలో అధికార పక్షం నిరూపించింది. తొలి సమావేశం.. ఆదిలాబాద్ జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కిషన్, జేసీ సంధ్యారాణి వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, రేఖానాయక్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. సోయం వర్సెస్ జోగు జెడ్పీలో చైర్మన్‌తో కలుపుకొని తొమ్మిది మంది జెడ్పీటీసీలు ఉన్న టీఆర్ఎస్కు నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి పాల్గొనడంతో అధికార పక్షం బలంగా కనిపించింది. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ ఐదుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షం ముఖ్యం గా బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండటం తో ఆయన సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడం ద్వారా తొలి సమావేశంలోనే ఇరుకున పెట్టే అవకాశం ఉందని గ్రహించిన అధి కార పక్షం కేంద్ర ప్రభుత్వం పథకాల్లో లోపాలను ప్రస్తావించడం ద్వారా వ్యూహాత్మకంగా దాడికి దిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూపడంలో ఇటు బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు, టీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్ సమ్మాన్ ద్వారా జిల్లాలోని 87 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినా సాయం కింద అందజేయాల్సిన రూ.6వేలను ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయశాఖ అధికారులను అడగడం ద్వారా పరోక్షంగా ఎంపీ సోయం బాపురావును ఈ విషయంలో ప్రశ్నించారు. కేవలం 47 వేల మంది రైతులకే రూ.2వేల చొప్పు న ఇచ్చారని జోగు రామన్న చెప్పుకొచ్చారు. అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.. రెండో విడత వస్తుందా, రాదా.. మొదటి విడత అందరికీ అందుతుందా.. అంటూ అడిగారు. కేంద్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణ పరిమితి పెంచినా ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో చేను ఉన్న రైతుకు కూడా రూ.1.50లక్షల్లోపే రుణం అందిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం దేనికంటూ దెబ్బిపొడిచారు. జిల్లాలో కిసాన్ సమ్మాన్ పరిస్థితిపై రిపోర్టు తయారు చేసి కేంద్రాన్ని అడగాలని, ఎంపీ సోయం బాపురావుకు ఈ రిపోర్టును ఇవ్వడం ద్వారా అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి, లేనిపక్షంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ పరోక్షంగా సోయంను కోరారు. జెడ్పీ అధికార పక్షం దాడిని పసిగట్టిన ఎంపీ సోయం బాపురావు ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం«ధు పథకం కింద జిల్లాలో ఎంత మంది రైతులను గుర్తించారు, ఎంత మందికి సాయం అందాలి అంటూ వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. 1,36,409 మంది రైతులకు గాను 90,150 మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందజేసినట్లు అధికారులు చెప్పారు. అయితే పెట్టుబడికి అందజేయాల్సిన సాయం పంట చేతికొచ్చే సమయంలో అందజేయడం ఏమిటని సోయం ఎద్దేవా చేశారు. ప్రస్తావనలో సామెతగా.. పదో తరగతి పిల్లాడికి పరీక్షలు అయిపోయిన తర్వాత పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందని దెబ్బిపొడిచారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య వాడీవేడిగా సాగింది. 2018 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇన్ని రోజులైనా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కలేదని వాపోతూ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించి రైతులకు ప్రయోజనం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై సోయం బాపురావు మరో రకంగా స్పందించారు. 2018 డిసెంబర్లో నేను ఎంపీగా లేనని, టీఆర్ఎస్కే చెందిన గోడం నగేశ్ ఉన్నారని, అప్పుడు మీరెందుకు ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంత నవ్వులు పూసాయి. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండటం, మళ్లీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయనే ఉండడంతో ఎమ్మెల్యే జోగు రామన్న ఆ విధంగా ప్రశ్నించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ సోయం బాపురావుతో విషయం తమవైపు సాగేలా ప్రయత్నం చేశారు. సోయం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు రావాల్సిన సాయం అందేలా చూస్తానన్నారు. అదే సందర్భంలో జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారని సోయం బాపురావు వ్యవసాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలోనే.. సమావేశం ఆది నుంచే ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షంపై గురి పెట్టారు. జెడ్పీ సమావేశంలో 42 అంశాలకు సంబంధించి మొదటి అంశంగా విద్యాశాఖతో ప్రారంభమైంది. డీఈవో రవీందర్‌రెడ్డి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి చేపడుతున్న అంశాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ తన మండలంలో అనేక పాఠశాలల భవనాలకు పెచ్చులు ఊడిపోయాయని, సరిపడ టాయిలెట్లు లేవని, బాలికలు చదువుకునే పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆదర్శ పాఠశాలలని చెప్పుకోవడమే తప్పా పశువుల కొట్టం మాదిరి ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి అన్ని అంశాలపై సభ్యులందరు మాట్లాడేది ఉందంటూ సమస్యను తక్కువ సమయంలో ప్రస్తావించాలని గణేశ్‌రెడ్డితో అన్నారు. తాను మాట్లాడి నాలుగైదు నిమిషాలు కూడా కాలేదని, మమ్మల్ని ఆపకండి.. కరెక్ట్ కాదు.. సభ్యులు చెప్పేది వినే ఓపిక ఉండాలంటూ గణేశ్ రెడ్డి మంత్రిపై మాటలతో ఎదురుదాడికి దిగారు. మంత్రి, కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా వెనక నుంచి బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గణేశ్ రెడ్డిని.. చెప్పింది చాలు.. కూర్చో అంటూ సంబోధించారు. కొంతమంది టీఆర్ఎస్ సభ్యులు కూడా తుల శ్రీనుకు వెన్నంటి నిలిచారు. దీంతో చిర్రెత్తిన గణేశ్‌రెడ్డి నువ్వే కూర్చో అంటూ ఆగ్రహంగా ఊగిపోవడంతో సమావేశంలో వాడీవేడి కనిపించింది. ఇలా పలు సందర్భాల్లో అధికార టీఆర్ఎస్ సభ్యులు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎజెండా అంశాలు.. జెడ్పీ సమావేశం ఎజెండాలో 42 అంశాలు ఉండగా, ఓ సందర్భంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సమావేశం కావడంతో సభ్యులందరు మాట్లాడాలని, ఈ దృష్ట్యా అందరికీ అవకాశం రావాలి అంటూ పరోక్షంగా తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గణేశ్ రెడ్డితో అన్నప్పుడు ఆయన తాము క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. సమావేశ ఎజెండా అంశాలకు సమయం సరిపోకపోతే రెండు రోజులు నిర్వహించాలంటూ అధికార పక్షాన్ని ఎండగట్టారు. మొత్తం మీదా మొదట సమావేశం ప్రారంభం కాగానే సభ్యులను సన్మానించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని సన్మానించారు. ఆ తర్వాత ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ప్రకటించారు. మంత్రి, జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. తదనంతరం ఎజెండా అంశాలతో సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి సమావేశాన్ని నామమాత్రంగా ముగించాలనుకున్న అధికార పక్షానికి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షం ఉంది అనేలా సమావేశం సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి సెషన్, తిరిగి 2.30 గంటల నుంచి సాయంత్రం వరకు రెండో సెషన్‌గా ఎజెండా అంశాల ప్రస్తావనతో ముగిసింది. -
అనితను పరామర్శించిన మంత్రి
సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు. -
లోక్‌సభ స్థానాలు కైవసానికై అమాత్యులు గురి..
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడంపై అమాత్యులు గురిపెట్టారు. అధినేత కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చేందుకు రాష్ట్రమంత్రులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో పార్టీ ఖాతాలో ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను తిరిగి సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు చేపట్టిన రాష్ట్రమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పార్టీ అభ్యర్థులను విజయంవైపు నడిపిస్తున్నారు. సాక్షి మంచిర్యాల: ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్‌ను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న ఐకే.రెడ్డి పార్టీ కేడర్‌ను సమాయత్తపరుస్తూ ముందుకు కదులుతున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. దీంతో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా టీఆర్ఎస్ చేతికి వెళ్లాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూనే.. మంత్రి ఐకే.రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సమన్వయ, ప్రచార బాధ్యతలను పూరి ్తగా చేపట్టిన ఆయన పార్టీని ఏకతాటిపై నడిపిం చేందుకు ప్రయత్నిస్తున్నారు. కచ్చితంగా ఆది లాబాద్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్, బీజేపీ నుంచి సోయం బాపురావు బరిలో ఉన్నారు. లం బడా తెగకు చెందిన రమేష్ రాథోడ్.. ఆదివాసీకి చెందిన సోయం బాపురావు బలమైన అభ్యర్థులు కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టారు. కేసీఆర్ ఆదేశంతో పెద్దపల్లి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ విజయానికి ఈశ్వర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో.. పెద్దపల్లి, రామగుండం, మంథని పెద్దపల్లి జిల్లాలో.. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో ఉన్నా యి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో మంథని, రామగుండం స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లిల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఆ తరువాత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరడంతో బలం మరింత పెరిగింది. ఇప్పుడు ఒక్క మంథని మినహా మిగిలిన ఆరుస్థానాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒకమాజీ ఎమ్మెల్యేతో కలిసి కొప్పుల ఈశ్వర్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. స్వయంగా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు.. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను సమన్వ యం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. మాజీ ఎంపీ జి.వివేక్‌కు పార్టీ టికెట్ నిరాకరించడంతో నెలకొన్న పరిస్థితులు టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఆ సమస్యను అధిగమించడానికి వివేక్ లక్ష్యంగా కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ మాటలతూటాలు ఎక్కుపెట్టారు. వివేక్ అనుచరులను పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మళ్లించడానికి కొప్పుల పావులు కదుపుతున్నారు. ఏదేమైనా ఆదిలాబాద్, పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను చేపట్టిన అమాత్యుల మంత్రాంగం ఏ మేరకు ఫలించనుందో వేచిచూడాలి. -
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
నిర్మల్ రూరల్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం అనేక నిధులను మంజూరు చేస్తుందన్నారు. కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని అవగాహన చేసుకుని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్లో ఏడుగురు సర్పంచులు చేరిక అనంతరం మంత్రి సమక్షంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సర్పంచులు పార్టీలో చేరారు. నిర్మల్‌రూరల్ మండలంలోని మేడిపెల్లి సర్పంచ్ కుంట దుర్గ, రత్నాపూర్‌కాండ్లి సర్పంచ్ పీచర లావణ్య, దిలావర్పూర్ మండలంలోని కాల్వ సర్పంచ్ ఆడెపు తిరుమల, మాయాపూర్ సర్పంచ్ రొడ్డ మహేశ్, లక్ష్మణచాంద మండలం లోని పార్పెల్లి సర్పంచ్ నూకల రాజేంధర్, సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ సర్పంచ్ వంజరి కవిత, న్యూవెల్మల్ అంకంగంగామణి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి డి.విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రా జేందర్, పత్తిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రమేశ్, మోయినొద్దీన్, మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అల్లోల గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెంటిమెంట్ బ్రేక్ చేశా..
సాక్షి, మంచిర్యాల: దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వాళ్లు మళ్లీ గెలవరనే సెంటిమెంట్‌ను తాను బ్రేక్ చేశానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఐకే రెడ్డి మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతగానో సంతృప్తి నిచ్చిందన్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే అటవీచట్టంలో సమూల మార్పులు తీసుకువస్తామని, అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. జంగల్ బచావో, జంగల్ బడావో అనే నినాదంతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రెండోసారి మంత్రిగా... రాష్ట్ర మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లోల దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా అవకాశం వచ్చింది. ఈసారి గతంలో ఉన్న దేవాదాయ, న్యాయశాఖతో పాటు అటవీ, పర్యావరణ శాఖలను అప్పగించారు. గతంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుంచి జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులుగా ఉండగా, ఈ సారి ఒక్క అల్లోలకే అవకాశం దక్కింది. అడవులకు పెట్టింది పేరైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే మరోసారి అటవీశాఖ దక్కడం విశేషం. మంత్రికి పలువురి శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐకే రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విఠల్‌రావు, సత్యనారాయణగౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’
సాక్షి, హైదరాబాద్ : ఆలయాల శాఖకు అమాత్యులుగా పనిచేసిన వారికి అనంతర రాజకీయ జీవితంలో దేవుడి కరుణ మాత్రం కలగలేదు. గతంలో 8 మంది నేతలు దేవాదాయ మంత్రులుగా పనిచేశారు. వారిలో ఎవరినీ మరోసారి మంత్రి పదవి వరించలేదు. ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమైందని చరిత్ర చెబుతోంది. కానీ, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం 36 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. గత కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన ఆయన ఈసారి కూడా మంత్రి అయ్యారు. మంత్రి కావడమే కాదు... దేవాదాయ మంత్రిగా రికార్డు సృష్టించారు. (కేసీఆర్ వద్దే ఆర్థిక శాఖ ) చరిత్ర ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన వారు మళ్లీ మంత్రి పదవి చేపట్టడం అనేది జరగలేదు. మంత్రి పదవి అటుంచితే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడమే గగనమైపోయింది. కొంతమందికైతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. మరీ పూర్వం నుంచి కాదు గానీ 1983లో ఎన్టీఆర్ కేబినెట్లో దేవాదాయ మంత్రిగా పనిచేసిన యతిరాజారావుతో పాటు 1994లో ఎన్టీఆర్ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత సింహాద్రి సత్యనారాయణ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. ఇక 1995లో చంద్రబాబు కేబినెట్లో ఈ శాఖ నిర్వహించిన దామచర్ల ఆంజనేయులు తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. ఇక 1999 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ చంద్రబాబు కేబినెట్లో దండు శివరామరాజు దేవాదాయ శాఖ చేపట్టారు. 2004 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. తర్వాత ఈ శాఖ చేపట్టిన ఎం.సత్యనారాయణరావు మధ్యలోనే పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెస్సార్ తర్వాత ఆయన సామాజిక వర్గానికే చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు ఆ శాఖ చేపట్టారు. అయితే, 2009 ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదు. ఇక, 2009 ఎన్నికల తర్వాత దేవాదాయశాఖ చేపట్టిన గాదె వెంకట్‌రెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిపదవి దక్కలేదు. ఎమ్మెస్సార్‌కు, రత్నాకర్‌రావుకు మధ్యలో కొన్ని నెలలు దేవాదాయ బాధ్యతలు నిర్వర్తించిన జేసీ దివాకర్‌రెడ్డికి 2009లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి రాలేదు. అప్పుడు దేవాదాయ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత విస్తరణలో మంత్రి అయినా దేవాదాయశాఖ చేపట్టలేదు. అప్పుడు దేవాదాయ శాఖ బాధ్యతలు తీసుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి 2018లో కేసీఆర్ ప్రభుత్వం రద్దయ్యేంతవరకు అదే శాఖ నిర్వహించారు. మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమింపబడటం విశేషం. -
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఐకే రెడ్డికి చాన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ, విధేయతను ప్రామాణికంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఈ విడత నిర్మల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి)కి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, సీనియర్ రాజకీయవేత్త అయిన ఐకే రెడ్డికి ఈసారి కేబినెట్లో కీలకమైన శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, బీసీ నాయకుడు జోగు రామన్నకు రిక్తహస్తం ఎదురుకానుంది. ఈసారి కేబినెట్లోకి పరిమిత సంఖ్యలోనే మంత్రులను తీసుకొని, పార్లమెంటు ఎన్నికల తరువాత మలిదఫా విస్తరణ ఉంటుందని సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఐకే రెడ్డి ఒక్కరికే అవకాశం లభిస్తుందని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్‌రెడ్డికి మరోసారి పదవి లభించనుందని స్పష్టం కావడంతో ఆయన వర్గీయులు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు విధేయుడు... రాజకీయ యోధుడు ఐకే రెడ్డి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బలమైన నాయకుడు. 1984 నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, శాసనసభ, పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన ఐకే రెడ్డి గెలిచిన వెంటనే టీఆర్ఎస్లో చేరి మంత్రిగా నాలుగున్నరేళ్లు కొనసాగారు. మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరున్న ఐకే రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విధేయుడిగా పేరొందారు. 2018 ఎన్నికల్లో నిర్మల్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై 9వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 స్థానాలకు 9 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఐకే రెడ్డికే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. పేరు: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తల్లిదండ్రులు: చిన్నమ్మ–నారాయణరెడ్డి భార్య: విజయలక్ష్మి పిల్లలు: కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌రెడ్డి పుట్టినతేది: 16.02.1949 విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ రాజకీయ అనుభవం: 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991–96 ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1994, 1996లలో ఎంపీగా, 2009 నిర్మల్, 2010 సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందారు. 2014ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరిక. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. సామాజిక సమీకరణల్లో మాజీ మంత్రి జోగు రామన్న వెనుకబాటు గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్నకు ఈసారి అవకాశం దక్కడం లేదని స్పష్టమవుతోంది. మంత్రివర్గం కూర్పులో బీసీలకు ఇతర జిల్లాల నుంచి అవకాశం లభిస్తుండడం, సామాజికవర్గం పరంగా కూడా వరంగల్ నుంచి మున్నూరుకాపు వర్గానికి చెందిన వినయ్‌భాస్కర్‌కు చీఫ్ విప్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామన్నకు మంత్రివర్గంలో చోటు లేనట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమన్‌కు కలిసిరాని సామాజిక కూర్పు పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతూనే చెన్నూరు శాసనసభ స్థానం నుంచి ఘన విజయం సాధించిన బాల్క సుమన్‌కు సామాజిక కూర్పులో భాగంగానే ఈ విడతలో మంత్రి యోగం దక్కలేదని సమాచారం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి వర్గంలో స్థానం దాదాపుగా ఖరారైంది. అదే పార్లమెంటు స్థానంలో పరిధిలో ఈశ్వర్ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు తద్వారా అవకాశం లభించలేదని సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే మలి విడత విస్తరణలో సుమన్‌కు మంత్రి పదవి లేదా కేబినెట్ హోదాలో మరేదైనా కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. రేఖానాయక్ తదితరులకు నిరాశే! మహిళలకు గత ప్రభుత్వంలో అవకాశం లభించని నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్ మహిళా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే మహిళ, ఎస్టీ కోటా రెండు భర్తీ అవుతాయని భావించారు. అయితే పరిమిత కేబినెట్ విస్తరణలో సామాజిక, మహిళ, తదితర కోటాల జోలికి వెళ్లకుండా 8 లేదా 9 మందితో విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి భావిస్తుండడంతో రేఖానాయక్‌కు నిరాశే ఎదురైంది. సిర్పూరు నుంచి మూడుసార్లు విజయం సాధించిన కోనేరు కోనప్ప సైతం మంత్రి పదవికి రేసులో ఉన్నారు. ఆయన సైతం ‘కమ్మ’ సామాజిక వర్గం నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా అవకాశం లభిస్తుందని ఆశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్‌రావు(మంచిర్యాల) సైతం సీనియర్ సభ్యుడిగా చాన్స్ దక్కకపోతుందా అని భావించారు. అయితే సామాజిక వర్గాల కూడికలు, తీసివేతల్లో భాగంగానే వీరికి అవకాశం దక్కలేదనేది సుస్పష్టం. -
టీఆర్ఎస్కు షాక్
నిర్మల్‌టౌన్/నిర్మల్‌రూరల్: నిర్మల్ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా రసకందాయంలో పడింది. ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి, పార్టీకి.. మంత్రి అల్లోలకు షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు 20 మంది కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్, ఇద్దరు మా జీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ను వీడారు. ఇప్పటికే కౌన్సిలర్లు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకోగా, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి ఈ నెల 20న భైంసాకు రానున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి అల్లోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని పలువురు భావిస్తున్నారు. ఉదయం నుంచే ఉత్కంఠ.. మంత్రి ప్రధాన అనుచరుడు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి పార్టీ మారతారని శనివారం నుంచే సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆదివారం మధ్యాహ్నం గణేశ్ చక్రవర్తి తన సోదరుని నివాసంలో విలేకరులతో మాట్లాడతారని సమాచారం లీకైంది. దీంతో ఆదివారం ఉదయం నుంచే ఉత్కంఠ కొనసాగింది. అనంతరం గణేశ్ చక్రవర్తి అందరూ అనుకున్న విధంగానే టీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసి, భవిష్యత్ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే.. సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గణేశ్ చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనప్రాయంగా మారి ఉత్కంఠకు తెరపడింది. అగ్రవర్ణాల ఆధిపత్యం వల్లే.. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన సోదరుడి నివాసంలో గణేశ్ చక్రవర్తి, తన మద్దతు దారులైన 20 మంది కౌన్సిలర్లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. బీసీలకు సము చిత ప్రాధాన్యం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు మంత్రి ఐకేరెడ్డికి వెన్నంటి ఉన్నానని పేర్కొన్నారు. 2014లో బీఎస్పీనుంచి పోటీచేసిన ఐకేరెడ్డి గెలుపుకోసం తీవ్రంగా కృషిచేసినట్లు తెలిపారు. ప్రజల్లో పార్టీ, మంత్రి పట్ల తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ఉన్నాయన్నారు. -
2ఎంపీ, 10ఎమ్మెల్యే స్థానాలు మావే
సాక్షి,బెల్లంపల్లి ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పునరుద్ధరణకు కంకణం కట్టుకుని కార్మికుల ఆశలు నెరవేర్చామన్నారు. త్వరలోనే ఎస్పీఎం ప్రారంభమవుతుందన్నారు. కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6.50 కోట్ల రాయితీని కంపెనీకి చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మిల్లు పున:ప్రారంభానికి మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ప్రకృతి కూడా విస్తారంగా వర్షాలను కురిపిస్తోందన్నారు. ఇందుకు ప్రజలు భక్తితో బోనాలు సమర్పించుకుంటున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎమ్మెల్యేల చేతుల్లో డీఎంఎఫ్టీ నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్ దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, మహిళ,శిశు సంక్షేమశాఖ రెండు జిల్లాల కోఆర్డినేటర్ అత్తి సరోజ, ఎంపీపీ సుభాష్‌రావు, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు. -
నందిగుండం ఆలయాభివృద్ధికి కృషి
నిర్మల్‌టౌన్ : నందిగుండం ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌లోని నందిగుండం దుర్గామాత ఆలయ అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.50 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మున్ముందు సహకారం అందేలా చూస్తాననన్నారు. దసరా వరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మంత్రికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపికను బహూకరించారు. ఇందులో ఆలయ కమిటీ అధ్యక్షడు లక్కడి జగన్మోహన్రెడ్డి, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండాజీ వెంకటాచారి, ఆలయ ధర్మకర్త ముత్యం సంతోష్‌గుప్త, కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, దేవరకోట చైర్మన్ ఆమెడ కిషన్, బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్ తదితరులు ఉన్నారు. -
చర్చనీయాంశమైన కలెక్టర్ బదిలీ
సాక్షి, నిర్మల్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిలాల్లోనే ఆరుగురు పెద్దసార్లను ప్రభుత్వం శనివారం సాయంత్రం మార్చేసింది. ఉన్నపళంగా కలెక్టర్, ఎస్పీలను మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాల కలెక్టర్, ఎస్పీల బదిలీలపై ‘ఆదివాసీ’ ఉద్యమ ప్రభావం పడింది. ఇటీవల ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే వారిపై వేటు వేసింది. కానీ.. నిర్మల్ జిల్లా అధికారుల బదిలీల వెనుక రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఇలంబరిదిల మధ్య కొంతకాలంగా సయోధ్యలేని కారణంగానే బదిలీ వేటు పడ్డట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు కలెక్టర్ బదిలీ అవుతారన్న ఊహగానాలున్నా ఉన్నపళంగా శనివారం సాయంత్రం బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తన పనితీరుతోనే ఆదిలాబాద్ ఎస్పీగా, నిర్మల్ పూర్తి అదనపు బాధ్యతలు దక్కించుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. మొదట్లో బాగున్నా.. నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత కె.ఇలంబరిది కలెక్టర్‌గా, విష్ణు ఎస్ వారియర్ ఎస్పీగా నియమితులయ్యారు. గత పనితీరు, వీరికున్న అనుభవాలతో కొత్త జిల్లావాసులు హర్షం వ్యక్తంచేశారు. దీనికి తగ్గట్లుగా ఇరువురు ఉన్నతాధికారులూ మొదట్లో తమ పనితీరుతో ఆకట్టుకున్నారు. నూ తన జిల్లా పాలనలో తొలి అధికారులుగా తమదైన ము ద్ర వేశారు. రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యా యశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఇరువురి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా లో కలెక్టర్ ఇలంబరిది ప్రజావాణితో ప్రజలకు దగ్గర య్యారు. అన్నిశాఖల అధికారులు హాజరయ్యేలా చ ర్య లు తీసుకున్నారు. సమస్యలపై వెంటనే సదరు శా ఖాధికారిని పిలిచి, పరిష్కరించాల్సిందిగా ఆదేశించేవా రు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూశారు. ప దో తరగతి ఫలితాల్లోనూ జిల్లాకు మెరుగైన స్థానం వచ్చిం ది. కానీ.. కాలక్రమంలో పరిస్థితి మారుతూ వచ్చింది. విభేదం.. విముఖం.. కొత్త జిల్లాను ముందుకు తీసుకెళ్లాల్సిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ఇలంబరిదిల మ«ధ్య సయోధ్య దెబ్బతింది. పలు పనుల నేపథ్యంలో మంత్రి మాటను కలెక్టర్ కాదనడం విబేధాలకు కారణమైంది. వరుస సంఘటనలు మంత్రి, కలెక్టర్ల మధ్య దూరాన్ని పెంచా యి. ప్రధానంగా మంత్రి బాధ్యుడిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా విఫలం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కలెక్టర్ పట్టింపులేని తనమే కారణమని ఆరోపణలు వచ్చాయి. హరితహారం, ఉపాధిహామీ, పలు ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం పంపిణీ తదితర కార్యక్రమాల్లో జాప్యానికీ కలెక్టర్‌పై విమర్శలు వచ్చాయి. మంత్రితో విబేధాలూ కలెక్టర్ పనితీరుపై ప్రభావం చూపాయి. ప్రజావాణి, సమావేశాలు మినహా కలెక్టరేట్లో తక్కువగా ఉండేవారు. అధిక సమయం క్యాంపు కార్యాలయంలోనే గడిపేవారు. క్రమంగా ప్రజావాణి ఫిర్యాదులపైనా పెద్దగా దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారితీసింది. వివిధ శాఖలకు చెందిన ఫైళ్లను వెంటనే పరిష్కరించకుండా తన వద్దే పెట్టుకుంటున్నారన్న విమర్శలూ వచ్చాయి. బహిరంగంగానే ఆరోపణలు.. ఒక జిల్లా అధికారి తీరుతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని సాక్షాత్తు మంత్రి బహిరంగ సభలు, సమావేశాల్లో ఆరోపణలు, విమర్శలు చేశారు. బహిరంగంగా కలెక్టర్ తీరుపై మంత్రి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనక పోవడం వరకూ పరిస్థితి దిగజారింది. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో త్వరలో కలెక్టర్ బదిలీ కావడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇటీవల ఈనెలాఖరులోపు కలెక్టర్ బదిలీ ఖాయమన్న ఊహాగానాలూ జోరందుకున్నాయి. కానీ.. 15రోజుల ముందే ఇలంబరిది బదిలీ అయ్యారు. పని చేసింది 14నెలలు.. నిర్మల్ 2016 అక్టోబర్ 11న విజయదశమి రోజున నూతన జిల్లాగా ఏర్పడింది. సరిగ్గా 14నెలల పాటు కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. సమర్థవంతమైన అధికారులుగా పేరున్న వీరిద్దరూ ఆదిలోనే జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు. మంత్రితో విబేధాల కారణంగా కలెక్టర్ బదిలీపై ముందునుంచే ఊహాగానాలు ఉండగా, ఎస్పీ మాత్రం తనదైన శైలిలో నేరనియంత్రణ చేపట్టారు. వస్తూనే ఒక మావోయిస్టు లొంగిపోయేలా చేశారు. జిల్లా ఏర్పడక ముందుకు విచ్ఛలవిడిగా సాగిన చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు, గంజాయి, మట్కా, గుట్కాల అక్రమ రవాణా తదితర నేరాలపై ఉక్కుపాదం మోపారు. విద్యార్థులను పోలీస్ కెడెట్లుగా తయారు చేయడానికి చొరవ తీసుకున్నారు. ఏజెన్సీలో కొనసాగుతున్న ఆదివాసీ, లంబాడాల ఉద్యమ నేపథ్యంలోనే విష్ణు వారియర్‌ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పాటు నిర్మల్ జిల్లాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
మెడికల్ అన్‌ఫిట్ ద్వారా ‘వారసత్వం’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ , మంచిర్యాల : ‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో కార్మికులు తమ పిల్లల భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాం. ఈసారి టీజీబీకేఎస్‌ను గెలిపిస్తే మెడికల్ అన్‌ఫిట్ ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాం’ అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గత మూడు రోజులుగా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని బుధవారం ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. సాక్షి: టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ తరఫున మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్మికుల మనోగతం ఎలా ఉంది? ఐకే రెడ్డి: సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో జాతీయ సంఘాలు కొన్ని తప్పుడు ప్రచారం చేశాయి. దాంతో కార్మికుల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులకు వివరించి చెప్పడంతో వాస్తవాలను తెలుసుకున్నారు. కేసీఆర్ మాత్రమే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని నమ్ముతున్నారు. సింగరేణిలో గెలిచేది మా సంఘమే. సాక్షి:టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించనందుకే వారసత్వ ఉద్యోగాలు రాకుండా పోయాయని జాతీయ సంఘాలు చెపుతున్నాయి. దీనిపై మీ స్పందన? ఐకే రెడ్డి: చంద్రబాబు రద్దు చేసిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ గత సంవత్సరం పునరుద్ధరించడంతో సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టుకు వెళితే ఉద్యోగాల్లో వారసత్వం ఉండదని కొట్టేసింది. ఈ విషయం మీద ఏకంగా సింగరేణి సంస్థనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీనిని బట్టి కార్మికులు గమనించాల్సింది ఏమిటంటే... వారసత్వ ఉద్యోగాలపై టీఆర్ఎస్కు మాత్రమే చిత్తశుద్ధి ఉందని. సాక్షి: పోరాటం ద్వారానే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించుకోవచ్చని జాతీయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని కార్మికులు విశ్వసించరా? ఐకే రెడ్డి: టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌తో తప్ప జాతీయ సంఘాలతో కార్మికుల వారసత్వం కల నెరవేరదు. ఎందుకంటే చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించిందే ఈ జాతీయ సంఘాలు. వారసత్వం అవకాశాన్ని దెబ్బతీసిన టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీతో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాయి. ఈ అపవిత్ర పొత్తుతోనే వారి ఉద్దేశం తెలుస్తుంది. ఎప్పుడూ కలవని మూడు సంఘాలు ఒకటవడం వెనుక ఏదో కుట్ర ఉందని కార్మికులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతో కేసీఆర్‌ను అప్రదిష్టపాలు చేయాలనే ‘వారసత్వాన్ని’ రద్దు చేసిన ఈ మూడు సంఘాలు ఒకటయ్యాయి. అలాగే సింగరేణిలో టీబీజీకేఎస్ కార్మికుల 22 డిమాండ్లను సాధిస్తే, గతంలో గుర్తిపుం సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ 14 డిమాండ్లను కాలరాశాయి. ఈ సంఘాలను నమ్మకనే అందులో పనిచేస్తున్న నాయకులు టీబీజీకేఎస్‌లో చేరుతున్నారు. సాక్షి:టీబీజీకేఎస్ గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన ‘వారసత్వాన్ని’ పునరుద్ధరించే అవకాశం ఉందా? న్యాయశాఖ మంత్రిగా మీరు స్పష్టత ఇవ్వగలరా? ఐకే రెడ్డి: బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా వస్తాయి. 15 ఆరోగ్య సంబంధ వ్యాధులలో ఏ ఒక్కదానికి కార్మికుడు గురైనా కష్టమైన బొగ్గు పని చేయలేడు కాబట్టి, అతడు సూచించిన వారసుడికి సింగరేణిలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం. భూగర్భం నుంచి బొగ్గును వెలికితీస్తూ జాతికి సంపదను సృష్టిస్తున్న కార్మికుడికి తగిన న్యాయం చేసేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు మెడికల్ గ్రౌండ్ మీద వారసత్వ ఉద్యోగం కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సాక్షి:సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ప్రచారం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో నిజమెంత? ఐకే రెడ్డి: సింగరేణి తెలంగాణకు గుండెకాయ వంటిది. ఈ కంపెనీని కన్నతల్లిగా కేసీఆర్ భావిస్తారు. సింగరేణిలో పనిచేసే కార్మికులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తారు. అలాంటి సింగరేణిని ప్రైవేటుపరం చేయబోతున్నారనే అసత్యాన్ని జాతీయ సంఘాల పేరుతో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. జీహెచ్ఎంసీ నుంచి ఏటా రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలే రాష్ట్రంలోని పరిశ్రమలను ప్రైవేటుపరం చేసిందనే విషయాన్ని వివరించి చెప్పడంతో కార్మికులు వాస్తవాలను గుర్తిస్తున్నారు. కేసీఆర్ ఏ సంస్థను కూడా ప్రైవేటుపరం చేయబోరు. -
రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం
► మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ► మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన ముథోల్: రైతులను రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని దేవాదాయ, గృహ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముథోల్ మండలంలోని చించాల గ్రామంలో మిషన్ కాకతీయ మూడో విడత కింద పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఆదివారం చేపట్టారు. రూ.32లక్షల42వేలు మంజూరు కావడంతో ఈ పనులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. చెరువులో మంత్రి ,ఎమ్మెల్యే మట్టిని తవ్వి ట్రాక్టర్లలో వేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత మిషన్ కాకతీయ చెరువు మరమ్మతు పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మూడో విడతలో 26 చెరువులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. చెరువులో నీరు ఉంటేనే భూగర్భ జలాలు తరిగిపోకుండా ఉంటాయన్నారు. మిషన్ కాకతీయ వల్ల బోరుబావుల నీళ్లు తగ్గిపోకుండా ఉంటాయని వివరించారు. బాసర గోదావరి నదిలో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గోదావరి నీరు ఉండడం వల్లే చెక్‌డ్యాం పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో సామాన్యులందరికి త్వరగా పనులు జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. బాసర ఆలయానికి త్వరలో ముఖ్యమంత్రి రానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, కోఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అఫ్రోజ్‌ఖాన్, ఇరిగేషన్ ఈఈ ఒ.రమేశ్, ఈఈ నవీన్‌కుమార్, ఆర్డీవో రాజు, తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, ఎంపీపీ అనూషసాయిబాబా, ఎంపీడీవో నూర్‌మహ్మద్, సర్పంచ్ ఉమాసత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
► మంత్రులు రామన్న, ఐకే రెడ్డి ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన బోథ్ : అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం బోథ్ మండలం సొనాల గ్రామంలోని రామాలయంలో రూ.38లక్షలతో నిర్మించతలపెట్టిన ధ్యాన మందిరం, రూ.96 లక్షలతో చేపట్టనునన్న బైపాస్ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 106 సంచార కులాలను ఎంబీసీలో కలుపుతూ వారికి బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా రూ.వెయ్యి కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రధాన్యత ఇచ్చిందన్నారు. బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలోనే 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామ కుర్మ సంఘానికి రూ.5లక్షలు, మున్నూరు కాపు సంఘానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు నుంచి ఘన్ పూర్ వరకు రూ.36 కోట్ల కేంద్రం నిధులతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. జాతర్ల నుంచి సొనాల గ్రామం వరకు త్వరలోనే డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సొనాల పాఠశాలకు రూ.30లక్షల నిధులతో ప్రత్యేక గదులు, ప్రహరీ నిర్మాణం చేపడతామన్నారు. పాడి పరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, బీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, ఆదిలాబాద్, బోథ్ మార్కెట్ కమిటీల చైర్మన్లు అరె రాజన్న, నల్ల శారద, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఎంపీపీ గంగుల లక్ష్మి తదితరులున్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేరడిగొండ : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్ధికొండ గ్రామ శివారులోగల శ్రీ మహాలక్ష్మిదేవి ఆలయంలో శ్రీలక్ష్మిమదేవి విగ్రహ ప్రతిషా్ఠపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి సరసాని లక్ష్మి కుటుంబ సభ్యులు విగ్రహాలు కొనివ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సరసాని లక్ష్మిని మంత్రి శాలువా, పూలమాలలతో సన్మానించారు. శ్రీమహాలక్ష్మీ ఆలయ అభివృద్ధికి రూ.12లక్షల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. నేరడిగొండలోని శబరిమాత ఆలయాన్ని రూ.12లక్షలతో దేవాదాయ శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ గోడంనగేశ్, రాష్ట్ర సహకార పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఏఎంసీ చైర్మన్ నల్ల శారద, ఉపాధ్యక్షుడు దావుల భోజన్న, స్థానిక సర్పంచ్ సునీత, ఎంపీటీసీ సభ్యురాలు దుర్వ గంగామణి, నాయకులు శ్రీనివాస్, రమణ, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు కుప్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతాం కుప్టి, కుమారి గ్రామాల ప్రజలు కుప్టి ప్రాజెక్టు ప్రస్తావన తేగా మంత్రి స్పందించారు. మండలంలోని కడెం నది పరీవాహక ప్రాంతమైన కుప్టి గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును 6.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి తీరుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును నిర్మించేందుకు సీఎం ఒప్పుకున్నారని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
క్యాలెండర్ ఆవిష్కరణ
నిర్మల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం టీయూటీఎఫ్ 2017 క్యాలెండర్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. ఇందులో కలెక్టర్ ఇలంబరిది, జేసీ శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీమనోహర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నాగభూషణ్, రవికాంత్, లక్షీ్మప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ టౌన్ : పీఆర్టీయూ సంఘం రూపొందించిన 2017 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆదివారం రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఇందులో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారావు, జి.జనార్దన్, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ : తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎంఈయూ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో ఆదివారం యూనియన్ నాయకులతో కలిసి ఆయన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా హిదాయత్‌అలీ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అథరుద్దీన్, కోశాధికారి మొయిజుద్దీన్, నాయకులు ఇర్ఫాన్, మతీన్, షరీఫ్, నహిద్పాషా, గౌసోద్దీన్, అన్సర్, ఫిరోజ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'
ఆదిలాబాద్ : ఓటుకు కోట్లు’ వ్యవహరంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం పెద్దల శరణుజోచ్చాడని, ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైదరాబాద్‌లో సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా కూడా సెక్షన్ 8పై లేనిపోని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. ఈ కేసులో ఏసీబీ పకడ్బందీగా విచారణ చేపట్టిందని అన్నారు. తప్పించుకునేందుకు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కుల చేసిన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కేసును కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ధర్మపురిలో కేసీఆర్ పుష్కరస్నానం ఈ పుష్కరాల్లో సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లు మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశాలున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 106 ఘాట్ల నిర్మాణం చేపట్టామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ పనుల్లో నాణ్యత లోపిస్తే విజిలెన్స్, క్యూసీ వంటి సంస్థలతో విచారణ చేపడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పుష్కర స్నానం ఆచరించేందుకు భద్రాచలానికి నాగసాదువులు వచ్చే అవకాశాలున్నాయని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాల్లో రెండు హెలిక్యాప్టర్లను కూడా వినియోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడపాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తారని ప్రకటించారు. అలాగే ఈ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు బెడ్రూంల గృహ ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకోస్తున్నాయని ఐ.కె.రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రెండు లక్షల గృహాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మున్సిపాలిటీల్లో జీ ప్లస్ 1, జీ ప్లస్ 2తో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. -
ఫ్లైఓవర్ ప్రారంభించిన తుమ్మల
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా రూ. 31 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనను శుక్రవారం రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం రూ.34 కోట్లోతో ఐటీడీఎ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన యువజన శిక్షణ కేంద్రాన్ని ఆయన ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. (బెల్లంపల్లి) -
'ఆ కథనంపై పరువునష్టం దావా వేస్తా'
హైదరాబాద్: నిర్మల్ చెర్వుభూములపై తనపై ఓ పత్రిక (సాక్షి కాదు) రాసిన కథనంలో వాస్తవంలేదంటూ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఆ పత్రిక కథనంపై పరువునష్టం దావా వేస్తానంటూ మండిపడ్డారు. మంత్రి కొడుకు వ్యాపారాలు చేసుకోవద్దా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా శనివారం ఆయన్ను సచివాలయంలో హైకోర్టు న్యాయవాదులు కలిశారు. హైకోర్టు విభజన పూర్తయ్యేవరకు జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు చేపట్టవద్దని న్యాయవాదులు ఇంద్రకరణ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దాంతో ఆయన హైకోర్టు విభజనను మరోసారి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
రూ.వందకోట్లతో మాస్టర్‌ప్లాన్
వేములవాడ అర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని రూ.వంద కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను శనివారం ఉదయం మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ.21 కోట్లతో స్వామి వారి విమానగోపురానికి బంగారు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న రాజన్న సన్నిధిలో జరుపుకునే మహాశివరాత్రి జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు భద్రాచలం మాదిరిగా జీవో జారీ చేస్తామన్నారు. గోదావరిఖని పుష్కరాలను రూ.500 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వైభవం తీసుకొస్తానని అన్నారు. తెలంగాణ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జోన్లుగా విభజించి పుణ్యక్షేత్రాలన్నింటినీ మోగా టూరిస్ట్ సర్క్యూట్ ద్వారా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజన్న సన్నధిలో మంత్రి పూజలు ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ కలశంతో స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షిణలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి పూజ, నందీశ్వరుడికి పూలదండ సమర్పించుకుని, స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అద్దాల మంటపంలో ఈవో దూస రాజేశ్వర్ స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందించి సత్కరించారు. -
రూ. 500 కోట్లతో గోదావరి పుష్కరాలు
వేములవాడ: గోదావరి పుష్కరాలను రూ. 500 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ దేవాదాయ, గృహనిర్మాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలసి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించగా, ఇతర శాఖల ద్వారా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా గోదావరినది ప్రవహిస్తున్న ప్రతిచోటా ప్రజలు పుష్కరాలను ఘనంగా జరుపుకునేందుకు వీలుగా భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు. వైద్యం, శాంతిభద్రతలు, స్నానఘట్టాలు, తాగునీరు, టాయిలెట్స్, రోడ్లు, శానిటేషన్, రవాణాలాంటి వసతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రూ. 21 కోట్లతో స్వామి వారి విమాన గోపురానికి బంగా రు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న రాజన్న సన్నిధిలో జరుపుకునే మహాశివరాత్రి జాతరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు భద్రాచలం మాదిరిగా జీవో జారీ చేస్తామన్నారు. -
అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు
సారంగాపూర్/దిలావర్పూర్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు ఆహారభద్రతా కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి చెంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున బియ్యం చొప్పున పంపిణీ చేశారని.. ఆరు కిలోలకు పెంచిందని అన్నారు. వార్షిక ఆదాయం రూ.60 వేలలోపు ఉన్న వారికి మాత్రమే రేషన్‌కార్డులు ఇచ్చారని, ప్రస్తుతం లక్ష, 50 వేలలోపు ఉన్నవారికి కూడా ఆహార భద్రతా కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పింఛన్లు పెంచామని పేర్కొన్నారు. వంటగ్యాస్ లేనివారికి త్వరలో దీపం పథకం కింద సిలిండర్లు మంజూరు చేసే యోచనలో ఉన్నామని అన్నారు. అలాగే రైతుల వ్యవసాయ ఇబ్బందులు తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం 40 వేల మోటార్లకు సోలార్ విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడి బొగ్గు, నీళ్లతో ఆంద్రోళ్లు తమ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక మనకు విద్యుత్ సమస్యలు వచ్చిపడ్డాయని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. కాకతీయ మిషన్ద్వారా చెరువుల్లో పూడికతీత, మరమ్మతు చేపడుతున్నామని చెప్పారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఆకనట్ట వెడల్పు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రూ.3 కోట్లతో గేట్ల మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) నుంచి వెంగ్వాపేట్ రోడ్డుకు రూ.3 కోట్ల 80 లక్షలు, బీరవెల్లి నుంచి దిలావర్పూర్ రోడ్డుకు రూ.2.44 లక్షలు, పెండల్దరి రోడ్డుకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పవార్ శెవంతాబాయి, ఆర్డీవో శివలింగయ్య, సర్పంచులు లక్ష్మి, గంగారెడ్డి, ఎల్లయ్య, రవి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్‌గౌడ్, ఎంపీడీవో శేఖర్, తహశీల్దార్ గంగాధర్, నిర్మల్ రూరల్ సీఐ పురుషోత్తం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి తనవంతు కృషిచేస్తానని మంత్రి ఐకే రెడ్డి పేర్కొన్నారు. స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్‌ఫైన్ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థులు చెప్పడంతో.. వెంటనే 50 బెంచీలు తయారు చేయించి ఇవ్వాలని డీఆర్వో జైపాల్‌రెడ్డిని ఆదేశించారు. పాఠశాల భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా తమకు కాంట్రాక్టర్ అప్పగించలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో.. మంత్రి వెంటనే ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. వెంటనే భవనాన్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలలలో సీఆర్టీలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి దిలావర్పూర్ : ఆహార భద్రత పథకంలో భాగంగా మండంలోని నర్సాపూర్(జి) గ్రామంలోనూ లబ్ధిదారులకు బియ్యం అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, నిర్మల్ ఎఫ్ఎస్సీఎస్ ైచె ర్మన్ రాంకిషన్రె డ్డి, బోథ్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్, సర్పంచ్ కోండ్రురేఖ రమేశ్, ఎంపీపీ పాల్దె లక్ష్మీశ్రీనివాస్, జెడ్పీటీసీ ఆమ్గోత్ సుజాత మెర్వాన్, ఎంపీటీసీలు లక్ష్మి, కవిత, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగా ఐకే రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఇంద్రకరణ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, తదితరులు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సచివాలయంలోని ఆయన చాంబర్లో బాధ్యత లు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇంద్రకరణ్‌రెడ్డికి చోటు దక్కిన విషయం విధితమే. ఈ మేరకు ఆయన ఈనెల 16న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డికి సహచర మంత్రి జోగు రామన్న పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఏనుగు సురేందర్‌రెడ్డి, పలువురు జిల్లా ముఖ్యనేతలు ఉన్నారు. -
పుష్కర శోభ
పుష్కర స్నానం పరమ పవిత్రం.. సర్వపాప హరణం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే భక్తులు పుష్కరాల వేళ నదిలో పవిత్ర స్నానమాచరించేం దుకు ఆసక్తి చూపుతారు. వచ్చే ఏడాది జూలై నెలలో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇందుకోసం గోదారి తీరంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుం డా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేస్తోంది. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఇప్పటికే జిల్లా నుంచి రూ.66 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిం చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కెఅగర్వాల్ సోమవారం జిల్లా ఉన్న తాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హరీష్‌రావు, కేటీఆర్ సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉప సంఘం పుష్క రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. 18 పుష్కర ఘాట్ల ఏర్పాటు గోదావరి పుష్కరాల కోసం గతంలో జిల్లాలో ఐదు ఘాట్లనే ఏర్పాటు చేశారు. ఈసారి కొత్త గా మరో 13 ఘాట్లు ఏర్పాటు చేయనున్నా రు. ఇందుకోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డి విజన్ల పరిధిలోనే పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు పనులను కూడా ప్రారంభించారు. మోర్తాడ్ మండలం తడ్‌పాకల, దోంచంద, గుమ్మిర్యాల, బా ల్కొండ మండలం సావెల్, నందిపేట మండ లం ఉమ్మెడలో గతంలో పుష్కరాలు నిర్వహించారు. ఆర్మూరు మండలం కో మన్పల్లి, నందిపేట మండలం వన్నెల్ (కె), చిన్నయానం, రెంజల్ మండలం కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం నవీపే ట మండలం కోస్లి, బినోల, తుంగిని, యంచ, నాలేశ్వర్ తదితర ప్రాంతాలలో ను భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణ ప నులు పారదర్శకంగా జరిగేలా చూడాల ని చీఫ్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటీకే సీ ఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లతో హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుష్కరఘాట్ల ఏర్పాటుపై కలెక్టర్‌తో సమీక్షిం చారు. 20 రోజుల వ్యవధిలో చీఫ్ సెక్రెటరీ, సాంస్కృతిక సలహాదారు మూడు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదు ప్రాంతాలకే పరిమితమైన పుష్కర వేడుకలను 11 ప్రాంతాలు, 18 పుష్కరఘాట్లకు విస్తరించారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు నీటిపారుదల, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై పుష్కర ఘాట్లలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనపై సమీక్ష జరిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప ని చేస్తున్న అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరఘాట్ల మరమ్మతులు, నిర్మాణం, రోడ్డు, రవాణా సౌకర్యం, తాగునీటి వసతి, భక్తులు దుస్తులు మా ర్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి సా రించారు. వైద్య శిబిరాలు, పారిశుధ్య పనులు, పార్కింగ్ స్థలాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర పనుల కోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు వేసే విషయమై కూడా చర్చిం చారు. పుష్కరాల సమయంలో ప్రభు త్వ అతిధి గృహాలన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. ఏర్పాట్లన్నీ సజావుగా సాగేలా వారు చర్యలు తీసుఉంటున్నారు. -
అమాత్య అల్లోల ...
ఆదిలాబాద్ :రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపుల్లో భాగంగా ఆయనకు న్యాయ, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. దీంతో ఆయన అనుచరవర్గంలో హర్షం వ్యక్తమైంది. నిర్మల్, సిర్పూ ర్ నియోజకవర్గాలతోపాటు, పలుచోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలాయి. ఐకే రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఆయన వృత్తికి తగినట్లు గానే ఆయనకు న్యాయశాఖ దక్కింది. అలాగే గృహ నిర్మాణ శాఖ కూడా కేటాయించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నకు బాధ్యతలు పెరిగాయి. అదనంగా బీసీ సంక్షేమ శాఖను ఆయనకు కేటాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యం మరింత దక్కిం ది. రామన్నకు బీసీ సంక్షేమశాఖ కేటాయించడం పట్ల జిల్లాలోని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రేఖానాయక్ వర్గీయుల్లో ఆసంతృప్తి.. మంత్రివర్గ కూర్పులో జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలకు చుక్కెదురు కావడంతో అంతర్గతంగా అసంతృప్తులు రగులుతున్నాయి. మహిళా కోటాలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితోపాటు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ ఈ పదవులు ఆశించారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కగా, రేఖ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవ లక్ష్మికి పార్లమెంటరీ సెక్రటరీ పదవి దక్కడంపై ఆమె వైఖరి ఎలా ఉన్నా, ఆదివాసీ సంఘాలు మాత్రం భగ్గుమంటున్నాయి. ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు ఇంద్రవెల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని జోడేఘాట్‌కు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నలుగురికి కేబినెట్ హోదా.. ఉమ్మడి రాష్ట్రంలో పదవుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం జరుగ గా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి నేతలకు ముఖ్యమైన పదవులు వరిస్తున్నాయి. 1984 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ జెడ్పీ చైర్మన్‌గా, ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కలగానే మిగిలింది. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో ఆయన చిరకాల వాంఛ నెరవేరినట్లయ్యింది. ఇంద్రకరణ్‌రెడ్డితో కేబినెట్ హోదా కలిగిన నేతల సంఖ్య జిల్లాలో నాలుగుకు చేరింది. మంత్రి జోగు రామన్న ఇప్పటికే కేబినెట్ మంత్రిగా కొనసాగుతుండగా, ప్రభుత్వ విప్‌గా నియమితులైన చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా కే బినెట్ హోదా ఉంది. పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి మాత్రం సహా య మంత్రి హోదాలో కొనసాగనున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధిగా ఉన్న వేణుగోపాలచారి కూడా కేబినేట్ హోదాలోనే ఉన్నారు. -
ఆదిలాబాద్‌పై ‘ఐకే’ మార్క్..?
నేతల మధ్య సమన్వయం కుదిరేనా.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: సీనియర్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కడంతో ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, టీడీపీల్లో కూడా జిల్లావ్యాప్తంగా అనుచర వర్గం ఉండటం పార్టీ బలోపేతానికి కలిసొచ్చే అంశం కాగా, ఇదే తరుణంలో రానున్న రోజుల్లో సొంత పార్టీలో ఆయన ఆధిపత్యం పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు రానున్న రోజుల్లో రచ్చకెక్కే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా ఉంది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జోగు రామన్న ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అటవీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రామన్నకు వివాదరహితునిగా పేరుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ విభేదాలకు, వివాదాలకు తావులేకుండా వ్యవహరించారనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీల విమర్శలను గట్టిగా ఎండగట్టడంలో విఫలమయ్యారనే అభిప్రాయం కూడా నెలకొంది. ఎన్నికల ముందు వరకు ఇంద్రకరణ్‌రెడ్డి తటస్థంగా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన, తన ప్రధాన అనుచరుడు కోనేరు కోనప్పలు బీఎస్పీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి.. సొంత చరిష్మతో విజయం సాధించారు. తర్వాత కోనప్పతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి ఆ పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్లోకి తీసుకురావడంలో ఐకేరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈ ఆరు నెలల్లోనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది జిల్లాలో ప్రత్యేక వర్గంగా ముద్రపడింది. కాంగ్రెస్‌కు చెక్..? ఇంద్రకరణ్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ఇప్పటికీ అనుచరులు ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో సంబంధాలున్నాయి. ఒకరిద్దరు నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో కాంగ్రెస్‌లోని ఆయన అనుచరులు కొందరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమన్వయం లేకపోతే సమస్యే.. జిల్లాలో రానున్న రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం ప్రధాన సమస్యగా మారనుంది. ఐకే రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్‌లో ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు నాలుగు వర్గాలుగా విడిపోయాయి. ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్, గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన శ్రీహరిరావు వర్గాలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి వేణుగోపాల చారి కూడా నిర్మల్‌లో తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతుండటంతో ఇక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో జిల్లాలో కొనసాగే అవకాశం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. -
20 ఏళ్లుగా దోబూచులాడిన మంత్రి పదవి..
హైదరాబాద్ : నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న పదవి రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయన ఎట్టకేలకు కారెక్కారు. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. 20 ఏళ్లుగా దోబూచులాడిన మంత్రి పదవి ఇంద్రకర్ రెడ్డికి దక్కింది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గం :ఆదిలాబాదు వ్యక్తిగత వివరాలు పుట్టిన తేదీ:16 ఫిబ్రవరి 1949 స్వస్థలం : నిర్మల్ మండలం ఎల్లపల్లి తండ్రి : తండ్రి నారాయణరెడ్డి భాగస్వామి: విజయలక్ష్మి విద్యార్హత : ఎల్ఎల్బి -
బెర్త్ ఖరారు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లాకు మరో బెర్తు దక్కింది. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. కొత్తగా ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇందులో ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్లమెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మంత్రి పదవి రేసులో జిల్లాకు చెందిన ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అనుకున్నట్లుగానే వారికి పదవులు దక్కాయి. ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరుతోంది. మంగళవారం ఆయన రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ రాష్ట్ర సర్కారు తొలి మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఒక్కరికే చోటు దక్కింది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన తెగకు చెందిన కోవ లక్ష్మికి పదవి ఇవ్వడం ద్వారా గోండు వంటి ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చారనే భావన వ్యక్తమవుతోంది. తొలిసారిగా ఎమ్మెల్యే విజయం సాధించినా ఆమెకు ఈ పదవి దక్కింది. మంత్రి వర్గంలో చోటు ఖరారైన సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డితో కలిసి ఆయన సీఎంకుకృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు అనుచరవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు. -
టీఆర్ఎస్ గాలం?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలను పార్టీలో చేర్చుకునే అంశంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. టీఆర్ఎస్కు అనుబంధ సభ్యులుగా కొనసాగేందుకు ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే సుముఖంగా ఉన్నప్పటికీ, ఏకంగా పార్టీలోనే చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జిల్లాలో పార్టీ కీలక నేత జోగు రామన్నకు ఈ బాధ్యతలు అప్పగించిన ట్లు తెలుస్తోంది. ఆయన ఈ ఇద్దరు సభ్యులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, అధినేత కేసీఆర్ మాత్రం కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు పొందిన టీఆర్ఎస్ ఈ ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను ఏకంగా పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న పక్షంలో స్థానికంగా అసంతృప్తులను సర్ది చెప్పాలనే యోచ నలో అధినాయకత్వం ఉంది. ఈ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని నియోజకవర్గ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేల తర్జనభర్జన పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగాలా? టీఆర్ఎస్లో చేరే అంశంపై బీఎస్పీ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీ మారిన పక్షంలో అనర్హత వేటు.. వంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అనుబంధ సభ్యులుగా ఉంటూ.. రానున్న రోజుల్లో ఉండే రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో ఈ ఇద్దరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం మంత్రి పదవి ఆశిస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. సర్కారులో బెర్తు దక్కిన పక్షంలో పార్టీలో చేరడం ఖాయమనినే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. వీరు బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ, తమ వ్యక్తిగత చరిష్మాతోనే విజయం సాధించారు. అలాగే కోనప్ప కూడా ప్రాదేశిక ఎన్నికల్లో తమ అనుచరులను బరిలోకి దింపి, నియోజకవర్గంలో రెండు మండలాల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకున్నారు. పార్టీ మారే విషయమై ఈ నేతలను సంప్రదించగా ఇప్పటి వరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ మిత్రపక్షంగా బీఎస్పీ?
ఆదిలాబాద్: తెలంగాణలో ఖాతా తెరిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీఎస్పీ ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కోనేరు కోనప్ప (సిర్పూర్) గురువారం కేఆర్ఎస్ను కలిసి తమ మద్దతు ప్రకటించనున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ ఎమ్మెల్యేలిద్దరు విజయం సాధించిన విషయం విధితమే. ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే స్థాయిలో బీఎస్పీ జిల్లాలో బలంగా లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించారు. కాగా, సర్కారు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టీఆర్ఎస్కు ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎంఐఎం మద్దతు కోరుతోంది. అలాగే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా ఉండాలని యోచిస్తుండటం గమనార్హం. మరోవైపు నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోంది. ఇంద్రకరణ్‌రెడ్డి తన అనుచరులను బీఎస్పీ తరపున బరిలోకి దించిన విషయం విదితమే. -
పదవి కోసమే పార్టీల మార్పు
నిర్మల్, న్యూస్‌లైన్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) పదవి కోసమే పార్టీలు మారుతున్నారే గానీ బీఎస్పీపైనో.. దళితులపై ప్రేమతోనే కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అల్లూరి మల్లారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ ట్యాంకుబండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకే రెడ్డి తన అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా బీఎస్పీ తరఫున పోటీ చేయించి ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్, టీఆర్ఎస్ టిక్కెట్టు కోసం తిరిగిన విషయం ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే బీఎస్పీలో చేరారని విమర్శించారు. దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీనిచ్చి మాట మార్చిన టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని దళితులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. దళితులు వైఎస్సార్సీపీకి మద్దతునివ్వాలని కోరారు. ఆయన హయాంలోనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందంటే అంబేద్కరే కారణమని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంటు, ముస్లింకు నాలుగు శాతం రిజర్వేషన్లు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలెన్నో పేదల కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఆ భారం మహిళలపై పడకుండా చూశారని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల్లో ఎవరు ప్రజోపయోగ పనులు చేపట్టారని ఇటీవల సర్వే చేస్తే 56శాతం మంది తెలంగాణ ప్రజలు వైఎస్సార్ పేరు చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నిగులపు లింగన్న, జుబేర్, అర్షద్, ప్రజ్యోత్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుగుబావుటా..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనతో అసంతృప్తులు భగ్గుమన్నారు. జాబితాలో చోటు దక్కని కాంగ్రెస్ నాయకులు స్వతంత్రులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలోని పలు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. పక్షం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కానీ ఆయనకు అధిష్టానం మొండిచేయి చూపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేరునే అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మాదిరిగానే బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంతోపాటు, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు తన అనుచరులను బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు నిర్మల్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సిర్పూర్ నుంచి ఐకేరెడ్డి అనుచరుడు కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి పోటీ చేయనున్నారు. ఈనెల 9న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో టిక్కెట్ రాకుండా భంగపడిన నాయకులతో ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దింపేందుకు ఐకే రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షులు సి.రాంచంద్రారెడ్డి టిక్కెట్ ఆశించారు. కాని అనూహ్యంగా యువజన కాంగ్రెస్ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండే పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సి.రాంచంద్రారెడ్డికి నిరాశే మిగిలింది. స్వతంత్రంగా పోటీ చేయాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు గుమిగూడారు. బీసీ కోటాలో టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న పీసీసీ కార్యదర్శి సుజాతకు కూడా చుక్కెదురు కావడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జాబితాలో ఒక్క బీసీ నేతకు అవకాశం ఇవ్వక పోవడాన్ని బీసీలందరు తీవ్రంగా పరిగణిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ముథోల్ టిక్కెట్ కోసం అనేక ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు కూడా ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో మంగళవారం తన అనుచరులతో సమావేశమవుతానని ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని పటేల్ పేర్కొన్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టిక్కెట్ దక్కని నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోన్లు చేసి బుజ్జగించినట్లు సమాచారం.