మెడికల్‌ అన్‌ఫిట్‌ ద్వారా ‘వారసత్వం’ | Minister Indrakaran Reddy Exclusive Interview | Sakshi
Sakshi News home page

మెడికల్‌ అన్‌ఫిట్‌ ద్వారా ‘వారసత్వం’

Published Thu, Sep 28 2017 12:56 PM | Last Updated on Thu, Sep 28 2017 12:56 PM

Minister Indrakaran Reddy Exclusive Interview

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌ , మంచిర్యాల : ‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో కార్మికులు తమ పిల్లల భవిష్యత్తు మీద బెంగ పెట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాం. ఈసారి టీజీబీకేఎస్‌ను గెలిపిస్తే మెడికల్‌ అన్‌ఫిట్‌ ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తాం’ అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గత మూడు రోజులుగా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని బుధవారం ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.

సాక్షి: టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ తరఫున మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్మికుల మనోగతం ఎలా ఉంది?
ఐకే రెడ్డి: సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో జాతీయ సంఘాలు కొన్ని తప్పుడు ప్రచారం చేశాయి. దాంతో కార్మికుల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులకు వివరించి చెప్పడంతో వాస్తవాలను తెలుసుకున్నారు. కేసీఆర్‌ మాత్రమే వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని నమ్ముతున్నారు. సింగరేణిలో గెలిచేది మా సంఘమే.

సాక్షి:టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించనందుకే వారసత్వ ఉద్యోగాలు రాకుండా పోయాయని జాతీయ సంఘాలు చెపుతున్నాయి. దీనిపై మీ స్పందన?
ఐకే రెడ్డి: చంద్రబాబు రద్దు చేసిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్‌ గత సంవత్సరం పునరుద్ధరించడంతో సింగరేణి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టుకు వెళితే ఉద్యోగాల్లో వారసత్వం ఉండదని కొట్టేసింది. ఈ విషయం మీద ఏకంగా సింగరేణి సంస్థనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీనిని బట్టి కార్మికులు గమనించాల్సింది ఏమిటంటే... వారసత్వ ఉద్యోగాలపై టీఆర్‌ఎస్‌కు మాత్రమే చిత్తశుద్ధి ఉందని.

సాక్షి: పోరాటం ద్వారానే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించుకోవచ్చని జాతీయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని కార్మికులు విశ్వసించరా?
ఐకే రెడ్డి: టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌తో తప్ప జాతీయ సంఘాలతో కార్మికుల వారసత్వం కల నెరవేరదు. ఎందుకంటే చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించిందే ఈ జాతీయ సంఘాలు. వారసత్వం అవకాశాన్ని దెబ్బతీసిన టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్‌టీయూసీతో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాయి. ఈ అపవిత్ర పొత్తుతోనే వారి ఉద్దేశం తెలుస్తుంది. ఎప్పుడూ కలవని మూడు సంఘాలు ఒకటవడం వెనుక ఏదో కుట్ర ఉందని కార్మికులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతో కేసీఆర్‌ను అప్రదిష్టపాలు చేయాలనే ‘వారసత్వాన్ని’ రద్దు చేసిన ఈ మూడు సంఘాలు ఒకటయ్యాయి. అలాగే సింగరేణిలో టీబీజీకేఎస్‌ కార్మికుల 22 డిమాండ్లను సాధిస్తే, గతంలో గుర్తిపుం సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ 14 డిమాండ్లను కాలరాశాయి. ఈ సంఘాలను నమ్మకనే అందులో పనిచేస్తున్న నాయకులు టీబీజీకేఎస్‌లో చేరుతున్నారు.

సాక్షి:టీబీజీకేఎస్‌ గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన ‘వారసత్వాన్ని’ పునరుద్ధరించే అవకాశం ఉందా? న్యాయశాఖ మంత్రిగా మీరు స్పష్టత ఇవ్వగలరా?
ఐకే రెడ్డి: బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా వస్తాయి. 15 ఆరోగ్య సంబంధ వ్యాధులలో ఏ ఒక్కదానికి కార్మికుడు గురైనా కష్టమైన బొగ్గు పని చేయలేడు కాబట్టి, అతడు సూచించిన వారసుడికి సింగరేణిలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం. భూగర్భం నుంచి బొగ్గును వెలికితీస్తూ జాతికి సంపదను సృష్టిస్తున్న కార్మికుడికి తగిన న్యాయం చేసేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు మెడికల్‌ గ్రౌండ్‌ మీద వారసత్వ ఉద్యోగం కల్పిస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

సాక్షి:సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారనే ప్రచారం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో నిజమెంత?
ఐకే రెడ్డి: సింగరేణి తెలంగాణకు గుండెకాయ వంటిది. ఈ కంపెనీని కన్నతల్లిగా కేసీఆర్‌ భావిస్తారు. సింగరేణిలో పనిచేసే కార్మికులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తారు. అలాంటి సింగరేణిని ప్రైవేటుపరం చేయబోతున్నారనే అసత్యాన్ని జాతీయ సంఘాల పేరుతో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ వంటి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఏటా రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలే రాష్ట్రంలోని పరిశ్రమలను ప్రైవేటుపరం చేసిందనే విషయాన్ని వివరించి చెప్పడంతో కార్మికులు వాస్తవాలను గుర్తిస్తున్నారు. కేసీఆర్‌ ఏ సంస్థను కూడా ప్రైవేటుపరం చేయబోరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement