మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి ఐకేరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే చిన్నయ్య
సాక్షి,బెల్లంపల్లి ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం పునరుద్ధరణకు కంకణం కట్టుకుని కార్మికుల ఆశలు నెరవేర్చామన్నారు. త్వరలోనే ఎస్పీఎం ప్రారంభమవుతుందన్నారు. కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6.50 కోట్ల రాయితీని కంపెనీకి చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మిల్లు పున:ప్రారంభానికి మార్గం సుగమమైందన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ప్రకృతి కూడా విస్తారంగా వర్షాలను కురిపిస్తోందన్నారు. ఇందుకు ప్రజలు భక్తితో బోనాలు సమర్పించుకుంటున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎమ్మెల్యేల చేతుల్లో డీఎంఎఫ్‌టీ నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్ దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, మహిళ,శిశు సంక్షేమశాఖ రెండు జిల్లాల కోఆర్డినేటర్ అత్తి సరోజ, ఎంపీపీ సుభాష్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment