
నిర్మల్: ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన తర్వాత గవర్నర్ తమిళిసై వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకనుంచి నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ ఆయన హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసనల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం నల్లజెండా ఎగరేసి, బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉగాది రోజు తాను యాదాద్రికి వస్తున్నానని 20నిమిషాల ముందు ఫోన్ చేసి చెప్పారన్నారు. అంత తక్కువ సమయంలో ఏర్పాట్లెలా చేస్తారని ప్రశ్నించారు. పది గంటల ముందు చెబితే ప్రొటోకాల్ ప్రకారం గౌరవించే వాళ్లమన్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని, ఆమె మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశాక నాటి గవర్నర్ రాంలాల్ ప్రజాగ్రహాన్ని చవిచూసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గవర్నర్‌గా నరసింహన్ రాష్ట్రాన్ని ప్రోత్సహించారని ఇంద్రకరణ్ గుర్తుచేశారు.