సాక్షి, ఆదిలాబాద్: ప్రతిపక్షం కయ్యానికి కాలు దువ్వడంతో అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎండగట్టాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతాం అని ఇలా ఒకరికొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీదా తొలి జెడ్పీ సర్వసభ్య సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్షాన్ని ప్రశ్నలు సంధించకుండా అధికార పక్షం దాటవేసే ధోరణి అవలంబించింది. ఏదేమైనా జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే గొంతు ప్రతిపక్ష రూపంలో కనిపించగా.. ఎదురు దాడి ద్వారా పైచేయి ఎలా సాధించాలో అధికార పక్షం నిరూపించింది.
తొలి సమావేశం..
ఆదిలాబాద్ జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కిషన్, జేసీ సంధ్యారాణి వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, రేఖానాయక్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు.
సోయం వర్సెస్ జోగు
జెడ్పీలో చైర్మన్‌తో కలుపుకొని తొమ్మిది మంది జెడ్పీటీసీలు ఉన్న టీఆర్‌ఎస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి పాల్గొనడంతో అధికార పక్షం బలంగా కనిపించింది. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ ఐదుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షం ముఖ్యం గా బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండటం తో ఆయన సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడం ద్వారా తొలి సమావేశంలోనే ఇరుకున పెట్టే అవకాశం ఉందని గ్రహించిన అధి కార పక్షం కేంద్ర ప్రభుత్వం పథకాల్లో లోపాలను ప్రస్తావించడం ద్వారా వ్యూహాత్మకంగా దాడికి దిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూపడంలో ఇటు బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు, టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్ సమ్మాన్ ద్వారా జిల్లాలోని 87 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినా సాయం కింద అందజేయాల్సిన రూ.6వేలను ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయశాఖ అధికారులను అడగడం ద్వారా పరోక్షంగా ఎంపీ సోయం బాపురావును ఈ విషయంలో ప్రశ్నించారు. కేవలం 47 వేల మంది రైతులకే రూ.2వేల చొప్పు న ఇచ్చారని జోగు రామన్న చెప్పుకొచ్చారు. అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.. రెండో విడత వస్తుందా, రాదా.. మొదటి విడత అందరికీ అందుతుందా.. అంటూ అడిగారు. కేంద్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణ పరిమితి పెంచినా ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో చేను ఉన్న రైతుకు కూడా రూ.1.50లక్షల్లోపే రుణం అందిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం దేనికంటూ దెబ్బిపొడిచారు. జిల్లాలో కిసాన్ సమ్మాన్ పరిస్థితిపై రిపోర్టు తయారు చేసి కేంద్రాన్ని అడగాలని, ఎంపీ సోయం బాపురావుకు ఈ రిపోర్టును ఇవ్వడం ద్వారా అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి, లేనిపక్షంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ పరోక్షంగా సోయంను కోరారు.
జెడ్పీ అధికార పక్షం దాడిని పసిగట్టిన ఎంపీ సోయం బాపురావు ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం«ధు పథకం కింద జిల్లాలో ఎంత మంది రైతులను గుర్తించారు, ఎంత మందికి సాయం అందాలి అంటూ వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. 1,36,409 మంది రైతులకు గాను 90,150 మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందజేసినట్లు అధికారులు చెప్పారు. అయితే పెట్టుబడికి అందజేయాల్సిన సాయం పంట చేతికొచ్చే సమయంలో అందజేయడం ఏమిటని సోయం ఎద్దేవా చేశారు. ప్రస్తావనలో సామెతగా.. పదో తరగతి పిల్లాడికి పరీక్షలు అయిపోయిన తర్వాత పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందని దెబ్బిపొడిచారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య వాడీవేడిగా సాగింది.
2018 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇన్ని రోజులైనా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కలేదని వాపోతూ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించి రైతులకు ప్రయోజనం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై సోయం బాపురావు మరో రకంగా స్పందించారు. 2018 డిసెంబర్‌లో నేను ఎంపీగా లేనని, టీఆర్‌ఎస్‌కే చెందిన గోడం నగేశ్ ఉన్నారని, అప్పుడు మీరెందుకు ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంత నవ్వులు పూసాయి.
అయితే అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండటం, మళ్లీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయనే ఉండడంతో ఎమ్మెల్యే జోగు రామన్న ఆ విధంగా ప్రశ్నించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ సోయం బాపురావుతో విషయం తమవైపు సాగేలా ప్రయత్నం చేశారు. సోయం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు రావాల్సిన సాయం అందేలా చూస్తానన్నారు. అదే సందర్భంలో జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారని సోయం బాపురావు వ్యవసాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
ఆదిలోనే..
సమావేశం ఆది నుంచే ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షంపై గురి పెట్టారు. జెడ్పీ సమావేశంలో 42 అంశాలకు సంబంధించి మొదటి అంశంగా విద్యాశాఖతో ప్రారంభమైంది. డీఈవో రవీందర్‌రెడ్డి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి చేపడుతున్న అంశాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ తన మండలంలో అనేక పాఠశాలల భవనాలకు పెచ్చులు ఊడిపోయాయని, సరిపడ టాయిలెట్లు లేవని, బాలికలు చదువుకునే పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆదర్శ పాఠశాలలని చెప్పుకోవడమే తప్పా పశువుల కొట్టం మాదిరి ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.
దీంతో మంత్రి ఐకే రెడ్డి అన్ని అంశాలపై సభ్యులందరు మాట్లాడేది ఉందంటూ సమస్యను తక్కువ సమయంలో ప్రస్తావించాలని గణేశ్‌రెడ్డితో అన్నారు. తాను మాట్లాడి నాలుగైదు నిమిషాలు కూడా కాలేదని, మమ్మల్ని ఆపకండి.. కరెక్ట్ కాదు.. సభ్యులు చెప్పేది వినే ఓపిక ఉండాలంటూ గణేశ్ రెడ్డి మంత్రిపై మాటలతో ఎదురుదాడికి దిగారు. మంత్రి, కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా వెనక నుంచి బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గణేశ్ రెడ్డిని.. చెప్పింది చాలు.. కూర్చో అంటూ సంబోధించారు. కొంతమంది టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తుల శ్రీనుకు వెన్నంటి నిలిచారు. దీంతో చిర్రెత్తిన గణేశ్‌రెడ్డి నువ్వే కూర్చో అంటూ ఆగ్రహంగా ఊగిపోవడంతో సమావేశంలో వాడీవేడి కనిపించింది. ఇలా పలు సందర్భాల్లో అధికార టీఆర్‌ఎస్ సభ్యులు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
ఎజెండా అంశాలు..
జెడ్పీ సమావేశం ఎజెండాలో 42 అంశాలు ఉండగా, ఓ సందర్భంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సమావేశం కావడంతో సభ్యులందరు మాట్లాడాలని, ఈ దృష్ట్యా అందరికీ అవకాశం రావాలి అంటూ పరోక్షంగా తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గణేశ్ రెడ్డితో అన్నప్పుడు ఆయన తాము క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. సమావేశ ఎజెండా అంశాలకు సమయం సరిపోకపోతే రెండు రోజులు నిర్వహించాలంటూ అధికార పక్షాన్ని ఎండగట్టారు. మొత్తం మీదా మొదట సమావేశం ప్రారంభం కాగానే సభ్యులను సన్మానించారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని సన్మానించారు. ఆ తర్వాత ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ప్రకటించారు. మంత్రి, జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. తదనంతరం ఎజెండా అంశాలతో సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి సమావేశాన్ని నామమాత్రంగా ముగించాలనుకున్న అధికార పక్షానికి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షం ఉంది అనేలా సమావేశం సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి సెషన్, తిరిగి 2.30 గంటల నుంచి సాయంత్రం వరకు రెండో సెషన్‌గా ఎజెండా అంశాల ప్రస్తావనతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment