ఒక సీటు కోసం ఒకే పార్టీలోని ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటే కొట్లాట తప్పదు. ఇప్పుడు ఆదివాసీల జిల్లాలోని కమలం పార్టీలో ఇదే జరుగుతోంది. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీలో కుస్తీపట్లు మొదలయ్యాయి. ఆదివాసీ ఎంపీ, గిరిజన నేతల మధ్య ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కమలం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగ వివాదం అటు జిల్లాలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఎంపీకి కేటాయించిన నిధుల వినియోగంపై బీజేపీ ప్రజా ప్రతినిధులతో సోయం బాపురావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిదులు ఇంటి నిర్మాణం కోసం, కొడుకు పెళ్లి కోసం వాడుకున్నట్లు చెప్పారు. ఆ వీడియో బయటకి వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిధుల వాడకంపై ఎంపీ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసాయి.
నిధుల దుర్వినియోగం పై ఎంపీ సోయం బాపురావు స్పందించారు. తాను ల్యాడ్స్ నిధులు వాడుకోలేదన్నారు.. ఇల్లు నిర్మాణం, కొడుకు పెళ్లి కోసం అణా పైసా వాడుకోలేదని స్పష్టం చేశారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ చెప్పారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తనమీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే వారిద్దరికీ గిట్టడంలేదని విమర్శించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తాను ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నానని, అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను బీజేపీ నుంచి సాగనంపడానికి ఇదంతా చేస్తున్నారని ఎంపీ సోయం అన్నారు. అదే విధంగా తన ఎంపీ సీటుకు కూడా ఎసరు పెట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మధ్య విభేదాలకు చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఖానాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి రమేష్ రాథోడ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు. కాని అక్కడి నుంచి రమేష్ రాథోడ్ కాకుండా జడ్పీటీసీ జానుబాయి, హరి నాయక్లకు ఎంపీ సోయం మద్దతిస్తున్నారని సమాచారం. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి.
చదవండి: వేధింపుల ఎపిసోడ్.. సర్పంచ్ నవ్యకు నోటీసులు
చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయట. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సీటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ సుహసిని రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా ఎంపీ బాపురావు జిల్లా అధ్యక్షుడికి మద్దతివ్వడంలేదట. వీరిద్దరి మధ్యా గతంలో ఒక భూ వివాదం కూడా చోటు చేసుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయంటున్నారు.
అయితే ఎంపీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పందించారు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఎంపీకి తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దమన్నారు రమేష్ రాథోడ్. జిల్లాలో పార్టీ ఎంపీ, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగితే ఫైనల్‌గా నష్టపోయేది పార్టీయేనని అక్కడి కాషాయ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల మధ్య విభేదాలు తొలగించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment