ఆ సంఘం ఓ వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒకసారి ఎమ్మెల్యేను చేసింది. మరోసారి ఎంపీని చేసింది. ఎంపీ కాగానే రాజకీయ జన్మనిచ్చిన సంఘాన్ని వదిలేశారాయన. జనానికి దూరమై రాజకీయంగా బలహీనమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగింది. మళ్లీ తనకు జీవితాన్నిచ్చిన సంఘానికి సారథ్యం వహించాలని అనుకుంటున్నారు. ఆదివాసీలకు దగ్గర కావాలంటే ఆ సంఘం నాయకత్వం ఎంత అవసరమో గ్రహించారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆ సంఘం సంగతేంటి?
ఉద్యమం నుంచి ఢిల్లీ దాకా
తెలంగాణలో అణగారిన వర్గంగా ఉన్న గోండు తెగ ఆదివాసీల్లో చైతన్యాన్ని రగిల్చిన సంస్థ తుడుం దెబ్బ. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు గుర్తింపు లభించింది. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరపున విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం వరకు తుడుం దెబ్బకు నాయకత్వం వహించిన సోయం బాపూరావు.. ఎంపీ బాధ్యతల కారణంగా సంఘం నాయకత్వాన్ని వదులుకున్నారు. ఉద్యమ సారథిగా ఉన్న కాలంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం నడిపారు. ఆదివాసీల హక్కుల కోసం బలమైన ఉద్యమం నిర్మించడం ద్వారానే నాయకుడిగా గుర్తింపు పొందారాయన.
మమ్మల్ని దూరం పెడతారా?
ఆదివాసీల మద్దతుతోనే పార్లమెంట్‌లో అడుగు పెట్టిన సోయం బాపూరావు.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు. పోరాటం అగిపోయింది. సంఘం బాధ్యతల నుంచి కూడా ఏడాదిన్నర క్రితం తప్పుకున్నారు. తాము నమ్మి ఎంపీనీ చేసిన నాయకుడు ఉద్యమం నుండి వైదొలగడం అదివాసీలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఎంపీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఖరితోనే ఉద్యమ కాలంలో బాపూరావు వెన్నంటి ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను వీడిపోయారట. ఏడాదిరన్నరలోగానే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆదివాసీలు దూరం కావడంతో.. ఎంపీకి జ్ఞానోదయం కలిగిందంటున్నారు. ఆదివాసీలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలిందట.
మీ మాట వింట.. మీ వెంట ఉంటా.!
పరిస్థితి అర్థం కావడంతో ఎంపీకి దడ మొదలైందట. గతంలో ఒక పిలుపునిస్తే చాలు... వేలాదిగా రోడ్ల మీదకు వచ్చేవారు. వారి వల్లే ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన తాను.. ఇప్పుడు ఓడి పోవడం ఖాయమనే భయం మొదలైందట. దీంతో మళ్ళీ తన సామాజిక వర్గమైన ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందులో భాగంగానే తుడుం దెబ్బ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా తిరిగి పదవి దక్కించుకోవడానికి సోయం బాపూరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు పదవి అప్పగిస్తే చాలు అదివాసీల హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారట.
ఆదిలాబాద్ ఎంపీ గోండులకు దగ్గర కావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. తుడుం దెబ్బ బాధ్యతలను తిరిగి బాపూరావుకు అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సోయం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో... ఆదివాసీలు మద్దతు ఎంతవరకు కూడగడతారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment