Jogu Ramana
-
ఆదిలాబాద్‌లో ఢీ అంటే ఢీ
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిపక్షం కయ్యానికి కాలు దువ్వడంతో అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎండగట్టాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతాం అని ఇలా ఒకరికొకరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీదా తొలి జెడ్పీ సర్వసభ్య సమావేశం గతానికి భిన్నంగా వాడీవేడిగా జరిగింది. ప్రతిపక్షాన్ని ప్రశ్నలు సంధించకుండా అధికార పక్షం దాటవేసే ధోరణి అవలంబించింది. ఏదేమైనా జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే గొంతు ప్రతిపక్ష రూపంలో కనిపించగా.. ఎదురు దాడి ద్వారా పైచేయి ఎలా సాధించాలో అధికార పక్షం నిరూపించింది. తొలి సమావేశం.. ఆదిలాబాద్ జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కిషన్, జేసీ సంధ్యారాణి వేదికపై ఆసీనులయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, రేఖానాయక్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. సోయం వర్సెస్ జోగు జెడ్పీలో చైర్మన్‌తో కలుపుకొని తొమ్మిది మంది జెడ్పీటీసీలు ఉన్న టీఆర్ఎస్కు నలుగురు ఎమ్మెల్యేలు, మంత్రి పాల్గొనడంతో అధికార పక్షం బలంగా కనిపించింది. ఇక బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ ఐదుగురు సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షం ముఖ్యం గా బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండటం తో ఆయన సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడం ద్వారా తొలి సమావేశంలోనే ఇరుకున పెట్టే అవకాశం ఉందని గ్రహించిన అధి కార పక్షం కేంద్ర ప్రభుత్వం పథకాల్లో లోపాలను ప్రస్తావించడం ద్వారా వ్యూహాత్మకంగా దాడికి దిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తి చూపడంలో ఇటు బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు, టీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్ సమ్మాన్ ద్వారా జిల్లాలోని 87 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినా సాయం కింద అందజేయాల్సిన రూ.6వేలను ఎంతమందికి ఇచ్చారని ఎమ్మెల్యే జోగు రామన్న వ్యవసాయశాఖ అధికారులను అడగడం ద్వారా పరోక్షంగా ఎంపీ సోయం బాపురావును ఈ విషయంలో ప్రశ్నించారు. కేవలం 47 వేల మంది రైతులకే రూ.2వేల చొప్పు న ఇచ్చారని జోగు రామన్న చెప్పుకొచ్చారు. అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు.. రెండో విడత వస్తుందా, రాదా.. మొదటి విడత అందరికీ అందుతుందా.. అంటూ అడిగారు. కేంద్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణ పరిమితి పెంచినా ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో చేను ఉన్న రైతుకు కూడా రూ.1.50లక్షల్లోపే రుణం అందిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం దేనికంటూ దెబ్బిపొడిచారు. జిల్లాలో కిసాన్ సమ్మాన్ పరిస్థితిపై రిపోర్టు తయారు చేసి కేంద్రాన్ని అడగాలని, ఎంపీ సోయం బాపురావుకు ఈ రిపోర్టును ఇవ్వడం ద్వారా అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి, లేనిపక్షంలో వ్యవసాయశాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ పరోక్షంగా సోయంను కోరారు. జెడ్పీ అధికార పక్షం దాడిని పసిగట్టిన ఎంపీ సోయం బాపురావు ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబం«ధు పథకం కింద జిల్లాలో ఎంత మంది రైతులను గుర్తించారు, ఎంత మందికి సాయం అందాలి అంటూ వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నించారు. 1,36,409 మంది రైతులకు గాను 90,150 మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందజేసినట్లు అధికారులు చెప్పారు. అయితే పెట్టుబడికి అందజేయాల్సిన సాయం పంట చేతికొచ్చే సమయంలో అందజేయడం ఏమిటని సోయం ఎద్దేవా చేశారు. ప్రస్తావనలో సామెతగా.. పదో తరగతి పిల్లాడికి పరీక్షలు అయిపోయిన తర్వాత పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందని దెబ్బిపొడిచారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఎంపీ సోయంబాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నల మధ్య వాడీవేడిగా సాగింది. 2018 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6వేలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇన్ని రోజులైనా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కలేదని వాపోతూ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించి రైతులకు ప్రయోజనం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై సోయం బాపురావు మరో రకంగా స్పందించారు. 2018 డిసెంబర్లో నేను ఎంపీగా లేనని, టీఆర్ఎస్కే చెందిన గోడం నగేశ్ ఉన్నారని, అప్పుడు మీరెందుకు ప్రయత్నం చేయలేదంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంత నవ్వులు పూసాయి. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండటం, మళ్లీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయనే ఉండడంతో ఎమ్మెల్యే జోగు రామన్న ఆ విధంగా ప్రశ్నించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ సోయం బాపురావుతో విషయం తమవైపు సాగేలా ప్రయత్నం చేశారు. సోయం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు రావాల్సిన సాయం అందేలా చూస్తానన్నారు. అదే సందర్భంలో జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతుంటే ఏం చేస్తున్నారని సోయం బాపురావు వ్యవసాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలోనే.. సమావేశం ఆది నుంచే ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షంపై గురి పెట్టారు. జెడ్పీ సమావేశంలో 42 అంశాలకు సంబంధించి మొదటి అంశంగా విద్యాశాఖతో ప్రారంభమైంది. డీఈవో రవీందర్‌రెడ్డి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి చేపడుతున్న అంశాలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి మాట్లాడుతూ తన మండలంలో అనేక పాఠశాలల భవనాలకు పెచ్చులు ఊడిపోయాయని, సరిపడ టాయిలెట్లు లేవని, బాలికలు చదువుకునే పాఠశాలల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆదర్శ పాఠశాలలని చెప్పుకోవడమే తప్పా పశువుల కొట్టం మాదిరి ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. దీంతో మంత్రి ఐకే రెడ్డి అన్ని అంశాలపై సభ్యులందరు మాట్లాడేది ఉందంటూ సమస్యను తక్కువ సమయంలో ప్రస్తావించాలని గణేశ్‌రెడ్డితో అన్నారు. తాను మాట్లాడి నాలుగైదు నిమిషాలు కూడా కాలేదని, మమ్మల్ని ఆపకండి.. కరెక్ట్ కాదు.. సభ్యులు చెప్పేది వినే ఓపిక ఉండాలంటూ గణేశ్ రెడ్డి మంత్రిపై మాటలతో ఎదురుదాడికి దిగారు. మంత్రి, కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా వెనక నుంచి బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ గణేశ్ రెడ్డిని.. చెప్పింది చాలు.. కూర్చో అంటూ సంబోధించారు. కొంతమంది టీఆర్ఎస్ సభ్యులు కూడా తుల శ్రీనుకు వెన్నంటి నిలిచారు. దీంతో చిర్రెత్తిన గణేశ్‌రెడ్డి నువ్వే కూర్చో అంటూ ఆగ్రహంగా ఊగిపోవడంతో సమావేశంలో వాడీవేడి కనిపించింది. ఇలా పలు సందర్భాల్లో అధికార టీఆర్ఎస్ సభ్యులు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎజెండా అంశాలు.. జెడ్పీ సమావేశం ఎజెండాలో 42 అంశాలు ఉండగా, ఓ సందర్భంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సమావేశం కావడంతో సభ్యులందరు మాట్లాడాలని, ఈ దృష్ట్యా అందరికీ అవకాశం రావాలి అంటూ పరోక్షంగా తలమడుగు కాంగ్రెస్ జెడ్పీటీసీ గణేశ్ రెడ్డితో అన్నప్పుడు ఆయన తాము క్షేత్రస్థాయిలో తిరిగి సమస్యలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. సమావేశ ఎజెండా అంశాలకు సమయం సరిపోకపోతే రెండు రోజులు నిర్వహించాలంటూ అధికార పక్షాన్ని ఎండగట్టారు. మొత్తం మీదా మొదట సమావేశం ప్రారంభం కాగానే సభ్యులను సన్మానించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని సన్మానించారు. ఆ తర్వాత ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ప్రకటించారు. మంత్రి, జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. తదనంతరం ఎజెండా అంశాలతో సమావేశం ప్రారంభమైంది. అయితే మొదటి సమావేశాన్ని నామమాత్రంగా ముగించాలనుకున్న అధికార పక్షానికి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రతిపక్షం ఉంది అనేలా సమావేశం సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి సెషన్, తిరిగి 2.30 గంటల నుంచి సాయంత్రం వరకు రెండో సెషన్‌గా ఎజెండా అంశాల ప్రస్తావనతో ముగిసింది. -
అభివృద్ధికే ప్రజల అండ:జోగు రామన్న
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నా విజయానికి నాంది. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఏ పోటీ లేదు. అంతా ఏకపక్షమే. ప్రతిపక్ష పార్టీల విష ప్రచారంతో డైలామాలో ఉన్న ప్రజలు కూడా ఆదిలాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ తరువాత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి, నన్ను అధిక మెజార్టీతో గెలిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం దరిదాపుల్లో ఉండరు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత పార్టీలు చేయని అభివృద్ధి కార్యక్రమాలను నాలుగున్నరేళ్లలో చేసి చూపించాం. పింఛన్లతో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం చూశాం. ఇవన్నీ నా విజయానికి దోహదపడతాయి. కొత్త పరిశ్రమలు, యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా... అని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆపద్ధర్మ మంత్రి, ఆదిలాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న స్పష్టం చేశారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం... సాక్షి: గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరాయని భావిస్తున్నారా..? జోగు రామన్న: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్లను రూ.200 నుంచి రూ.1000 చేశారు. వచ్చే ప్రభుత్వంలో రూ.2,016 చేయబోతున్నారు. ఒంటరి మహిళలకు సైతం పింఛన్లు ఇచ్చాం. రైతాంగానికి 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను రీచార్జి చేసుకున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ రూ.లక్ష ఇస్తున్నారు. రైతుబంధు కింద ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో చేసి చూపించాం. లబ్ధిదారులు కేసీఆర్‌ను మరువరు. సాక్షి: ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? జోగు రామన్న: ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ నియోకజవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు వెళ్లాను. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేం నిర్వహించే రోడ్‌షోలను విజయోత్సవ ర్యాలీగా ప్రజలు భావిస్తున్నారు. నాలుగేళ్లలో మారిన వారి జీవన విధానాన్ని స్వయంగా వచ్చి చెబుతున్నారు. వంద శాతం గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. సాక్షి: గెలుపునకు దోహదపడే అంశాలేమని భావిస్తున్నారు? జోగు రామన్న: కేసీఆర్ రాష్ట్ర ప్రజల బాగు కోరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మా విజయానికి దోహదపడేవే. కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సంక్షేమ ఫలాలు అందించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ కింద ఆడపిల్లలకు పెళ్లి సాయం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్లు అందించడం, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటివన్నీ టీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశాలు. ఆదిలాబాద్‌లో గిరిజనుల కోసం అన్ని గ్రామాలకు రోడ్లు వేశాం. దీంతో 102 అంబులెన్స్, 104, 108 వాహనాలు గ్రామాలకు వెళ్తున్నాయి. మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ తమ విజయానికి దోహద పడతాయి. సాక్షి: నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి..? జోగు రామన్న: ఆదిలాబాద్ నియోజకవర్గంలో రూ.4330 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేశాం. అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల ఏర్పాటుకు అనుమతులు తీసుకొచ్చాం. మావలలో హరివనం పార్కును నిర్మించాం. పోలీస్ బెటాలియన్, స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేశాం. కోరటా–చనాఖా బ్యారేజీని నిర్మించాం. ఒక ఎకరం కూడా వదిలిపెట్టకుండా సాగునీటిని రైతులకు అందిస్తాం. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.125 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. సాక్షి: సీసీఐ పునఃప్రారంభం, రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు కదా..? జోగు రామన్న: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెరిపించేందుకు నా వంతుగా కృషి చేస్తునే ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ కోసం పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశాను. ఈ బీజేపీ ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఈసారి గెలిచిన వెంటనే సీసీఐ తీసుకొచ్చేందుకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తా. యాపల్‌గూడలో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాటి నిర్మాణాలు సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించేలా చూస్తాం. సాక్షి: మిమ్ముల్ని మరోసారి గెలిపిస్తే ప్రజలకు ఇచ్చే హామీలేంటి? జోగు రామన్న: ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 18 చెరువులు మంజూరయ్యాయి. సాత్నా ల వాగుపై చెక్‌డ్యాం నిర్మిస్తాం. విద్య, వైద్య, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. నాగ్‌పూర్ క్యారిడార్, టెక్స్టైల్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా. రిమ్స్ ఖాళీలను భర్తీ చేస్తాం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్ని వైద్య పోస్టులు భర్తీ చేయించి ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్ వెళ్లకుండా ఇక్కడే నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపడతాం. యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను. ఈసారి గెలిచిన వెంటనే ముఖ్య మంత్రి కేసీఆర్‌ను ఆదిలాబాద్ తీసుకొస్తా. సీఎం, సీఎస్‌తోపాటు ప్రభుత్వమంతా నాలుగు రోజులు ఆదిలాబాద్‌లోనే ఉంటుంది. ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి జరుగుతుంది. -
రంగులు మారిన రాజకీయం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఇంతకాలం మాటలతో దాడులు చేసుకున్న వారే ఎన్నికల వేళా ఎంచక్కా కలిసిపోతున్నారు. శత్రుత్వాన్ని మరిచి కలిసే ప్రచారానికి కూడా వెళ్తున్నారు. అందుకే..సినిమాలో రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్ తమ్మీ..అని ఓ డైలాగ్ ఉంది. ఈ మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఎవరెవరు శత్రువులు..ఎవరికి ఎవరు మిత్రులు..అని చెప్పడం నేటి రోజుల్లో అసాధ్యం. ముథోల్‌లో అన్నదమ్ముల సవాల్ భైంసా : ముథోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య సవాల్ మొదలైంది. భోస్లే నారాయణరావుపటేల్ 1994, 1999, 2004,2009 ఎన్నికల్లో ముథోల్ స్థానం నుంచి పోటీ చేసే సమయంలో ఆయన సోదరులు పవార్ రామారావుపటేల్, భోస్లే మోహన్రావుపటేల్లు వెన్నంటి ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ముథోల్ నియోజకవర్గంలో పటేల్ కుటుంబమంటే ముగ్గురు అన్నదమ్ములని చెప్పేవారు. ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు సోదరులకు తెలిసే జరిగేవి. వ్యాపార పరమైన, రాజకీయపరమైన, కుటుంబపరమైన నిర్ణయాలన్నీ ముగ్గురు సోదరులు ఏకాభిప్రాయంతోనే తీసుకునేవారు. 2018 ఎన్నికల్లో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇద్దరు సోదరులు ముథోల్ టిక్కెట్టును ఆశించారు. కాంగ్రెస్ టిక్కెట్ రామారావుపటేల్‌కు కేటాయించారు. దీంతో ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ఎన్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రామారావుపటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన గెలుపునకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు భోస్లే నారాయణరావు పటేల్, తన సోదరుడు భోస్లే మోహన్రావుపటేల్తో కలిసి మరోసారి ముథోల్ సీటు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఒకప్పుడు కలిసున్న ఈ కుటుంబం ఈ ఎన్నికల్లో ఇలా రెండు పార్టీల నుంచి పోటీ చేసి గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సోదరుల ముచ్చటే వినిపిస్తోంది. నాటి గురుశిష్యులు..నేటి ప్రత్యర్థులు ఆదిలాబాద్‌టౌన్: గత కొన్నేళ్లుగా జోగు రామన్న, పాయల్ శంకర్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది. ఏ రాజకీయ కార్యక్రమమైనా ఇద్దరు కలిసి చేపట్టేవారు. ఎక్కడికి వెళ్లినా రామన్న వెంటే రాంబంటులా పాయల్ ఉండే వారు. అయితే ఒకప్పుడు గురుశిష్యులైన టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ప్రస్తుతం శాసనసభ ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇందులో జోగురామన్న గురువైతే.. పాయల్ శంకర్ శిష్యుడు. అయితే ఇప్పటి వరకు రెండుసార్లు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయగా, ముచ్చటగా మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. రెండుసార్లు ఎన్నికల బరిలో.. జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన జోగు రామన్న రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలైంది. 1995లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఆయనకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఒక ఎంపీటీసీ అవసరం ఏర్పడింది. ఆ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాలు గెలువగా, కాంగ్రెస్ మూడు, సీపీఐ, జనతాదళ్, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కోచోట గెలుపొందారు. ఆ సమయంలో స్వతంత్య్ర అభ్యర్థిగా అదే మండలం అడకు చెందిన పాయల్ శంకర్ నిరాల ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది మద్దతు ఇవ్వడంతో 1995లో రామన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది. గతంలో పార్టీ కార్యకలాపాలన్నీ పాయల్‌కే.. జోగు రామన్న 2000లో జైనథ్ జెడ్పీటీసీగా, 2005లో మరోమారు జడ్పీటీసీగా టీడీపీ తరపున విజయం సాధించారు. ఇదే సమయంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2009లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా రామన్న గెలుపొందారు. ఇటు పాయల్ శంకర్ మళ్లీ అడ సర్పంచ్‌గా, ఆయన సతీమణి నిరాల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది పార్టీలో వివిధ పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. రామన్న వెంటనే పాయల్ శంకర్ ఉంటూ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాలన్నీ చక్కదిద్దుతూ చూసుకునేవారు. ఒకవిధంగా చెప్పాలంటే రామన్నకు కుడిభుజమని చెప్పుకునేవారు. నమ్మిన బంటు కావడంతో ఆయన కార్యకలాపాలను పర్యవేక్షించి రామన్న గెలుపు కోసం కృషి చేశారు. అనంతరం జోగు రామన్న జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇప్పించారు. టీడీపీ తరఫున 2009లో జైనథ్ జెడ్పీటీసీగా పాయల్ గెలుపొందారు. 2012లో ఆదిలాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికల్లో తొలిసారి గురు శిష్యుల మధ్య పోటీ ఆరంభమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరూ పోటీపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున రామన్న, బీజేపీ నుంచి శంకర్ పోటీ చేస్తున్నారు. -
అభివృద్ధికి పట్టం కట్టండి
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిమ్మ సంతోష్ సోమవారం ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామన్న ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు సంతోష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు వర్గాల్లోని కార్యకర్తల మధ్య ప్రజలకు సేవ చేయలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన సుజాత ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో చెప్పాలని పేర్కొన్నారు. జైనథ్: నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టికి ప్రజలు పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న సతీమణీ జోగు రమాదేవి అన్నారు. సోమవారం ఆమె ఎంపీపీ తల్లెల శోభ, ఇతర నాయకులతో కలిసి మండలంలోని బాలాపూర్, సాంగ్వి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ..కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్నను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్, నాయకులు తల్లెల చంద్రయ్య, తమ్మడి భగవాండ్లు, మద్దుల ఊషన్న, గుమ్ముల సునీల్, వైద్య ఉమేష్, జక్కుల వినోద్, అల్లకొండ అశోక్, దుర్ల నడిపెన్న, సురేందర్ రెడ్డి, విలాస్ తదితరులు పాల్గొన్నారు. జైనథ్: మండలంలోని ఆనంద్‌పూర్, కూర గ్రామాల్లో టీఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, ఇతర నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం వారు ఇంటింటికీ తిరుగుతూ..కారు గుర్తుకు ఓటు వేసి జోగు రామన్నను ఎమ్మేల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జోగు ప్రేమేందర్, పెందూర్ దేవన్న, అడప తిరుపతి, రవీందర్, స్వామి రెడ్డి, చందర్, దుర్ల అశోక్, రాంరెడ్డి, యాసం నర్సింగ్, గంగన్న, సోమ రమేష్‌రెడ్డి, రినేష్, వామన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్: ఢిల్లీ, అమరావతిలో అధిష్టానం ఉండే పార్టీల కంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మావల మండలంలోని దుర్గనగర్, దస్నాపూర్ కాలనీల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ జన్‌ధన్ జీరో అకౌంట్ల పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆయన ఇంటి ముందు వేసిన రోడ్డు టీఆర్ఎస్ ప్రభుత్వం వేయకపోతే బీజేపీ ప్రభుత్వం వేసిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మావల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, నాయకులు రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
ఎగిరిపోనూవచ్చు..!
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలో ఎయిర్‌ఫోర్సు శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ఎన్నో సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రజలు కన్న కలలు ఫలించకపోయినా.. ఎట్టకేలకు మినీ ఏరోడ్రామ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మరోసారి ఆశలు చిగురించాయి. జిల్లా కేంద్రంలో 362 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమానాశ్రయ మైదానాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మినీ ఏరోడ్రామ్ ఏర్పాట్లు త్వరగా ప్రారంభిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఎయిర్‌ఫోర్సు ఏర్పాటు చేసేందుకు 2014లో ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. కానీ నాలుగేళ్ల నుంచి దీని ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా కేసీఆర్ ఎయిర్‌ఫోర్సు సాధ్యం కాదని.. ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో విమానం ఎక్కుతామనే ఆశలు ప్రజల్లో చిగురించాయి. అభివృద్ధికి ఊతం.. ఏరోస్ట్రిప్ ఏర్పాటు ద్వారా చిన్న విమానాల రాకపోకలు సాగిస్తాయి. డొమెస్ట్రిక్ ఫ్లయిట్లు ఇక్కడ ల్యాండింగ్ అవుతాయి. దీనిద్వారా ఆదిలాబాద్ పట్టణంలో మార్కెట్ పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించిన అనుమతి తీసుకున్న తర్వాతే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా కేసీఆర్ దీనిపై ప్రకటన చేయడంతో కేంద్రాన్ని ఒప్పిస్తారని జిల్లా మంత్రులు చెబుతున్నారు. విమానాశ్రయ మైదానానికి 362 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ ఎయిర్‌ఫోర్సు ఏర్పాటుకు మరికొంత స్థలం కోసం 2015లోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని గుర్తించారు. దీనికి చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి కలిపి 1652.25 ఎకరాలు గుర్తించారు. మొత్తం 1924.25 ఎకరాల స్థలం శిక్షణ కేంద్రం కోసమని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇంతవరకు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్సుకు సంబంధించిన 362 ఎకరాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటనతో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోనుంది. ఏరోస్ట్రిప్‌తో అభివృద్ధి ఆదిలాబాద్ పట్టణంలోని విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఎయిర్‌ఫోర్సు కేంద్రం పరిధిలో ఉంటుంది, ఏరోస్ట్రిప్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు సాగుతాయి. ఏరోస్ట్రిప్ ఏర్పాటుతో ఇక్కడ అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆదిలాబాద్ ప్రజల కల నెరవేరనుంది. – జోగు రామన్న, రాష్ట్ర మంత్రి -
బాధితులకు ‘డబుల్’ ఇళ్లు
► మంత్రి జోగు రామన్న ► అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ జైనథ్(ఆదిలాబాద్): మండలంలోని మాండగాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హామీనిచ్చారు. సోమవారం ఆయన రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తి నష్టంపై ఆరా తీశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు బట్టలు, వంటపాత్రలు, స్టవ్‌లు, 50 కిలోల బియ్యం, పప్పు, నిత్యావసర వస్తువులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ ప్రమాదం గురించి తనతో చర్చించారని, ప్రభుత్వం అన్ని రకాలు ఆదుకుంటుందని భరోసా కల్పించారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా షెడ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసి ఈ వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూర్యనారాయణను ఆదేశించారు. నాయకులు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, పెందూర్ దేవన్న, సర్సన్ లింగారెడ్డి, బండారి సతీష్, రోకండ్ల సురేష్‌రావ్, ఆత్రం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల పరామర్శ అగ్ని ప్రమాద బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, నాయకులు సోమవారం పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, రూ.వంటపాత్రలు, పప్పు, నిత్యావసర వ స్తువులు అందజేశారు. ప్రభుత్వం పరిహారంగా రూ.8 వేలు మాత్రమే అందించడం సరికాదని అన్నారు. పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని సతీష్రావ్, నాయకులు జగదీష్‌రెడ్డి, పోతరెడ్డి, సంతోష్‌రావు, వినోద్, పొచ్చన్న పాల్గొన్నారు.