ప్రతీకాత్మక చిత్రం
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలో ఎయిర్‌ఫోర్సు శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ఎన్నో సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రజలు కన్న కలలు ఫలించకపోయినా.. ఎట్టకేలకు మినీ ఏరోడ్రామ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మరోసారి ఆశలు చిగురించాయి. జిల్లా కేంద్రంలో 362 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమానాశ్రయ మైదానాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మినీ ఏరోడ్రామ్ ఏర్పాట్లు త్వరగా ప్రారంభిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఎయిర్‌ఫోర్సు ఏర్పాటు చేసేందుకు 2014లో ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. కానీ నాలుగేళ్ల నుంచి దీని ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా కేసీఆర్ ఎయిర్‌ఫోర్సు సాధ్యం కాదని.. ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో విమానం ఎక్కుతామనే ఆశలు ప్రజల్లో చిగురించాయి.
అభివృద్ధికి ఊతం..
ఏరోస్ట్రిప్ ఏర్పాటు ద్వారా చిన్న విమానాల రాకపోకలు సాగిస్తాయి. డొమెస్ట్రిక్ ఫ్లయిట్‌లు ఇక్కడ ల్యాండింగ్ అవుతాయి. దీనిద్వారా ఆదిలాబాద్ పట్టణంలో మార్కెట్ పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించిన అనుమతి తీసుకున్న తర్వాతే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా కేసీఆర్ దీనిపై ప్రకటన చేయడంతో కేంద్రాన్ని ఒప్పిస్తారని జిల్లా మంత్రులు చెబుతున్నారు. విమానాశ్రయ మైదానానికి 362 ఎకరాల స్థలం ఉంది.
ఇక్కడ ఎయిర్‌ఫోర్సు ఏర్పాటుకు మరికొంత స్థలం కోసం 2015లోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని గుర్తించారు. దీనికి చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి కలిపి 1652.25 ఎకరాలు గుర్తించారు. మొత్తం 1924.25 ఎకరాల స్థలం శిక్షణ కేంద్రం కోసమని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇంతవరకు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్సుకు సంబంధించిన 362 ఎకరాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటనతో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోనుంది.
ఏరోస్ట్రిప్‌తో అభివృద్ధి
ఆదిలాబాద్ పట్టణంలోని విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఎయిర్‌ఫోర్సు కేంద్రం పరిధిలో ఉంటుంది, ఏరోస్ట్రిప్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు సాగుతాయి. ఏరోస్ట్రిప్ ఏర్పాటుతో ఇక్కడ అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆదిలాబాద్ ప్రజల కల నెరవేరనుంది.
– జోగు రామన్న, రాష్ట్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment