రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఇంతకాలం మాటలతో దాడులు చేసుకున్న వారే ఎన్నికల వేళా ఎంచక్కా కలిసిపోతున్నారు. శత్రుత్వాన్ని మరిచి కలిసే ప్రచారానికి కూడా వెళ్తున్నారు. అందుకే..సినిమాలో రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్ తమ్మీ..అని ఓ డైలాగ్ ఉంది. ఈ మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఎవరెవరు శత్రువులు..ఎవరికి ఎవరు మిత్రులు..అని చెప్పడం నేటి రోజుల్లో అసాధ్యం.
ముథోల్‌లో అన్నదమ్ముల సవాల్
భైంసా : ముథోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య సవాల్ మొదలైంది. భోస్లే నారాయణరావుపటేల్ 1994, 1999, 2004,2009 ఎన్నికల్లో ముథోల్ స్థానం నుంచి పోటీ చేసే సమయంలో ఆయన సోదరులు పవార్ రామారావుపటేల్, భోస్లే మోహన్‌రావుపటేల్‌లు వెన్నంటి ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ముథోల్ నియోజకవర్గంలో పటేల్ కుటుంబమంటే ముగ్గురు అన్నదమ్ములని చెప్పేవారు. ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు సోదరులకు తెలిసే జరిగేవి. వ్యాపార పరమైన, రాజకీయపరమైన, కుటుంబపరమైన నిర్ణయాలన్నీ ముగ్గురు సోదరులు ఏకాభిప్రాయంతోనే తీసుకునేవారు.
2018 ఎన్నికల్లో..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇద్దరు సోదరులు ముథోల్ టిక్కెట్టును ఆశించారు. కాంగ్రెస్ టిక్కెట్ రామారావుపటేల్‌కు కేటాయించారు. దీంతో ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ఎన్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రామారావుపటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన గెలుపునకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు భోస్లే నారాయణరావు పటేల్, తన సోదరుడు భోస్లే మోహన్‌రావుపటేల్‌తో కలిసి మరోసారి ముథోల్ సీటు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఒకప్పుడు కలిసున్న ఈ కుటుంబం ఈ ఎన్నికల్లో ఇలా రెండు పార్టీల నుంచి పోటీ చేసి గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సోదరుల ముచ్చటే వినిపిస్తోంది.
నాటి గురుశిష్యులు..నేటి ప్రత్యర్థులు
ఆదిలాబాద్‌టౌన్: గత కొన్నేళ్లుగా జోగు రామన్న, పాయల్ శంకర్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది. ఏ రాజకీయ కార్యక్రమమైనా ఇద్దరు కలిసి చేపట్టేవారు. ఎక్కడికి వెళ్లినా రామన్న వెంటే రాంబంటులా పాయల్ ఉండే వారు. అయితే ఒకప్పుడు గురుశిష్యులైన టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ప్రస్తుతం శాసనసభ ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇందులో జోగురామన్న గురువైతే.. పాయల్ శంకర్ శిష్యుడు. అయితే ఇప్పటి వరకు రెండుసార్లు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయగా, ముచ్చటగా మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
రెండుసార్లు ఎన్నికల బరిలో..
జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన జోగు రామన్న రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలైంది. 1995లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఆయనకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఒక ఎంపీటీసీ అవసరం ఏర్పడింది. ఆ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాలు గెలువగా, కాంగ్రెస్ మూడు, సీపీఐ, జనతాదళ్, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కోచోట గెలుపొందారు. ఆ సమయంలో స్వతంత్య్ర అభ్యర్థిగా అదే మండలం అడకు చెందిన పాయల్ శంకర్ నిరాల ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది మద్దతు ఇవ్వడంతో 1995లో రామన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది.
గతంలో పార్టీ కార్యకలాపాలన్నీ పాయల్‌కే..
జోగు రామన్న 2000లో జైనథ్ జెడ్పీటీసీగా, 2005లో మరోమారు జడ్పీటీసీగా టీడీపీ తరపున విజయం సాధించారు. ఇదే సమయంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2009లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా రామన్న గెలుపొందారు. ఇటు పాయల్ శంకర్ మళ్లీ అడ సర్పంచ్‌గా, ఆయన సతీమణి నిరాల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది పార్టీలో వివిధ పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. రామన్న వెంటనే పాయల్ శంకర్ ఉంటూ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాలన్నీ చక్కదిద్దుతూ చూసుకునేవారు. ఒకవిధంగా చెప్పాలంటే రామన్నకు కుడిభుజమని చెప్పుకునేవారు. నమ్మిన బంటు కావడంతో ఆయన కార్యకలాపాలను పర్యవేక్షించి రామన్న గెలుపు కోసం కృషి చేశారు. అనంతరం జోగు రామన్న జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇప్పించారు. టీడీపీ తరఫున 2009లో జైనథ్ జెడ్పీటీసీగా పాయల్ గెలుపొందారు. 2012లో ఆదిలాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికల్లో తొలిసారి గురు శిష్యుల మధ్య పోటీ ఆరంభమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరూ పోటీపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున రామన్న, బీజేపీ నుంచి శంకర్ పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment