అభివృద్ధికే ప్రజల అండ:జోగు రామన్న | Jogu Ramanna Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

అభివృద్ధికే ప్రజల అండ:జోగు రామన్న

Published Wed, Dec 5 2018 1:38 PM | Last Updated on Wed, Dec 5 2018 1:38 PM

Jogu Ramanna Special Interview With Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నా విజయానికి నాంది. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంలో నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఏ పోటీ లేదు. అంతా ఏకపక్షమే. ప్రతిపక్ష పార్టీల విష ప్రచారంతో డైలామాలో ఉన్న ప్రజలు కూడా ఆదిలాబాద్‌లో సీఎం కేసీఆర్‌ సభ తరువాత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి, నన్ను అధిక మెజార్టీతో గెలిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కనీసం దరిదాపుల్లో ఉండరు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత పార్టీలు చేయని అభివృద్ధి కార్యక్రమాలను నాలుగున్నరేళ్లలో చేసి చూపించాం. పింఛన్లతో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల ముఖాల్లో ఆనందం చూశాం. ఇవన్నీ నా విజయానికి దోహదపడతాయి. కొత్త పరిశ్రమలు, యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా... అని  ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆపద్ధర్మ మంత్రి, ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న స్పష్టం చేశారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం...                             

సాక్షి: గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేరాయని భావిస్తున్నారా..?
జోగు రామన్న: టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్లను రూ.200 నుంచి రూ.1000 చేశారు. వచ్చే ప్రభుత్వంలో రూ.2,016 చేయబోతున్నారు. ఒంటరి మహిళలకు సైతం పింఛన్లు ఇచ్చాం. రైతాంగానికి 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మిషన్‌ కాకతీయతో చెరువులను రీచార్జి చేసుకున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్‌ రూ.లక్ష ఇస్తున్నారు. రైతుబంధు కింద ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో చేసి చూపించాం. లబ్ధిదారులు కేసీఆర్‌ను మరువరు. 
సాక్షి: ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
జోగు రామన్న: ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్‌ నియోకజవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు వెళ్లాను. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేం నిర్వహించే రోడ్‌షోలను విజయోత్సవ ర్యాలీగా ప్రజలు భావిస్తున్నారు. నాలుగేళ్లలో మారిన వారి జీవన విధానాన్ని స్వయంగా వచ్చి చెబుతున్నారు. వంద శాతం గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. 
సాక్షి: గెలుపునకు దోహదపడే అంశాలేమని భావిస్తున్నారు?
జోగు రామన్న: కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల బాగు కోరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మా విజయానికి దోహదపడేవే. కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సంక్షేమ ఫలాలు అందించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ కింద ఆడపిల్లలకు పెళ్లి సాయం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్లు అందించడం, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ వంటివన్నీ టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశాలు. ఆదిలాబాద్‌లో గిరిజనుల కోసం అన్ని గ్రామాలకు రోడ్లు వేశాం. దీంతో 102 అంబులెన్స్, 104, 108 వాహనాలు గ్రామాలకు వెళ్తున్నాయి. మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ తమ విజయానికి దోహద పడతాయి.
సాక్షి: నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి..?
జోగు రామన్న: ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.4330 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేశాం. అగ్రికల్చర్‌ బీఎస్సీ కళాశాల ఏర్పాటుకు అనుమతులు తీసుకొచ్చాం. మావలలో హరివనం పార్కును నిర్మించాం. పోలీస్‌ బెటాలియన్, స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశాం. కోరటా–చనాఖా బ్యారేజీని నిర్మించాం. ఒక ఎకరం కూడా వదిలిపెట్టకుండా సాగునీటిని రైతులకు అందిస్తాం. ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి రూ.125 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
సాక్షి: సీసీఐ పునఃప్రారంభం, రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు కదా..?
జోగు రామన్న: సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తెరిపించేందుకు నా వంతుగా కృషి చేస్తునే ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ కోసం పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశాను. ఈ బీజేపీ ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. ఈసారి గెలిచిన వెంటనే సీసీఐ తీసుకొచ్చేందుకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తా. యాపల్‌గూడలో రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాం. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వాటి నిర్మాణాలు సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించేలా చూస్తాం.
సాక్షి: మిమ్ముల్ని మరోసారి గెలిపిస్తే ప్రజలకు ఇచ్చే హామీలేంటి?
జోగు రామన్న: ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో కొత్తగా 18 చెరువులు మంజూరయ్యాయి. సాత్నా ల వాగుపై చెక్‌డ్యాం నిర్మిస్తాం. విద్య, వైద్య, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. నాగ్‌పూర్‌ క్యారిడార్, టెక్స్‌టైల్‌ పార్క్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తా. రిమ్స్‌ ఖాళీలను భర్తీ చేస్తాం. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్ని వైద్య పోస్టులు భర్తీ చేయించి ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్‌ వెళ్లకుండా ఇక్కడే నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపడతాం. యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను. ఈసారి గెలిచిన వెంటనే ముఖ్య మంత్రి కేసీఆర్‌ను ఆదిలాబాద్‌ తీసుకొస్తా. సీఎం, సీఎస్‌తోపాటు ప్రభుత్వమంతా నాలుగు రోజులు ఆదిలాబాద్‌లోనే ఉంటుంది. ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి జరుగుతుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement