సాక్షి, ఆదిలాబాద్: తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, బీజేపీ హైకమాండ్ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్ గురించి హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి.
2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్‌లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment