హైదరాబాద్ : నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న పదవి రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయన ఎట్టకేలకు కారెక్కారు. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. 20 ఏళ్లుగా దోబూచులాడిన మంత్రి పదవి ఇంద్రకర్ రెడ్డికి దక్కింది.
గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం..
ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు.
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గం :ఆదిలాబాదు
వ్యక్తిగత వివరాలు
పుట్టిన తేదీ:16 ఫిబ్రవరి 1949
స్వస్థలం : నిర్మల్ మండలం ఎల్లపల్లి
తండ్రి : తండ్రి నారాయణరెడ్డి
భాగస్వామి: విజయలక్ష్మి
విద్యార్హత : ఎల్ఎల్బి