బీసీలకు 42% కోటా | Telangana State Cabinet approves draft bill for BC Reservations | Sakshi
Sakshi News home page

బీసీలకు 42% కోటా

Published Fri, Mar 7 2025 3:30 AM | Last Updated on Fri, Mar 7 2025 3:30 AM

Telangana State Cabinet approves draft bill for BC Reservations

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి పొన్నం

ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ 

కోర్‌ అర్బన్‌ ఏరియాగా ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతం 

అక్కడి నుంచి ట్రిపుల్‌ ఆర్‌కి 2 కి.మీ. వరకు ఫ్యూచర్‌ సిటీ ఏరియా 

మిగిలిన ప్రాంతం అంతా గ్రామీణ తెలంగాణ 

56 గ్రామాలతో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ఏరియా ఏర్పాటు 

ఒకే గొడుగు కిందకు ఎస్‌హెచ్‌జీలు..సెర్ప్, మెప్మా విలీనం 

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బోర్డు 

తెలంగాణ పర్యాటక పాలసీ–2025కు ఆమోదం   

10,954 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ గ్రామ పరిపాలన అధికారులు 

కేబినెట్‌ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం

సాక్షి, హైదరాబాద్‌:  ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల్లో, విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే మరో ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వివరాలు విలేకరులకు వెల్లడించారు.  

చిక్కులు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు 
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేపట్టడానికి ఏర్పాటు చేసిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ గత నెల 3న సమర్పించిన తొలి విడత సిఫారసులపై వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని పొంగులేటి తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిష్కరించిన అనంతరం తాజాగా కమిషన్‌ సమర్పించిన నివేదికను బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. 

ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా బిల్లును రూపొందించామన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 37 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2017లో సభలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్‌ వివరించారు.  

ఇక 3 సెక్టార్లుగా రాష్ట్రం! 
‘రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలి ప్రాంతాన్ని కోర్‌ అర్బన్‌ ఏరియాగా, అక్కడి నుంచి ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డుకు ఆవల 2 కి.మీల బఫర్‌ జోన్‌ వరకు ఫ్యూచర్‌ సిటీగా, మిగిలిన ప్రాంతాన్ని రూరల్‌ తెలంగాణగా విభజించాలని నిర్ణయించాం. 

రూరల్‌ తెలంగాణ పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రావు. 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నాగార్జునసాగర్,  శ్రీశైలం హైవేల మధ్య ఉన్న 30 కి.మీల విస్తీర్ణంలో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయనున్నాం. హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను ఎఫ్‌సీడీఏకి బదిలీ చేశాం. ఫ్యూచర్‌ సిటీ కోసం 90 పోస్టులను ఆమోదించాం.  

హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ 
హెచ్‌ఎండీఏ పరిధిని రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు 2 కి.మీల బఫర్‌ జోన్‌ వరకు పొడిగించాం. 11 జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించింది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి..’ అని పొంగులేటి తెలిపారు. 

సెర్ప్, మెప్మా విలీనం 
‘కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్‌ కింద రూపొందించిన పాలసీ–2025ని కేబినెట్‌ ఆమోదించింది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి అందించిన సహకారాన్ని మళ్లీ కొత్త పాలసీతో పునరుద్ధరిస్తాం. 

మహిళా స్వయం సహాయక సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించాం. ఇందిరా మహిళా శక్తి సంఘాల మహిళల రిటైర్మెంట్‌ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించడంతో పాటు సభ్యులుగా చేరేందుకు కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు కుదించాం..’ అని మంత్రి చెప్పారు.  

27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి 
‘తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ చారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ 1987ను సవరించాలని నిర్ణయించాం. తెలంగాణ పర్యాటక పాలసీ–2025ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నాం. పర్యాటక విధానంతో వచ్చే 5 ఏళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నాం..’ అని పొంగులేటి తెలిపారు.  

మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్‌ పోటీలు.. 
‘మేలో జరగనున్న మిస్‌ వరల్డ్‌– 2025 పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. 140 దేశాల నుంచి హాజరుకానున్న అతిథులకు ఎక్కడా లోటు జరకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం..’ అని చెప్పారు.  

ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాలు  
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారుల(జీపీఓ)ను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. తాజాగా మళ్లీ వారిలో యోగ్యులను జీపీఓలుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో కేంద్రం ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5.15 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అనుమతినిచ్చింది.  

పారా ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 361 పోస్టులను మంత్రివర్గం మంజూరుచేసింది. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్, 165 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు కలిపి మొత్తం 495 పోస్టులను ఆమోదించింది.   

దక్షిణాదికి అన్యాయంపై త్వరలో అఖిలపక్ష భేటీ 
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయోజనం కల్పించడానికి కేంద్రం దురుద్దేశంతో వ్యవహరిస్తోందనే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. 

కేంద్రంతో కొట్లాడి ఉత్తరాది రాష్ట్రాలకు సమానంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తెచ్చుకోవడానికి త్వరలో హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పోరాడాలని నిర్ణయించామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.  

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు లోపాయికారీ ఒప్పందం 
– అందుకే ‘పట్టభద్రుల’ అభ్యర్థి ఓటమి 
– మంత్రులతో సీఎం రేవంత్‌ సమీక్ష 

    ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రాష్ట్ర మంత్రులు సమీక్ష జరిపారు. గురువారం కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రులతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. 

లోక్‌సభ ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు లోపాయికారీ ఒప్పందంతో వెళ్లినందునే కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమిపాలయ్యాడనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనితో పాటు ఎన్నికలు ఎదుర్కొన్న తీరులో ఎక్కడైనా లోపాలుంటే భవిష్యత్తులో సవరించుకోవాల్సి ఉంటుందని కొందరు సూచించినట్లు తెలిసింది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కూడా మంత్రులతో రేవంత్‌రెడ్డి చర్చించారు.  

12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 12 నుంచి 27 వరకు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ 2025–26ను సభలో ప్రవేశపెట్టనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement