బెర్త్ ఖరారు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లాకు మరో బెర్తు దక్కింది. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రి పదవి వరించింది. ఆరు నెలలుగా ఊరిస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. కొత్తగా ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇందులో ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పార్లమెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మంత్రి పదవి రేసులో జిల్లాకు చెందిన ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అనుకున్నట్లుగానే వారికి పదవులు దక్కాయి.
ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ పదవి దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా పనిచేయాలనే ఆయన చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరుతోంది. మంగళవారం ఆయన రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ రాష్ట్ర సర్కారు తొలి మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఒక్కరికే చోటు దక్కింది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి, సొంత చరిష్మాతో విజయం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌లో చేరేలా ఇంద్రకరణ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి కీలకమైన శాఖ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన తెగకు చెందిన కోవ లక్ష్మికి పదవి ఇవ్వడం ద్వారా గోండు వంటి ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చారనే భావన వ్యక్తమవుతోంది. తొలిసారిగా ఎమ్మెల్యే విజయం సాధించినా ఆమెకు ఈ పదవి దక్కింది. మంత్రి వర్గంలో చోటు ఖరారైన సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డితో కలిసి ఆయన సీఎంకుకృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు అనుచరవర్గం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం..
ఇంద్రకరణ్‌రెడ్డికి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరుంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఆయన కీలక పదవులు అనుభవించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు.