ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఐకే రెడ్డికి చాన్స్‌ | Allola Indrakaran Reddy Gets Cabinet Berth From Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఐకే రెడ్డికి చాన్స్‌

Published Tue, Feb 19 2019 7:42 AM | Last Updated on Tue, Feb 19 2019 7:42 AM

Allola Indrakaran Reddy Gets Cabinet Berth From Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ, విధేయతను ప్రామాణికంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో ఈ విడత నిర్మల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి)కి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, సీనియర్‌ రాజకీయవేత్త అయిన ఐకే రెడ్డికి ఈసారి కేబినెట్‌లో కీలకమైన శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత, బీసీ నాయకుడు జోగు రామన్నకు రిక్తహస్తం ఎదురుకానుంది. ఈసారి కేబినెట్‌లోకి పరిమిత సంఖ్యలోనే మంత్రులను తీసుకొని, పార్లమెంటు ఎన్నికల తరువాత మలిదఫా విస్తరణ ఉంటుందని సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఐకే రెడ్డి ఒక్కరికే అవకాశం లభిస్తుందని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఇంద్రకరణ్‌రెడ్డికి మరోసారి పదవి లభించనుందని స్పష్టం కావడంతో ఆయన వర్గీయులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌కు విధేయుడు... రాజకీయ యోధుడు ఐకే రెడ్డి
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి బలమైన నాయకుడు. 1984 నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయన జిల్లా పరిషత్‌ చైర్మన్, శాసనసభ, పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన ఐకే రెడ్డి గెలిచిన వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా నాలుగున్నరేళ్లు కొనసాగారు. మంత్రిగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరున్న ఐకే రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విధేయుడిగా పేరొందారు. 2018 ఎన్నికల్లో నిర్మల్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై 9వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 స్థానాలకు 9 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి ఐకే రెడ్డికే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

పేరు:  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 
తల్లిదండ్రులు:  చిన్నమ్మ–నారాయణరెడ్డి 
భార్య:  విజయలక్ష్మి 
పిల్లలు: కుమారుడు గౌతంరెడ్డి, కోడలు దివ్యారెడ్డి,  కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌రెడ్డి 
పుట్టినతేది:  16.02.1949 
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ 


రాజకీయ అనుభవం: 1987లో జెడ్పీచైర్మన్‌గా, 1991–96 ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1994, 1996లలో ఎంపీగా, 2009 నిర్మల్, 2010 సిర్పూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందారు. 2014ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిక. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు.  

సామాజిక సమీకరణల్లో మాజీ మంత్రి జోగు రామన్న వెనుకబాటు
గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్నకు ఈసారి అవకాశం దక్కడం లేదని స్పష్టమవుతోంది. మంత్రివర్గం కూర్పులో బీసీలకు ఇతర జిల్లాల నుంచి అవకాశం లభిస్తుండడం, సామాజికవర్గం పరంగా కూడా వరంగల్‌ నుంచి మున్నూరుకాపు వర్గానికి చెందిన వినయ్‌భాస్కర్‌కు చీఫ్‌ విప్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామన్నకు మంత్రివర్గంలో చోటు లేనట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సుమన్‌కు కలిసిరాని సామాజిక కూర్పు
పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతూనే చెన్నూరు శాసనసభ స్థానం నుంచి ఘన విజయం సాధించిన బాల్క సుమన్‌కు సామాజిక కూర్పులో భాగంగానే ఈ విడతలో మంత్రి యోగం దక్కలేదని సమాచారం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్‌ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి మంత్రి వర్గంలో స్థానం దాదాపుగా ఖరారైంది. అదే పార్లమెంటు స్థానంలో పరిధిలో ఈశ్వర్‌ సామాజిక వర్గానికే చెందిన సుమన్‌కు తద్వారా అవకాశం లభించలేదని సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే మలి విడత విస్తరణలో సుమన్‌కు మంత్రి పదవి లేదా కేబినెట్‌ హోదాలో మరేదైనా కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. 

రేఖానాయక్‌ తదితరులకు నిరాశే!
మహిళలకు గత ప్రభుత్వంలో అవకాశం లభించని నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్‌ మహిళా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. రేఖానాయక్‌కు అవకాశం ఇస్తే మహిళ, ఎస్టీ కోటా రెండు భర్తీ అవుతాయని భావించారు. అయితే పరిమిత కేబినెట్‌ విస్తరణలో సామాజిక, మహిళ, తదితర కోటాల జోలికి వెళ్లకుండా 8 లేదా 9 మందితో విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి భావిస్తుండడంతో రేఖానాయక్‌కు నిరాశే ఎదురైంది. సిర్పూరు నుంచి మూడుసార్లు విజయం సాధించిన కోనేరు కోనప్ప సైతం మంత్రి పదవికి రేసులో ఉన్నారు. ఆయన సైతం ‘కమ్మ’ సామాజిక వర్గం నుంచి సీనియర్‌ ఎమ్మెల్యేగా అవకాశం లభిస్తుందని ఆశించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్‌రావు(మంచిర్యాల) సైతం సీనియర్‌ సభ్యుడిగా చాన్స్‌ దక్కకపోతుందా అని భావించారు. అయితే సామాజిక వర్గాల కూడికలు, తీసివేతల్లో భాగంగానే వీరికి అవకాశం దక్కలేదనేది సుస్పష్టం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement