
రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం
► మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
► మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన
ముథోల్: రైతులను రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని దేవాదాయ, గృహ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముథోల్ మండలంలోని చించాల గ్రామంలో మిషన్ కాకతీయ మూడో విడత కింద పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఆదివారం చేపట్టారు. రూ.32లక్షల42వేలు మంజూరు కావడంతో ఈ పనులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. చెరువులో మంత్రి ,ఎమ్మెల్యే మట్టిని తవ్వి ట్రాక్టర్లలో వేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత మిషన్ కాకతీయ చెరువు మరమ్మతు పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు.
నియోజకవర్గంలో మూడో విడతలో 26 చెరువులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. చెరువులో నీరు ఉంటేనే భూగర్భ జలాలు తరిగిపోకుండా ఉంటాయన్నారు. మిషన్ కాకతీయ వల్ల బోరుబావుల నీళ్లు తగ్గిపోకుండా ఉంటాయని వివరించారు. బాసర గోదావరి నదిలో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గోదావరి నీరు ఉండడం వల్లే చెక్‌డ్యాం పనులు ఆలస్యమయ్యాయని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో సామాన్యులందరికి త్వరగా పనులు జరుగుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలో 17 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. బాసర ఆలయానికి త్వరలో ముఖ్యమంత్రి రానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, కోఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు అఫ్రోజ్‌ఖాన్, ఇరిగేషన్ ఈఈ ఒ.రమేశ్, ఈఈ నవీన్‌కుమార్, ఆర్డీవో రాజు, తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, ఎంపీపీ అనూషసాయిబాబా, ఎంపీడీవో నూర్‌మహ్మద్, సర్పంచ్ ఉమాసత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.