కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఐకేరెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: భక్తులకు కొంగుబంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే అనురాగవల్లిగా.. జిల్లా ప్రజల ఇలవేల్పుగా పేరొందిన అడెల్లి మహా పోచమ్మతల్లి గంగనీళ్లజాతర ఆదివారం ఘనంగా ముగిసింది. అమ్మవారి ఆభరణాలు, గంగాజలంతో దిలావర్‌పూర్ మండలం సాంగ్వి నుంచి చేపట్టి న శోభాయాత్ర ఆదివారం అడెల్లి ఆలయానికి చేరింది. అమ్మవారికి నగలు అలంకరించిన ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, అనంత రం పవిత్రోత్సవం తదితర పూజలు జరిపించారు. శనివారం రాత్రినుంచే ఆలయానికి భక్తులు రావడంతో పరిసరాలన్నీ కిటకిటలాడాయి.
ఉమ్మడి ఆదిలా బాద్‌జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాందేడ్, చంద్రాపూర్ జిల్లాలనుంచి, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలనుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం కోనేరులో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దిలావర్‌పూర్‌లో జరిగిన అమ్మవారి ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్నారు.
గంగాజలంతో ఆభరణాల శుద్ధి
దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి పరీవాహక ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తజనంతో పులకించింది. అడెల్లి మహాపోచమ్మ ఆభరణాల ఊరేగింపు శోభాయాత్ర శనివారం ఉదయం సారంగపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి మొదలై దిలావర్‌పూర్ మండలంలోని కదిలి, మాడేగాం, దిలావర్‌పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రి సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు రాత్రంతా అమ్మవారి నామస్మరణతో జాగరణలో పాల్గొన్నారు.
ఆటపాటలతో అమ్మవారి ఆభరణాలను ఆదివారం తెల్లవారుజామున గోదావరి తీరానికి తీసుకువెళ్లారు. స్టానిక ఊరి పెద్దలు, అమ్మవారి ఆలయ పూజారులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలను గడ ముంతల్లో తీసుకున్న భక్తులు గంగనీళ్ల జాతరకు అమ్మవారి ఆభరణాల వెంట వెళ్లారు.
గంగనీళ్ల జాతరలో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి
కన్నుల పండువగా శోభాయాత్ర
సాంగ్వి ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రా రంభమైన గంగనీళ్ల జాతర అడెల్లి దేవస్థానానికి తిరుగుపయనమైంది. ఈక్రమంలో కంజర్, బన్సపల్లి, దిలావర్‌పూర్, మాడేగాం, కదిలి గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభా యాత్రకు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు.
దిలావర్‌పూర్ గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు జాలుక దండ (భారీపూలతోరణం)తో స్వాగతం పలకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు యాటపిల్లలను (గొర్రె పొట్టేళ్లు) బహూకరించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. దారి పొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు మొక్కు తీర్చుకున్నారు.
భక్తులకు ప్రత్యేక వసతులు..
అడెల్లి ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవికిషన్‌గౌడ్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సారంగపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో వలంటీర్లు భక్తులకు సేవలందించారు.
భారీ పోలీస్ బందోబస్తు!
అమ్మవారి ఆభరణాలతో శోభాయాత్ర నిర్వహించగా దారివెంట నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, సారంగపూర్ ఎస్సై కృష్ణసాగర్ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. దిలావర్‌పూర్‌లోనూ నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ సీఐ శ్రీనివాస్, సోన్ సీఐ నవీన్‌కుమార్, దిలావర్‌పూర్ ఎస్సై యాసిర్ అరాఫత్, సోన్ ఎస్సై రవీందర్, రూరల్ ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment