తిరుగుబావుటా.. | candidates dissatisfied on congress list | Sakshi
Sakshi News home page

తిరుగుబావుటా..

Published Tue, Apr 8 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

candidates dissatisfied on congress list

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనతో అసంతృప్తులు భగ్గుమన్నారు. జాబితాలో చోటు దక్కని కాంగ్రెస్ నాయకులు స్వతంత్రులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలోని పలు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. పక్షం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కానీ ఆయనకు అధిష్టానం మొండిచేయి చూపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేరునే అభ్యర్థిగా ఖరారు చేసింది.

దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మాదిరిగానే బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆదిలాబాద్  లోక్‌సభ స్థానంతోపాటు, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు తన అనుచరులను బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు నిర్మల్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సిర్పూర్ నుంచి ఐకేరెడ్డి అనుచరుడు కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి పోటీ చేయనున్నారు. ఈనెల 9న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో టిక్కెట్ రాకుండా భంగపడిన నాయకులతో ఆయా నియోజకవర్గాల్లో బరిలోకి దింపేందుకు ఐకే రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షులు సి.రాంచంద్రారెడ్డి టిక్కెట్ ఆశించారు. కాని అనూహ్యంగా యువజన కాంగ్రెస్ నాయకుడు భార్గవ్‌దేశ్‌పాండే పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సి.రాంచంద్రారెడ్డికి నిరాశే మిగిలింది. స్వతంత్రంగా పోటీ చేయాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు.

ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు గుమిగూడారు. బీసీ కోటాలో టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న పీసీసీ కార్యదర్శి సుజాతకు కూడా చుక్కెదురు కావడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జాబితాలో ఒక్క బీసీ నేతకు అవకాశం ఇవ్వక పోవడాన్ని బీసీలందరు తీవ్రంగా పరిగణిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. ముథోల్ టిక్కెట్ కోసం అనేక ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు కూడా ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో మంగళవారం తన అనుచరులతో సమావేశమవుతానని ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని పటేల్ పేర్కొన్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టిక్కెట్ దక్కని నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోన్లు చేసి బుజ్జగించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement