సాక్షి, బోథ్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరిస్తారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండలం కోర్టా(కే) గ్రామంలో, గాయపడిన కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని.. అధైర్యపడవద్దని అనితను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని, అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని కొనియాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల నరికివేత, ఆక్రమణల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని... అడవులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవన్న, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్, మల్లికార్జున్ రెడ్డి, జివి రమణ, పాకాల రాంచందర్, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment